బతకడమో-గౌరవంగా చావడమో అంతా నా చేతుల్లోనే ఉంది.
-----కొండవీటి సత్యవతి
....................
"అడుగడుగున తిరుగుబాటు" గీతా రామస్వామి రాసిన ఆమె ఆత్మకథ చదవడం పూర్తయ్యాక ఎన్నో రకాల భావాలు మనసులో కదిలాయి.
పుస్తకం చేతిలోకి తీసుకున్న తర్వాత చాలా వేగంగా అధ్యాయం తర్వాత అధ్యాయం పూర్తి చేస్తున్నప్పుడు గీత జీవితంలో ఎదురైన ఎన్నో సంఘటనలు చాలా ఆశ్చర్యం కలిగించాయి.
తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆమె ఇబ్రహీంపట్నం మాదిగ వాడల్లో మాదిగ కుటుంబాలతో కలిసి బతికిన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. తిరుగుబాటు ఆమె రక్తంలోనే ఉన్నట్లుగా ఎన్నో సంఘటనలు నిరూపించాయి. తల్లిదండ్రులతో పోరాటం చివరికి తనకి మానసిక సమస్య ఉన్నట్లుగా భ్రమించి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేంత భయంకరమైన అనుభవం నుంచి తన కోలుకున్న విధానం ఒళ్ళు జరదరించేలా తను వివరించింది.
సాధారణంగా ఆత్మకథల్లో కొన్ని అర్థసత్యాలు, మరికొన్ని అబద్ధాలు ఉండడం సాధారణంగా చూస్తాం. కానీ గీత తన జీవితంలో ఎదురైన ప్రతి అనుభవాన్ని విశ్లేషించుకుంటూ ఎక్కడా వాటిపైన తెరలు వేయకుండా కుండబద్దలు కొట్టినట్లు వివరించింది. అది తల్లిదండ్రుల గురించి అయినా తన సొంత అక్క భర్త గురించైనా ఏమీ దాపరికం లేకుండా వివరించడం, ఎంతో ధైర్యంగా ప్రజల్లోకి తీసుకురావడం చాలా ఆశ్చర్యకరం.
చదువుకునే రోజుల్లోనే ఎంతో ధైర్యంతో ఆలోచించిన గీత తన తల్లి గురించి ఒకచోట చెప్తుంది. ఆడపిల్లలు బాగా చదువుకోవాలని స్త్రీగా బతకడం అంటే కష్టాల కొలుముల్లో ఉండటమేనని ఆ కష్టాలను కొంతైనా తప్పించుకోవాలంటే చదువు ఒక్కటే మార్గమని మా మనసుల్లో బాగా నాటుకుపోయేలా చేసిందామె. ఒక విధంగా అమ్మ నాకు మొట్టమొదటి ఫెమినిస్ట్ అని గీత ఒక సందర్భంలో అంటారు.
యుక్త వయసులో ఉన్నప్పుడే బహిష్టు గురించి సైన్స్ చెప్పే అంశాలను అర్థం చేసుకుంటూ 'బహిష్టు అనేది బిడ్డ పుట్టుకతో ముడిపడిన ప్రకృతి సిద్ధమైన, సహజమైన జీవ ప్రక్రియ అని నేను పాఠ్యపుస్తకాల ద్వారానే తెలుసుకున్నాను. ఆహార పదార్థాలు కుళ్ళి పాడైపోతున్నాయి అంటే అది వాటిలో ఉండే సూక్ష్మ క్రిముల వల్ల తప్ప బహిష్టైన స్త్రీ ముట్టుకున్నందువల్ల కాదని అర్థం చేసుకున్నాను.' అంటూ బహిష్టు గురించి చాలా సైంటిఫిక్ గా
వివరించింది.
1971 లో పాఠశాల చదువు ముగించుకుని బయటకు వస్తున్నప్పుడు "ఇక నేను సాంప్రదాయక బ్రాహ్మణ ప్రపంచాన్ని వదిలేసి దూరంగా వెళ్లడం తప్పదని, ఆ భారం మోయడం స్త్రీలకి మరీ కష్టమని అర్థమయిపోయింది. దాన్నుంచి బయటపడాలంటే స్వతంత్రంగా నేనొక వృత్తిని ఎంచుకోవటమే మార్గమని నిర్ణయానికి వచ్చేసాను. ఇలాంటి ఆలోచనలతో హై స్కూల్ చదువు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నప్పుడు నాకు నేను రెండు వాగ్దానాలు చేసుకున్నాను. ఒకటి జీవితంలో ఏ పురుషుడి ముందుసాగిల పడకూడదు. రెండు నాలోని సామర్ధ్యాలను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు సకల శక్తులు ఒడ్డాలి. నాకు ఇక ఆకాశమే హద్దు." ఇలాంటి నిర్ణయం తీసుకుని ఆమె విశాల ప్రపంచంలోకి యూనివర్సిటీ, చదువులోకి అడుగు పెట్టింది.
యూనివర్సిటి లో చదుకున్నప్పటి అనుభవాలను, జార్జి రెడ్డి హత్య,1974 లో ప్రగతిశీల మహిళా సంఘం ఏర్పాటు,వివిధ అంశాలపై చేసిన ఉద్యమాల గురించి ఎన్నో వివరులున్నాయి.
పీడీ ఎస్ యూ లో పనిచేసినప్పటి అనుభవాలను గురించి రాస్తూ" మేం ప్రజా ఉద్యమాలలో భాగమయ్యాం.జనంతో మమేకమై,విస్త్రుత ప్రజా ఉద్యమాల్లో పాలుపంచుకుంటున్న వారికి ఎవరికైనా అది గొప్ప విముక్తి భావననిస్తుంది.మన వైఖరులు మారతాయి,అభిప్రాయాల్లో
స్పస్టత వస్తుంది.కొత్త సంబంధాలు ఏర్పడతాయి.ఐక్యత చిగురిస్తుంది.ఇక ధైర్యం,స్థైర్యం అనూహ్యంగా పెరుగుతాయి.ఒక్కసారిగా మన సత్తా ఎంతటిదో,మన శక్తి సామర్థ్యాలు లేమిటో మనకు తెలిసి వస్తాయి"అంటారు.
ఆ తర్వాత పార్టీలో పనిచేసినప్పటి అనుభవాలను గురించి రాసారు.
ఒకచోట పార్టీ ధోరణి గురించి రాస్తూ "పార్టీ ధోరణి చూస్తే-మనం కులాన్ని పట్టించుకోకుండా ఉంటే చాలు,కుల సమస్య పోయినట్టే అన్నట్టుగా ఉండేది.నాకూ నాలాంటి మరెంతో మందికీ 1985 లో కారంచేడు ఊచకోత సంఘటన జరిగే వరకూ కూడా కులం అనేది పెద్ద సమస్యగా కనిపించలేదు.మా మనసుల నిండా వర్గం గురించిన ఆలోచనలే ఉండేవి....కారంచేడు ఘటన ఈ పరిస్థితిని సమూలంగా మార్చేసింది."
తను పనిచేసిన పార్టీ మీద అనేక విమర్శలు చేయడం కనిపిస్తుంది."పార్టీలో ఉన్న మహిళలకు పుట్టే పిల్లల గురించి ఆలోచన ఉండదు, వారి జీవితాల్లో విషాదాల గురించి పట్టించుకోరు."
1975 ఎమర్జెన్సీ అనుభవాలు,పార్టీని విడిచి పెట్టడం గురించిన వివరాలు రాస్తారు.అదే సంవత్సరం సిరిల్ తానూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకోవడం,తల్లితండ్రులు ఆమెని బలవంతంగా మద్రాస్ తీసుకెళ్ళిపోవడం,ఒక మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళి దారుణంగా తనకి ఎలక్ట్రిక్ షాక్ ఇప్పించడం గురించి రాసిన అనుభవం హృదయవిదారకంగా ఉంది.ఆ తర్వాత మోటార్ బైక్ మీద మద్రాస్ నుండి బెంగుళూరుకి,అక్కడి నుండి హైదరాబాద్ కు తప్పించుకుని పారిపోయిన వైనం హమ్మో! గీతా అనిపించక మానదు.
ఎలక్ట్రిక్ షాక్ సంఘటన చదువుతున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. గీత ఎంత బాధ పడి ఉంటుందో నేను ఊహించలేకపోయాను.
ఈ పుస్తకంలో ఈ సంఘటన చదివే వాళ్ళందరూ తప్పకుండా కన్నీళ్లు పెట్టుకుంటారని నేను అనుకున్నాను.
ఆ తర్వాత గీత పార్టీలో పనిచేసిన అనుభవాల గురించి చాలా క్రిటికల్ గా రాయడం కనిపించింది అడవుల్లో అజ్ఞాతంలో ఉండే మహిళల పట్ల మహిళా కామ్రేడ్ల పట్ల ఎలా ప్రవర్తిస్తారో రాస్తూ "నిస్సందేహంగా విప్లవం అంటే విందు పార్టీ కాదు" అని తేల్చేసింది. క్రమంగా తాను పార్టీకి ఎలా దూరమైందో రాస్తూ నాయకులతో రాజకీయ నాయకుల వ్యక్తిగత ప్రవర్తన పట్ల తనకు చాలా ఏవగింపు కలిగింది. ఒకచోట పార్టీ గురించి రాస్తూ మార్కిస్ట్, లెనినిస్ట్ ఎం ఎల్ వర్గాల అవగాహన అంతా కూడా ప్రధానంగా మూడు సైద్ధంతిక భావనల చుట్టూనే తిరుగుతుంటుందని అర్థ భూస్వామ్యం (సెమీ ఫ్యూడలిసం) అర్ధ వలసవాదం(సెమీ కలోనియలిసం) దళారీ బూర్జువా వర్గం... దేశంలో నెలకొన్న అణిచివేత పరిస్థితులను వివరించేందుకు తరచూ మహా పర్వతాలు లాంటి ఈ మూడు భావనలనే ముందు పెడుతుంటారు. దశాబ్దాలుగా వల్లె వేస్తున్న ఈ మూడు పడికట్టు పదాలను వినీ వినీ నాకు మహా చికాకు వచ్చేసింది."
ఆ తర్వాత 1976లో హైదరాబాద్ వదిలిపెట్టి చండీగర్ వెళ్లిపోయిన అనుభవాల గురించి చాలా వివరంగా పుస్తకంలో రాసింది.
ఘజియాబాద్ లో బాల్మీకి అనే కమ్యూనిటీతో పనిచేసిన అనుభవాలను వారి ప్రేమాభిమానాల గురించి రాస్తూ "ఆ రోజుల్లో ఒకటి రెండు సార్లు ఆత్మహత్య చేసుకుందామని దగ్గర్లో ఉన్న రైలు పట్టాల వరకు వెళ్లాను కూడా. 'ఆత్మహత్య చేసుకుంటావా అయితే చేసుకో' అన్న సిరిల్ మాటలే నన్ను వెనక్కి లాగాయి. ఆ మాటలు వింటుంటే ఉక్రోషం పొంగుకొచ్చేది. నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించనందుకు తనమీద విపరీతమైన కోపం వచ్చేది. కనీసం సానుభూతిగా ఒక మాట అయినా అనొచ్చుగా అని ఉడికిపోతూ వెంటనే తిరిగి వచ్చేసేదాన్ని. "నచ్చినా నచ్చకున్నా ఇది జీవితం ఎదుర్కో.." అన్నట్టు ఉండేవి తన మాటలు.తాను పనిచేసిన బాల్మీకీలే తనను కాపాడారని,తాను పూర్తిగా కుప్పకూలిపోకుండా వారే కాపాడారని ఎంతో ఆర్తితో చెపుతుంది ఒకచోట.
ఎప్పుడు ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోదామా అని తనకు అనిపిస్తూ ఉండేదని ఎట్టకేలకు 1980లో హైదరాబాద్ కు తిరిగి రాగలిగామని అలా రావడం వెనక తనని ప్రోత్సహించిన వ్యక్తి అజయ్ సిన్హా అని ఆయన సిరిల్ కి, జాజిరెడ్డికి సన్నిహిత మిత్రుడు అని ఒక చోట రాస్తుంది.
1980 లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ను ఏర్పాటు చేయడం తనలో పేరుకుంటున్న డిప్రెషన్ కు మంచి ఔషధంగా పనిచేసిందని ఎంతో ఉత్సాహంతో ఆ పనుల్లో మునిగిపోయాయని చెబుతుంది. మెల్లగా హెచ్ బి టి పనుల్లో మునిగిపోయి తను రాష్ట్రమంతా తిరిగిన అనుభవాల గురించి కూడా రాస్తుంది. క్రమంగా హెచ్ బి టి ప్రాచుర్యం పొంది ఎన్నో అద్భుతమైన పుస్తకాలను ప్రచురించందని 1982 తనకి గొప్ప అనుభూతులను ఇచ్చిన సంవత్సరం అని అంటుంది.
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ లో పనిచేయడం మొదలుపెట్టిన నాలుగు సంవత్సరాలు తర్వాత తిరిగి రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనాలన్న తన చిరకాల వాంఛ తిరిగి తలెత్తింది.
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పనుల మీద ఆంధ్ర రాష్ట్రమంతా తిరుగుతున్నప్పుడు కత్తి పద్మారావు గారి లాంటి వ్యక్తులను కలుసుకున్నానని అలాగే బొజ్జా తారకం గారిని కలుసుకున్నానని రాస్తూ హక్కుల యోధుడు, అంబేద్కరిస్ట్, ప్రముఖ కవి, రచయిత, సీనియర్ న్యాయవాది తారకం రచనలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతి గ్రామానికి చేరాయి రెండు రాష్ట్రాల్లో దళిత కుటుంబాలను ఆయన మాటలు తాకాయని, చిక్కడపల్లి లో ఉండే తన ఇంటికి బొజ్జాతారకం ఇల్లు చాలా దగ్గరని తరచూ వారి ఇంటికి వెళ్లే దానిని చెబుతూ ఆ సమయంలో విజయభారతి తనను అక్కున చేర్చుకున్నారని తనకు మరొక కుటుంబంలా మారిపోయారని చాలా ఆత్మీయంగా వారిరువురి గురించి రాస్తుంది.
ఆ తర్వాత సవాలక్ష సందేహాలు పుస్తకం పనిమీద ఇబ్రహీంపట్నం వెళ్లడంతో తన జీవితంలో అత్యంత కీలకమైన మార్పు చోటు చేసుకుందని రాస్తూ ఇక అక్కడ నుండి పుస్తకం మొత్తం ఇబ్రహీంపట్నంలో తాను నిర్వహించిన పోరాటాల చరిత్రను చాలా వివరంగా సుదీర్ఘంగా రికార్డు చేసింది. మొదటిసారి ఇబ్రహీంపట్నం వెళ్ళినప్పుడు తన వయస్సు 30 సంవత్సరాలు.
ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల గ్రామాల్లో ముఖ్యంగా జబ్బార్గూడెం, పులిమామిడి లాంటి గ్రామాల్లో జరిగిన భూ పోరాటాలు గురించి
ఇబ్రహీంపట్నం భూ పోరాటాలు ఉద్యమాలు రెడ్డి భూస్వాముల ఆగడాలు వారి క్రూరత్వం గ్రామీణ ప్రజల పట్ల వారి దౌర్జన్యాలు చదువుతున్నప్పుడు గుండె మండిపోతుంది.
ఎన్నో సంవత్సరాల పాటు సాగిన ఈ ఉద్యమాలు అందులో గీతా రామస్వామి పోషించిన ముఖ్యమైన పాత్ర నిజానికి అందరూ చదవాల్సి ఉంది. సైకిల్ మీద తిరుగుతూ ఎంతో ధైర్యంగా గ్రామాల్లోకి వెళుతూ గ్రామస్తులకు, వారు చేస్తున్న భూ పోరాటాలకు అండగా నిలిచిన గీత అనుభవాలను చదివి తీరాల్సిందే. ఈ పోరాటాల సమయంలో తన మీద జరిగిన హత్యా ప్రయత్నాలు, దాని నుండి తాను ఎట్లా బయటపడింది ఇవన్నీ కూడా ఎవరికి వారు చదివి అర్థం చేసుకోవాల్సిందే.
ముఖ్యంగా ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గీత ఇబ్రహీంపట్నంలో అత్యంత వెనుకబడిన గ్రామాల్లో మాదిగ వాడల్లో వారితో పాటే బతుకుతూ ఆ తిండే తింటూ సాగించిన పోరాటాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఈనాటి తరానికి దారి దీపాలుగా అనిపించక మానవు.
కోర్టుల్లో జరిగిన న్యాయ పోరాటాలు ఆయా సందర్భాల్లో తన ఎదుర్కొన్న మానసిక సంఘర్షణలు, భౌతిక దాడులు వీటన్నింటిని చదువుతున్నప్పుడు గుండెలవిసిపోయాయి.
గీత ఒకచోట ఇలా రాస్తుంది "అట్టడుగు కులాల వారు మన మీద ఎందుకంత ఆగ్రహంతో ఉంటారని మనలోని ఆధిపత్య కులాల వాళ్ళు తరచూ ఆశ్చర్యానికి గురవుతుంటారు. కుల నిర్మూలనకు ఎంతో కొంత ప్రయత్నిస్తుంటాం కాబట్టి మనకు అప్పటి కుల వివక్షతో ఎలాంటి సంబంధం లేదని భావిస్తాం. కానీ మన పూర్వీకులు అట్టడుగు కులాల వారి పట్ల ఎలా ప్రవర్తించేవారో అతి తక్కువ వేతనాలు ఇస్తూ వారి చేత ఎంత దారుణంగా పనిచేయించుకునేవారో, ఎలా వెట్టిచాకిరి చేయించుకునేవారో, వాళ్ల పొలాలను ఎలా ఆక్రమించుకునేవారో, వారి పంటలను ఎలా దోచుకునేవారో వారి స్త్రీలపై ఎలా అత్యాచారాలకు పాల్పడేవారో, వారిని ఎంత ఘోరంగా చిత్రహింసలకు గురి చేసేవారో, వారి పిల్లల్ని పశువుల కాపరులుగా ఎలా మార్చేసేవాళ్ళో, ఐక్యం కాకుండా ఎలాంటి రాజకీయాలు ప్రయోగించేవారో అట్టడుగు కులాల వారు ఎలా మర్చిపోగలుగుతారు" అంటుంది.
ఇంకొక చోట "ఈనాటి తెలంగాణ ప్రాంత రెడ్ల, వెలమల సిరిసంపదలకు ఆనాటి వారి పూర్వీకులు చేసిన దోపిడీకి మధ్య చాలావరకు అవినాభావ సంబంధం ఉంది. అయితే తాత ముత్తాతలు ఎప్పుడో చేసిన పాపాలకు ఈనాడు వారి పిల్లలను నిందించడం సబబేనా అనే ప్రశ్నలు చాలామంది అడుగుతూ ఉంటారు"
ఇక్కడ నేనొక అంశం చెప్పాలనుకుంటున్నాను. ఈమధ్య దళిత స్త్రీ శక్తి అనే సంస్థ ఒక పబ్లిక్ హీరింగ్ ని ఆర్గనైజ్ చేసింది. అందులో బాధితులంతా రంగారెడ్డి చుట్టుపక్కల గ్రామాల్లోని దళిత స్త్రీలు, పురుషులు. ఆయా గ్రామాల్లోని రెడ్లు వారిపట్ల చేసిన దారుణాల గురించి, అత్యాచారాల గురించి, వారి భూములను ఆక్రమించుకోవడం గురించి ఆ నాటి పబ్లిక్ హియరింగ్ లో చాలా వివరంగా చెప్పారు.
తెలంగాణ ప్రాంత భూస్వాముల రక్త చరిత్ర ఇంకా కొనసాగుతూ ఉండడం ఈ పబ్లిక్ హియరింగ్ లో స్పష్టంగా కనబడింది. దోపిడీ రూపం మారి ఉండొచ్చు కానీ ఇప్పటికీ గ్రామాల్లో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాల గ్రామాల్లో ఎన్నో అక్రమాలు, అన్యాయాలు జరుగుతుండడం వాస్తవం.
"అడుగడుగున తిరుగుబాటు" పుస్తకంలో గీత దాదాపు 200 పైన పేజీలు ఇబ్రహీంపట్నం భూ పోరాటాల గురించి, ఒక్కొక్క పోరాటం గురించి ఆ పోరాటంలో పాల్గొన్న వ్యక్తుల గురించి ముఖ్యంగా మహిళల గురించి రాసిన విషయాలన్నీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మాదిగ మహిళల జీవన విధానాలు, వారి పోరాటాలు కచ్చితంగా అందరం చదవాల్సిందే.
ఇబ్రహీంపట్నం భూపోరాటాల సమయంలో గీత మీద జరిగిన రెండు హత్యా ప్రయత్నాలు చదువుతున్నప్పుడు చాలా ఉద్విగ్నంగా అనిపించడంతోపాటు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఏమీ ఆ పోరాట స్ఫూర్తి ఏమి ఆ ధైర్యం అనిపించక మానదు.
పుస్తకంలో మనసు చివుక్కమనే కొన్ని సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పులు దండ వేయడం, గాజులు తొడగడం ఇలాంటి సంఘటనలు చదువుతున్నప్పుడు కొంచం ఇబ్బందికరంగా అనిపించింది. అలాగే కొంతమంది తెలిసిన మితృలు గీత ఇంటి మీద దాడి చేసిన సంఘటన కూడా చదవడానికి చాలా కష్టంగా అనిపించింది.
చాలా ధైర్యంగా ఎలాంటి దాపరికం లేకుండా తన కుటుంబ విషయాలతో పాటు తన మిత్రులు చేసిన అవమానకర చర్యలను రాయగలగడం నిజానికి చాలా కష్టమైన పని. అయినప్పటికీ గీత దేనిని దాచుకోకుండా అన్నింటిని రాయగలిగింది.
ఈ పుస్తకంలో ఎంతోమంది పరిచయం ఉన్న వ్యక్తులు తారసపడతారు. కొన్నిచోట్ల వాళ్ళ వ్యక్తిత్వాలు గురించి చదివి చాలా ఆశ్చర్యపడ్డాను.
పుస్తకం చదివి చివరి పేజీల్లోకి వచ్చినప్పుడు పోరాటాల్లోనూ, ఉద్యమాల్లోనూ జీవితాన్ని గడిపిన గీత తనకంటూ ఓ పాప కావాలి అనుకోవడం ఆ సంఘటన గురించి రాయడం చాలా హృద్యంగా అనిపించింది. తనకంటూ ఓ బిడ్డ కావాలనుకుని
కన్నది. బిడ్డను పెంచుకోవడంలో మునిగిపోయి ఇబ్రహీంపట్నం పోరాటాలకు పుల్ స్టాప్ పెట్టినట్లు అయింది. అయితే తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేస్తారనే భయం వల్ల కూడా ఆ తర్వాత తను ఇబ్రహీంపట్నం వెళ్లలేకపోయింది.
ఈ పుస్తకం చదివి దీని మీద చాలా వివరమైన సమీక్ష రాయాలనుకున్నాను. నా సన్నిహితమితృరాలు చేసిన గొప్ప పోరాటాలు, ఒక్కొక్క పోరాటం గురించి చదువుతున్నప్పుడు గొప్ప విభ్రమకు గురయ్యాను. మనతోనే ఉన్న గీతా రామస్వామి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్న విషయం ఈ పుస్తకం చదవకపోతే సూచనప్రాయంగా కూడా తెలిసేది కాదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ పుస్తకం చదవాలని నేను కోరుకుంటున్నాను. తన జీవితంలోని ఒక్కొక్క దశ, ఆ దశలో ఎదుర్కొన్న ఘర్షణలు, పోరాటాలు అన్ని చదువుతున్నప్పుడు ఎంతోమందికి ఆమె జీవితం ఆదర్శప్రాయం అవుతుందని, స్ఫూర్తిదాయకమవుతుందని నేను అనుకుంటున్నాను.
నాకు గీతంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి తెలుగు తప్ప వేరే భాషలు ఏమీ తెలియకుండా నగరాలకు వచ్చిన నాలాంటి వాళ్లకు గొప్ప గొప్ప పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది హైదరాబాద్ బుక్ ట్రస్ట్.ఇతర భాషల్లోంచి తెలుగులోకి అనువాదం చేయించి అందుబాటులోకి తెచ్చిన హైదరాబాద్ బుక్ ట్రస్ట్, దానిని నిర్వహిస్తున్న గీత రామస్వామి అంటే నాకు చాలా ఇష్టం.
ఇంగ్లీషులో ఉన్న అలాంటి గొప్ప పుస్తకాలను చదవలేని నాలాంటి వాళ్ళం ఈ బుక్స్ చదువుకుని ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. జీవితాన్ని ఎంతో విస్తరించుకున్నాం.అందుకే గీత మీద నాకు ప్రత్యేకమైన ఆత్మీయత. ఈ పుస్తకం పూర్తి చేసిన వెంటనే ఇబ్రహీంపట్నం వెళ్లాలని తను పేర్కొన్న ఆయా గ్రామాలకు కొన్నింటికైనా వెళ్లి చూసి రావాలని చాలా బలంగా అనిపించింది. నేనెప్పుడూ రాచకొండ గుట్టలకు ఇబ్రహీంపట్నం మీదుగానే వెళుతూ ఉంటాను గీత పేర్కొన్న గ్రామాల్లో చాలా గ్రామాలు ఆ దారిలో ఉన్నాయి. తన పోరాటాలు చేసిన ఆ గ్రామాలను ఒకసారి చూడాలని, ఆ పోరాటాల్లో మిగిలిన, జీవించి ఉన్న వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే మాట్లాడాలని అనిపించింది. తప్పకుండా ఈ ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలా తరచుగా నేను రాచకొండ గుట్టలవేపు ప్రయాణం చేస్తూ ఉంటాను. ఎన్నో సంవత్సరాల పాటు ఆయా గ్రామాల్లో గీత నిర్వహించిన భూ పోరాటాలు, వాటికి వేదికలైన ఆ గ్రామాలు చూడడం ఒక గొప్ప అనుభవమౌతుందని నాకనిపిస్తోంది.
ఇంకా ఎంతో రాయాలని చెప్పాలని అనిపిస్తున్నప్పటికీ ఇప్పటికే వ్యాసం చాలా చాలా పెరిగిపోయింది.
అందరూ తప్పనిసరిగా ఈ పుస్తకం చదవాలని నేను రికమెండ్ చేస్తున్నా. ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువాదం చేసిన ప్రభాకర్ మందార గారి అనువాదం చాలా తేటగా, ఒరిజినల్ లాగా ఉంది. అభినందనలు ప్రభాకర్ గారూ. గీత లవ్ యు... ఇంత మంచి పుస్తకాన్ని మనసు విప్పి రాసిన నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నువ్వు నా స్నేహితురాలు అయినందుకు గర్వంగా కూడా ఉంది. థాంక్యూ సో మచ్.
No comments:
Post a Comment