Wednesday, January 8, 2025

జల్లికట్టు (వాడివాసల్‌) నవలా రచయిత సి.పస్‌. చెల్లప్ప పరిచయం

 

 

 

జల్లికట్టు (వాడివాసల్‌) నవలా రచయిత 

సి.పస్‌. చెల్లప్ప పరిచయం

......................

సి.ఎస్‌. చెల్లప్ప (1912`1998) ప్రముఖ తమిళ రచయిత, సాహితీ విమర్శకులు. ఆనాటి మధురై 

జిల్లాలోని ఓ గ్రామంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు సిన్నమనూర్‌ సుబ్రమణ్యం చెల్లప్ప. గాడ్యుయేషన్‌ పూర్తయిన తరువాత ఒక వారపత్రికలో పనిచేసేందుకు మద్రాస్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కథా రచనలో ఆయనది అందెవేసిన చేయి. 1930ల నుంచీ తమిళ సాహిత్యంలో ఆధునికతా ఉద్యమానికి కేంద్ర బిందువుగా వున్న మనికొడి రచయితల సంఘంలో కీలక పాత్ర పోషించారు. ఆయన జీవితాన్ని రెండు భాగాలుగా విభజిస్తే తొలి దశ భారత స్వాతంత్య్రోద్యమంతో, మలి దశ సాహిత్యోద్యమాలతో పెనవేసుకుపోయి కనిపిస్తుంది. 1941 బట్లగుండు సత్యాగ్రహంలో పాల్గొని ఆరునెలల జైలు శిక్ష అనుభవించారు.   

 ఆయన అనేక కథలు, కవితలు, వ్యాసాలు, నాటికలు రాశారు. మూడు నవలు` వాడివాసల్‌, జీవనాంశంసుతంతిర తగంలను రచించారు. మొత్తం ఇరవై తొమ్మిది పుస్తకాలను ప్రచురించారు. చాలావరకు తన పుస్తకాలను తానే తిరుచ్చి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లోని కాలేజీలను సందర్శిస్తూ, ఇంటింటికి తిరుగుతూ అమ్ముకునేవారు. ఆయన ఇల్లు అమ్ముడుపోని పుస్తకాలతో, అముద్రిత రచనలతో నిండివుండేది. 

తనకున్న పరిమిత ఆర్థిక వనరులతోనే ఆయన ఎజుతుఅనే సాహిత్య పత్రికను స్థాపించి 

దశాబ్దకాలంపాటు (1959`1970) నిర్వహించారు. ఆధునిక తమిళ సాహిత్యానికి, ముఖ్యంగా వ్యాకరణ సాంప్రదాయిక సంకెళ్లను తెంచుకుంటూ అప్పుడే వస్తున్న నూతన కవిత్వానికి ఆ పత్రిక ద్వారా వెన్నుదన్నుగా నిలిచారు.   ఎన్ని ఇంబ్బందులు ఎదుర్కొంటున్నా తన ఆత్మగౌరవాన్నీ, ఆత్మ విశ్వాసాన్నీ ఎప్పుడూ కోల్పోలేదు. 

జీవితాంతం అవార్డులకు దూరంగా వున్నారు. చివరికి జీవిత చరమాంకంలో అమెరికన్‌ తమిళ సాహిత్య సంఘం వారు నగదు బహుమతిని స్వీకరించమని ఒత్తిడి చేసినప్పుడు ఆ డబ్బును తన మూడు భాగాల అముద్రిత సుతంతిర తగం (ద థరస్ట్‌ ఫర్‌ ఫ్రీడమ్‌) నవల ప్రచురణకు వెచ్చించమని కోరుతూ అంగీకరించారు.  కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఆయన మరణానంతరం 2001లో అదే నవలకు అవార్డును ప్రదానం చేశారు. 

ఆయన రచనల్లో వాడివాసల్‌ (జల్లికట్టు) తలమాణికమైనది. అకాడమీ అవార్డును అందుకున్న భారీ నవల సుతంతిర తగంకంటే కూడా వాడివాసల్‌నవలే ఎక్కువ ప్రాచుర్యం పొందింది. జల్లికట్టు క్రీడపై వచ్చిన తొలి నవలల్లో ఒకటైన వాడివాసల్‌ ఏడు దశాబ్దాల తరువాత ఇప్పటికీ కూడా తమిళనాట విశేష పాఠకాదరణతో పునర్ముద్రణలను పొందుతూనే వుంది. 

 

సి.ఎస్‌. చెల్లప్ప గురించి ఆయన కుమారుడు చెల్లప్ప సుబ్రమణ్యన్‌:

మా నాన్న

..


.

నేను పుట్టినప్పుడు మా నాన్న వయసు నలభై ఐదు సంవత్సరాలు. ఎన్నో కాన్పులు పోయిన తరువాత మా అమ్మ నాకు జన్మనిచ్చింది. అప్పుడు  మేం చెన్నైలో మధ్యతరగతివాళ్లు ఎక్కువగా నివసించే ట్రిప్లికేన్‌లోని ఓ అద్దె ఇంట్లో వుండేవాళ్లం. లేకలేక పుట్టిన సంతానాన్ని కాబట్టి నా తల్లిదండ్రులు నన్నేదో మహాగారాబంగా పెంచి వుంటారని అనుకుంటారేమో. కానీ అదేం లేదు. చాలా కఠినమైన క్రమశిక్షణతో పెంచారు నన్ను. ఓ చాక్లెట్లు లేవు.. ఐస్‌ క్రీములు లేవు. టైం ప్రకారం చదువుకోవాలి.. టైం ప్రకారం తినాలి. బయటకు వెళ్లడానికి వీల్లేదు. వీధిలో నా తోటి పిల్లలతో ఆడుకోడానికి వీల్లేదు. అసలు వాళ్లతో మాట్లాడనిచ్చేవారే కాదు. మా నాన్న ఎప్పుడూ నన్ను ఓ కంట కనిపెడుతూ వుండేవారు. మా అమ్మ కూడా అంతే అని మా బంధువులు చెప్పుకునేవారు. కానీ ఇవాళ నేను వెనుతిరిగి చూసుకుంటే ఆనాడు వాళ్లంత క్రమశిక్షణగా పెంచడం వల్ల నాకు మేలే జరిగిందనిపిస్తుంది. 

మా నాన్నకు నన్ను మరీ అతిగా హద్దుల్లో పెడుతున్నానిపించేదో ఏమో అప్పుడప్పుడూ తనతో పాటు సినిమాలకి తీసుకెళ్తుండేవారు. అయితే తనకు నచ్చిన సినిమాలకే అనుకోండి. అలాగే ఒకోసారి మా ఇంటికి దగ్గరలోని బీచ్‌కి కూడా తీసుకెళ్లేవారు. ప్లాస్టిక్‌ బ్యాటు, బాల్‌ పట్టుకుని మా ఇంటి ఆవరణలో నాతో హౌస్‌ క్రికెట్‌ ఆడేవారు. ఆరోజుల్లో పాత నెహూృ స్టేడియంలో జరిగిన ఒకటి రెండు టెస్ట్‌ మ్యాచ్‌లకు కూడా తీసుకెళ్లారు. 

మా నాన్నకూ నాకూ వయసులో ఎక్కువ వ్యత్యాసం వుండటం వల్లనో ఏమో మా మధ్య మాటలు పరిమితంగా వుండేవి. ఆయన తరచూ పెద్ద పెద్ద ఇంగ్లీషు పుస్తకాలను తెచ్చుకుని చదువుకుంటూ కూర్చునేవారు. అంతంత భారీ పుస్తకాలను ఎలా చదువుతారా అని నాకు ఆశ్చర్యంవేసేది. ఒకోసారి ఆ పుస్తకాలను తీసుకురావడానికి తనతోపాటు బ్రిటిష్‌ కౌన్సిల్‌కూ, యూఎస్‌ఐఎస్‌ గ్రంధాలయానికీ నన్ను వెంటబెట్టుకుని వెళ్లేవారు. 

ఆయన ఎప్పుడూ నా చదువులో జోక్యం చేసుకునేవారు కాదు. నాకు పాఠాలు చెప్పేందుకు ప్రయత్నించేవారు కాదు. వార్షిక సెలవుల తర్వాత పాఠశాలల్ని తిరిగి తెరచినప్పుడు మాత్రమే ఆయన నా పుస్తకాలను ముట్టుకునేవారు. గోధుమరంగు పేపర్‌ తెచ్చి ఆ కొత్త పుస్తకాలకు చక్కగా అట్టలు వేసిచ్చేవారు. మొదటినుంచీ నాకు ప్రతి పరీక్షలో మంచి మార్కులే వచ్చేవి. అందుకు ఆయన లోలోపల సంతోషించేవారో లేదో తెలియదు కానీ తన స్పందనను ఎప్పుడూ పైకి వ్యక్తం చేసేవారుకాదు. 

ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా నన్ను పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వరకూ నిరాటంకంగా చదివించారు. అయితే పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చివరి సంవత్సరంలో వుండగానే నాకు ఓ జాతీయ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఆ సంగతి చెప్పినప్పుడు ఆయన నిర్లిప్తంగా వుండిపోయారు. ఆయన మొహంలో ఏమాత్రం ఆనందం కనపించలేదు. బహుశ నన్ను ఇంకా చదివించాలనీ, నాచేత డాక్టరేట్‌ చేయించాలనీ వుండేదేమో తెలియదు. కానీ, మా అమ్మ మాత్రం ఎంతో సంతోషించింది. మా ఇంటి ఆర్థిక పరిస్థితి రీత్యా ఆ ఉద్యోగాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోవద్దని చెప్పింది. నాకూ అదే అభిప్రాయం వుండడంతో చదువుకు స్వస్తి చెప్పాను. 

మంచి మార్కులు వచ్చినా నన్ను ఇంజనీరింగ్‌లో చేర్పించలేకపోయానని మా నాన్న తరచూ బాధపడేవారు. నేను ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే ఆయన చెన్నై నుంచి మా సొంతూరుకు మకాం మార్చారు. తన సాహిత్య వ్యాసంగాన్ని పక్కనబెట్టి పల్లె బాట పట్టడం ఆయనకు అదే తొలిసారి. అక్కడ మా పెరట్లో మాకు కావలసిన కూరగాయాలను పండిస్తూ సంతోషంగా కాలం గడపేవారు.

కానీ, కొన్నేళ్ల తర్వాత ఎందుకోగానీ ఉన్నట్టుండి తిరిగి చెన్నైకి మకాం మార్చి గతంలో మాదిరిగానే తన సాహితీ వ్యాసంగాన్ని తిరిగి కొనసాగించారు. ఏదో స్వల్ప విరామం కోరుకుని  మా సొంతూరుకు వెళ్లి వచ్చారేమో అనిపించింది. తనకి స్వాతంత్య్ర సమరయోధుల ఉచిత రైల్వేపాస్‌ వుండేది. దాని సాయంతో ఒకసారి దిల్లీకి వెళ్లి రాజ్‌ ఘాట్‌నీ, బిర్లా హౌస్‌నీ సందర్శించి వచ్చారు. మరే ఇతర చోట్లకి వెళ్లలేదు. నా తీర్థయాత్ర దీంతో ముగిసినట్టేఅని చెప్పారు. ఆయన తన జీవితంలో సగభాగం గాంధీయిజానికీ, మిగతా సగభాగం సాహిత్య సేవకూ వెచ్చించారు.

వయోభారం వల్ల క్రమంగా ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలయింది. మా అమ్మ కూడా ఆ వయసులో రోజువారీ పనులు చేసుకోడానికి చాలా ఇబ్బంది పడేది. దాంతో వాళ్లిద్దరూ ఉద్యోగ రీత్యా బెంగుళూరులో వుంటున్న నా దగ్గరకు వచ్చేశారు. మనవడూ మనవరాలితో ఉల్లాసంగానే కాలక్షేపం చేస్తుండేవారు. మా నాన్నకు మాత్రం ఎందుకో ఇక్కడి వాతావరణం అంతగా నచ్చేది కాదు. రెండోసారి జైల్లో వేసినట్టు అనిపిస్తోంది నాకు అనేవారు. (మొదటిసారి ఆయన ఒక స్వాతంత్య్ర సమర యోధుడిగా జైలు శిక్ష అనుభవించారు). కాకపోతే బెంగుళూరులో వున్నప్పుడే ఆయన తన రచనల్లో మాగ్నం ఓపస్‌ లాంటి ‘సుతంతిర తగంనవలను రాశారు. తదనంతరం మళ్లీ చెన్నైకి వెళ్లిపోయి 1997లో ఆ నవల ప్రచురణ పనులు చూసుకున్నారు.  

ఆయన తన జీవితమంతా చాలా నిరాడంబరంగా గడిపారు. భౌతిక సౌకర్యాలపట్ల ఎప్పుడూ ఆసక్తి చూపలేదు. చేతులతో ఉతుక్కున్న ధోతీనీ, షర్టునీ ఇస్త్రీ లేకుండా ధరిస్తుండేవారు. వివిధ ఆరోగ్య సమస్యల వల్ల ఆయన తన జీవితంలో ఏడుసార్లు ఆసుపత్రులపాలయ్యారు. ఆరోగ్యం కుదుటపడి ఇంటికి తిరిగి వచ్చిన ప్రతిసారీ దేవుడు ఇంకా రచనలు చేయమని నా జీవితాన్ని పొడిగించాడుఅనేవారు. అలా ఆయన తన జీవిత చరమాంకం వరకూ రచనలు చేస్తూనే వున్నారు. 

 

ఆయన అముద్రిత రచనలు కొన్ని ఇప్పటికీ అలాగే వుండిపోయాయి. ఒకసారి ఆయన నాతో నువ్వయితే అరవై ఏళ్లకి పదవీ విరమణ చేయొచ్చు. కానీ నాకు మాత్రం అసలు పదవీ విరమణ అనేదే లేదుఅన్నారు. అలా ఆయన తన చివరి క్షణాల వరకూ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు.

బీసెంట్‌ నగర్‌ స్మశాన వాటికలో నేను ఆయనకు కన్నీటితో నివాళులు అర్పిస్తూ ‘‘చెల్లప్ప ఇవాళ పదవీ విరమణ చేశారు’’ అన్నాను.

- చెల్లప్ప సుబ్రమణ్యన్‌

మార్చి 2013

జల్లికట్టు నవల 

వెల: రూ. 100

ISBN :  978-81-957161-3-5

ప్రతులకు: 

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ; ఫోన్ నెం. 93815 59238

 

Jallikattu

Order your book at HBT Website:- 

https://hyderabadbooktrust.com/products/jallikattu-c-s-chellappa?

sku_id=58348914

Amazon Website : 

https://www.amazon.in/dp/B0DQT8ZZVB

 


No comments:

Post a Comment