ముల్క్ రాజ్ ఆనంద్ తొలి నవల "అన్ టచబుల్" నవల పై
గాంధీ ప్రభావం అనే అంశం మీద నేను రాసిన సమీక్షా వ్యాసం
మొదటి భాగం ఆంధ్ర ప్రభ దినపత్రిక 12-6-2022 ఆదివారం సంచిక లో ...
ముల్క్‌రాజ్ ఆనంద్ తొలి నవల ‘అన్‌టచబుల్’కు స్ఫూర్తి ఏమిటి?
అంటరానితనం హిందూమతానికి ఒక మాయని మచ్చగా
భావించేవారు గాంధీజీ. భారత దేశం స్వాతంత్య్రాన్ని సాధించుకోవాలంటే నిమ్నకులాలూ
అగ్రకులాలూ అన్న తేడా లేకుండా హిందువులందరినీ ఏకం చేయడం, ముస్లింలకూ
హిందువులకూ మధ్య సామరస్యాన్నీ, సహోదరభావాన్నీ పెంపొందించడం చాలా అవసరమని బలంగా
నమ్మేవారు. ఈ దృష్ట్యానే ఆయన స్వాతంత్య్రోద్యమానికి ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో
అంటరానితనం నిర్మూలనకూ, హిందూ ముస్లిం ఐక్యతకూ అంతటి ప్రాధాన్యత
నిచ్చారు.
విభిన్న భాషలు, సంస్కృతులు, కులాలు, మతాలుగా...ఐదువందలకు
పైబడిన సంస్థానాలుగా, స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయి ఒకవిధంగా
దుర్బలస్థితిలో వున్న ఆనాటి భారతావనిని గాంధీజీ ఒక్క తాటిమీదకు తెచ్చేందుకు
అహర్నిశలు కృషి చేశారు. సత్యాగ్రహం, శాంతి, అహింసలనే తన ఆయుధాలుగా మలచుకున్నారు. పంచములుగా
పరిగణించబడుతూ దారుణమైన వివక్షను ఎదుర్కొంటున్న వారిని అక్కున చేర్చుకున్నారు.
వారికి దేవాలయాల్లో ప్రవేశం కల్పించడం, అంటరానితనాన్ని సమూలంగా నిర్మూలించడం, అన్ని
రకాల వృత్తుల పట్ల - ముఖ్యంగా పారిశుధ్య పనులపట్ల ‘శ్రమ
గౌరవాన్ని’ పెంపొందించడం,’ ‘ఈశ్వర్ అల్లా తేరే నామ్ ` సబ్‌కో
సన్మతి దే భగవాన్’ అంటూ మతసామరస్య భక్తిభావనను ప్రచారం చేయడం వంటి
అనేక కార్యక్రమాలను భారత స్వాతంత్య్రోద్యమంతో జోడిరచి మరీ ముందుకు తీసుకెళ్లారు.
గాంధీజీ ప్రబోధాలూ, వినూత్నమైన ఆయన ఆలోచనలూ, కార్యాచరణా
దేశవ్యాప్తంగా ఆబాలగోపాలాన్ని ఎంతగానో ప్రభావితం చేసేవి. అలా ప్రభావితమైన వారిలో
ప్రముఖ రచయిత ముల్క్‌రాజ్ ఆనంద్ (1905-2004)
ఒకరు. ఆయన ఇంగ్లీషులో కథలూ కవితలూ
రాసేవారు. ఆ రచనలలో ఎక్కువగా సామాన్య ప్రజల జీవితం ప్రతిబింబిస్తుండేది.
గాంధీయిజం పట్ల ఆయనకి విశేషమైన అభిమానం
వుండేది. ముఖ్యంగా హిందూ సమాజం నుంచి అంటరానితనం అనే రుగ్మతను పారదోలేందుకు
మహాత్ముడు చేస్తున్న కృషి బాగా ఆకట్టుకునేది. అందుకే ఆయన తన తొలి నవలకు
అంటరానితనాన్ని ఇతివృత్తంగా ఎంచుకున్నారు. తన సొంత పిన్నికి ఎదురైన ఒక చేదు అనుభవం
కూడా ఈ అంశంపై దృష్టి సారించేట్టు చేసింది. అభ్యుదయ భావాలున్న ఆమె ఒకరోజు ఓ
ముస్లిం మహిళతో కలసి సహపంక్తి భోజనం చేస్తుంది. దానిని ఆనాటి ఛాందస సమాజం ఘోరమైన
నేరంగా పరిగణిస్తుంది. సొంత కుటుంబ సభ్యులు సైతం ఆమెను మైలపడినట్టు, అంటరానిదైపోయినట్టు
బహిష్కరణకు గురిచేస్తారు. అప్పుడామె పడ్డ క్షోభ ఇంతాఅంతా కాదు. ప్రపంచంలో మరే ఇతర
దేశంలోనూ లేని అమానుషమైన అంటరానితనం అనే జబ్బు గురించి, దుర్మార్గమైన
కుల వ్యవస్థ గురించి ఏదో ఒకటి రాయకుండా వుండలేని పరిస్థితిని కల్పిస్తుంది. దీనికి
తోడు అంటరానితనం గురించి తన చిన్నప్పటి ఒక అనుభవాన్ని వివరిస్తూ 'యంగ్
ఇండియా' పత్రికలో గాంధీజీ రాసిన ఒక వ్యాసం ఆయనను బాగా
కదిలిస్తుంది.
గాంధీజీ ఇంట్లో ‘ఊకా’ అనే కుర్రవాడు మరుగుదొడ్లు శుభ్రపరిచే
పని చేస్తుండేవాడు. అతనితో మాట్లాడినా, పొరపాటున అతడిని తాకినా తల్లిదండ్రులు గట్టిగా
మందలించేవారు. మైలపడిపోయినట్టు ప్రాయశ్చితం చేయించేవారు. తమ మరుగుదొడ్లను
శుభ్రంచేస్తూ తమకు ఎంతో ఉపకారం చేస్తున్న వ్యక్తితో మాట్లాడితే, అతనిని
తాకితే తప్పేమిటో బాలగాంధీకి అర్థమయ్యేది కాదు. ఆ విషయంలో ఎప్పుడూ తల్లిదండ్రులతో
ఘర్షణ పడేవాడు. గాంధీజీ చెప్పిన ఈ ఉదంతం అందులోని ‘ఊకా’ పాత్రే ‘అన్‌టచబుల్’ నవలలో ప్రధాన పాత్ర ‘బాఖా’కు
జీవం పోసింది. నవల రాస్తున్నకాలంలో ముల్క్‌రాజ్ ఆనంద్ ఇంగ్లండ్‌లో ఉన్నత చదువులు
అభ్యసిస్తుండేవారు. తను రాస్తున్న నవల గురించి గాంధీజీకి ఎప్పటికప్పుడు ఉత్తరాల
ద్వారా వివరిస్తూ ఆయన సలహాలు తీసుకునేవారు.
‘అన్‌టచబుల్’ రచన
పూర్తయినప్పటికీ గాంధీజీ పలు సూచనలు చేయడంతో ప్రచురణకు వెళ్లకుండా దానిని
తిరగరాయాలని నిర్ణయించుకుంటారు. ఇంగ్లండ్ నుంచి భారతదేశం వచ్చాక నేరుగా
అహ్మదాబాద్‌లో వున్న గాంధీజీని కలుసుకుంటారు. ఆయన సూచనలకు అనుగుణంగా తన నవలను
తిరగరాయాలనుకుంటున్నట్టు చెప్తారు. అందుకుగాను
కొంతకాలం సబర్మతి ఆశ్రమంలో వుండేందుకు అనుమతి కోరతారు. అందుకు గాంధీజీ
అంగీకరించడంతో దాదాపు మూడు నెలల పాటు సబర్మతి ఆశ్రమంలో వుంటారు. ఆశ్రమ నియమాల
ప్రకారం ప్రతి రోజూ ఆవరణను ఊడ్వడం, మరుగుదొడ్లు కడగడం, బట్టలు
ఉతకడం వంటి పనులన్నీ చేస్తూ గాంధీజీ ఆదర్శాల ఆచరణను చవిచూస్తారు.
అయితే ముల్క్‌రాజ్ ఆనంద్‌కు గాంధీజీ పట్ల వున్నది
గుడ్డి అభిమానం కాదు. ఆయన ప్రధానంగా సోషలిస్టు,
నాస్తికుడు. గాంధీజీతో పలు అంశాలలో
బేధాభిప్రాయాలు కూడా వుండేవి. అదేసమయంలో మహత్తరమైన ఆయన ఆశయాలను, ఆదర్శాలను, కృషిని
ఆరాధించేవారు. అహ్మదాబాద్‌లో తొలిసారి గాంధీజీని ప్రత్యక్షంగా కలిసిన తరువాత
ముల్క్‌రాజ్ ఆనంద్ ‘గాంధీజీతో ఒకరోజు’ అన్న
శీర్షికతో తమ మధ్య జరిగిన సంభాషణని ముఖాముఖిగా రాశారు. గాంధీజీ శతజయంతి సందర్భంగా
డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ సంపాదకత్వంలో 1968లో వెలువడిన ఒక పుస్తకంలో ఆ ముఖాముఖి
చోటుచేసుకుంది. విజయవాడ అన్నపూర్ణ పబ్లికేషన్స్ వారు ‘గాంధీ
మహాత్ముడు నూరేళ్లు’ అనే పేరుతో దీనిని 1970లో తెలుగులో ప్రచురించారు. కాగా పొత్తూరు పుల్లయ్య
తెలుగు అనువాదం చేశారు.
అందులో ఒక చోట
గాంధీజీ ‘అస్పృశ్యులు అన్న పదాన్ని వాడకుండా వారిని మేం ‘హరిజనులు’ అంటాం’ అని
అభ్యంతరం చెప్పినప్పుడు ముల్క్‌రాజ్ ఆనంద్ ‘హరిజనులు అంటే భగవంతుని పిల్లలు అని అర్థం.
కానీ మన సమాజం వారికి అలాంటి స్థానం ఏమీ ఇవ్వలేదు. అన్నింటి కంటే ముఖ్యంగా నాకు
భగవంతుడి మీద విశ్వాసంలేదు’ అని నిర్ద్వంద్వంగా చెప్తారు. ‘అంటే
మీరు హిందువులు కాదన్నమాట’ అని గాంధీజీ వ్యాఖ్యానించగా ‘కాదు.
కులవ్యవస్థను సమర్థించే... సహించే మతం మీద నాకు నమ్మకం లేదు. ఒకప్పుడు కుల
వ్యవస్థకు స్థానంలేని క్రైస్తవ మతం స్వీకరిద్దామనుకున్నాను కానీ ఆ మతాన్ని
అనుసరించాలన్నా కూడా భగవంతుడి మీద విశ్వాసం వుండాలి కదా అని మానేశాను’ అంటారు
ముల్క్ రాజ్. ‘అయితే మీకు నాస్తికుడిని అనిపించుకోవడమే
ఇష్టమన్నమాట’ అని గాంధీజీ వ్యాఖ్యానిస్తే ‘లేదు
నేను సోషలిస్టుని’ అని అంటారు ముల్క్‌రాజ్.
‘కుల వ్యవస్థను హిందూమతం సమర్థించడంలేదు, సహించడం
అంతకన్నా లేదు. కొందరు సనాతనపరాయణులైన హిందువులు కింది కులాల పట్ల వివక్ష
చూపుతారు, కానీ సజ్జనులైన హిందువులు మాత్రం ఎన్నడూ వివక్షను
ప్రదర్శించరు’ అని గాంధీజీ వివరించబోతే ముల్క్‌రాజ్ ఆనంద్ ‘మీరు హిందూ మతం పట్ల చాలా ఉదారంగా
వ్యవహరిస్తున్నారు. వేలాది సంవత్సరాలుగా హిందూమతానికి కుల వ్యవస్థే ప్రాతిపదిక. ఈ
విషయాన్ని మీరు గుర్తించడంలేదు’ అని నిర్మొహమాటంగా అంటారు. ‘హిందూ
మతానికి కుల వ్యవస్థ ప్రాతిపదిక అయినట్టయితే అలాంటి హిందూమతంతో నాకు సంబంధంలేదు’ అని
గాంధీజీ అంటారు. అయినా ముల్క్‌రాజ్ ‘నేను మాత్రం హిందూమతానికి కుల వ్యవస్థే
ప్రాతిపదికని నమ్ముతాను, అందుకే కుల వ్యవస్థకు నిరసనగా ఈ నవల రాశాను’ అని
నిర్మొహమాటంగా సమాధానం ఇస్తారు.
‘ఈ నవలను ఇంగ్లీషులో రాయడం వల్ల మీకు కీర్తి
ప్రతిష్టలు వస్తాయేమో తప్ప దీనిని సామాన్య ప్రజలు
ఎలా చదివి ఆనందించగలరు?’ అని గాంధీజీ అన్నప్పుడు ‘నేను
పంజాబీలో రాస్తే ముద్రించడానికి ఒక్క ప్రచురణకర్త కూడా ముందుకురారు, అందుకే
విధి లేక ఇంగ్లీష్‌లో రాస్తున్నాను, అయితే కొందరు భారతదేశంలోని లోపాలను బయటి
ప్రపంచానికి బహిర్గతం చేస్తున్నానంటూ తనని విమర్శిస్తున్నారని’ వాపోతారు.
అప్పుడు గాంధీజీ ‘ఎవరికి
వీలయిన భాషలో వారు రాయడం తప్పుకాదు, ఎవరికి బాధ కలిగించినా లెక్కచేయకుండా సత్యాన్ని
చాటిచెప్పాల్సిందే. ఎవరికి నొప్పి కలిగించినా సత్యం సత్యమే అవుతుంది’ అంటారు.
ఈవిధంగా కొన్ని అంశాలలో విభేదాలు వున్నప్పటికీ ముల్క్‌రాజ్ ఆనంద్‌కు గాంధీజీ
ఆలోచనల పట్ల అపారమైన అభిమానం వుండేది.
సబర్మతి
ఆశ్రమంలో సమయం దొరికినప్పుడల్లా తను ఎడిట్ చేస్తున్న 'అన్‌టచబుల్' నవలను
గాంధీజీకి వినిపించేవారు. మన సమాజంనుంచి ఏ రుగ్మతనైతే తాను సమూలంగా
నిర్మూలించాలనుకుంటున్నారో ఆ రుగ్మతపై రాసిన రచన కాబట్టి గాంధీజీని అది చాలా
ఆకట్టుకుంటుంది. అయితే నవల మధ్యలో కథానాయకుడు బాఖా ప్రేమలో పడటం వంటి సంఘటనలు
వుండటం వల్ల అసలు సమస్య అయిన అంటరానితనం పక్కదారి పట్టినట్టు అనిపిస్తోందంటూ పలు
సూచనలు చేస్తారు గాంధీజీ. ఆయన సూచనలతో ఏకీభవించిన ముల్క్‌రాజ్ ఆనంద్ సబర్మతీ
ఆశ్రమంలోనే తన నవలను పూర్తిగా తిరగ రాస్తారు. మొదట మూడు వందల పేజీలకు పైగా వచ్చిన
నవల చివరకు 148 పేజీలకు తగ్గిపోతుంది. అయితే రాశి తగ్గినా
వాసి పెరిగి అంటరానితనం సమస్యను మరింత బలంగా ప్రొజెక్ట్ చేస్తుంది. 1935లో
మొదటి ముద్రణ వెలువడ్డ తర్వాత దేశ విదేశాలలో అన్‌టచబుల్ పెద్ద
సంచలనాన్నే సృష్టించింది.
(ముగింపు వచ్చేవారం)
సర్ కుల నిర్ములన మతాలపై తెలుగు లో కొన్ని పుస్తకాలు చదివాను నాలాంటి వారికి పుస్తకాలు కొని చదవాలంటే ఆర్ధికంగా చాలా కష్టం అవుతుంది తెలుగు PDF రూపంలో మీలాంటి వారు అందించగలిగితే
ReplyDeleteచాలా ఉపయోగం డాక్టర్ రామ్మనోహర్ లోహియా రో్మిల్లా థాపర్ కొడవటిగంటి కుటుంబరావు వగైరా