Sunday, October 10, 2021

నేను ఆవును గౌరవించినట్టే నా సహోదర భారతీయుడిని గౌరవిస్తానా అన్నది ప్రశ్న - గాంధీజీ

నేను ఆవును గౌరవించినట్టే

నా సహోదర భారతీయుడిని గౌరవిస్తానా అన్నది  ప్రశ్న

- గాంధీజీ

...............

గాంధీజీ దక్షిణాఫ్రికాలో వుండగా 1909 లో Indian Home Rule అనే పుస్తకాన్నిరాసారు. మొదట గుజరాతీ భాషలో రాసినప్పటికీ ఆయనే ఆ తర్వాత ఇంగ్లీష్ లోకి అనువదిం చారు. ఆ పుస్తక తెలుగు అనువాదాన్ని నేషనల్ ట్రాన్స్ లేషన్ మిషన్, మైసూర్ వాళ్ళు 2018 లో వెలువరించారు.

అందులోని 'భారత దేశ పరిస్థితి హిందువులూ ముస్లింలూ' అన్న అధ్యాయం నుంచి గో సంరక్షణ గురించిన ప్రశ్నకు గాధీజీ సమాధానం :

ప్రశ్న :

ఇక గో సంరక్షణ విషయంపై మీ అభిప్రాయం తెలుసుకోవాలని వుంది.

గాంధీజీ సమాధానం :

నేను స్వయంగా ఆవును గౌరవిస్తాను. ఆవు పట్ల అపారమైన ప్రేమాభిమానాలను కనబరుస్తాను. వ్యవసాయ దేశం కాబట్టి భారతదేశానికి ఆవు సంరక్షకురాలు. దేశం ఆవు మీదనే ఆధారపడి వుంది. ఆవు వందలాది విధాలుగా ఎంతో ఉపయోగకపడుతుంది. మన ముస్లిం సోదరులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు.

కానీ నేను ఆవును గౌరవించినట్టే నా సహోదర భారతీయుడిని గౌరవిస్తానా అన్నది  ప్రశ్న. ఒక మనిషి ముస్లిం అయినా, హిందువు అయినా అతను ఆవు అంత ఉపయోగకరమైన వాడే. కాబట్టి ఒక ఆవును కాపాడేందుకు నేను ఒక ముస్లింతో పోట్లాడాలా? లేదా అతడిని చంపాలా? ఆ పనిచేయడం వల్ల నేను ముస్లింలకే కాదు ఆవుకు కూడా శత్రువును అవుతాను. అందువల్ల ఆవును రక్షించేందుకు నా ముందున్న ఒకే ఒక విధానం ఏమిటంటే ముస్లిం సోదరుని వద్దకు వెళ్లి దేశం కోసం ఆవును కాపాడే కార్యక్రమంలో నాతో చేతులు కలపవలసిందిగా అభ్యర్థించడమే. ఒకవేళ అతను నా మాటను మన్నించకపోతే ఇక నా చేతిలో ఏమీ లేదన్నసాధారణ కారణంతో ఆవును వదులుకుంటాను.

 

నాకు గనక ఆవు మీద అపరిమితమైన జాలి వుంటే దానిని కాపాడేందుకు నా ప్రాణాన్నిఅర్పిస్తానే తప్ప నా సోదరుడి ప్రాణాలు తీయను. నేను అనుసరిస్తున్నది మన మతం ప్రబోధిస్తున్న ధర్మమే.

మనిషి మొండివాడిగా తయారైనప్పుడు సమస్య సంక్లిష్టమవుతుంది. నేను ఒకవైపు లాగితే నా ముస్లిం సోదరుడు మరొకవైపు లాగుతాడు. నేను అతడి పట్ల సానుకూలంగా వుంటే అతను నాపట్ల సానుకూలంగా వుంటాడు. నేను అతని ముందు వినయంగా తలవంచితే అతను అదేపనిని నా కంటే ఎక్కువగా చేస్తాడు. తలవంచడమనేది తప్పేమీ కాదన్నది నా ఉద్దేశం. హిందువులు అతిగా పట్టుపట్టినప్పుడే ఆవులను వధించడం ఎక్కువయింది. నా అభిప్రాయం ప్రకారం గో సంరక్షణ సంఘాలను గో వధ సంఘాలుగా పరిగణించాలి. అలాంటి సంఘాల అవసరం ఏర్పడటం దురదృష్టకరం. ఆవులను  ఎలా సంరక్షించాలో మనకు తెలియనప్పుడు అలాంటి సంఘాల అవసరం వుంటుంది.

 

స్వయానా నా తోడబుట్టిన సోదరుడే ఆవును చంపబోతుంటే నేను ఏం చేయాలి? అతడిని నేను చంపాలా లేక అతని కాళ్ల మీద పడి అలా చేయొద్దని వేడుకోవాలా? రెండోదే సరైనదని మీరు ఒప్పుకుంటే నేను ముస్లిం సోదరుడి విషయంలో కూడా ఆపనే చేయాలి కదా. కొందరు హిందువులు ఆవులను సరిగా చూడకుండా క్రూరంగా వ్యవహరిస్తూ వాటి వినాశనానికి కారణమవుతున్నప్పుడు వాటిని ఎవరు రక్షించాలి? కారణం ఏమైనా కావచ్చు కొందరు హిందువులు ఆవులను నిర్దాక్షిణ్యంగా దుడ్డు కర్రలతో బాదుతున్నప్పుడు ఎవరు అడ్డుకోవాలి? ఈ విషయాలు ఎలా వున్నా ఇవేవీ మనల్ని ఒకే దేశీయులుగా వుండకుండా చేయలేవు కదా.

చివరగా, హిందువులు అహింసా సిద్ధాంతాన్ని నమ్ముతారనీ, ముస్లింలు నమ్మరనీ భావించినప్పుడు హిందువులు చేయాల్సిన పనేమిటి, బతిమిలాడటమేనా? అహింసా ధర్మాన్ని పాటించే వ్యక్తి తోటి వాడిని చంపొచ్చని ఎక్కడా రాసిపెట్టి లేదు. అతను అనుసరించాల్సిన మార్గం సూటిగా వుంటుంది. ఒక ప్రాణిని రక్షించేందుకు మరొక ప్రాణిని చంపకూడదు. అతను కేవలం బతిమిలాడవచ్చు. అదేే  అతని ఏకైక విద్యుక్త ధర్మం.  అయితే ప్రతి హిందువూ అహింసను నమ్ముతాడా? కొంచెం లోతుగా వెళ్లి పరిశీలిస్తే  ఏ ఒక్కరూ అహింసా సిద్ధాంతాన్ని అనుసరించరనీ మనమంతా జీవుల ప్రాణాలను హరిస్తున్నామని అర్థమవుతుంది. ఏ ప్రాణినీ చంపకుండా వుండాలన్న ఉద్దేశంతో మనం అహింసా సిద్ధాంతాన్నిపాటించాలని చెబుతుంటాం. మామూలుగా చెప్పాలంటే అనేకమంది హిందువులు మాంసాన్నిస్వీకరిస్తారు కాబట్టి వాళ్లు అహింసావాదులు కారు.

ఈ నేపథ్యంలో హిందువులు అహింసను నమ్ముతారనీ, ముస్లింలు హింసను పాటిస్తారనీ తత్ఫలితంగా వాళ్లు సామరస్యంగా కలసి మెలసి వుండలేరనీ అంటూ ఒక తీర్మానానికి రావడం పొరపాటవుతుంది.

ఇలాంటి భేదభావాలను కొందరు స్వార్థపరులైన నకిలీ మతపెద్దలు మన మనసుల్లోకి చొప్పించారు. ఆంగ్లేయులు వాటిని మరింత సానబెట్టారు. వాళ్లకి చరిత్రను నమోదుచేసే అలవాటుంది. ప్రజలందరి పద్ధతులనూ, సంప్రదాయాలనూ అధ్యయనం చేస్తుంటామని  వాళ్లు బుకాయిస్తుంటారు. దేవుడు మనకు పరిమితమైన మానసిక శక్తిని ఇచ్చాడు. కానీ వాళ్లు దేవుడి స్థానాన్ని తీసుకుని సరికొత్త ప్రయోగాలు చేయాలని చూస్తుంటారు. తమ పరిశోధనల గురించి సొంత డబ్బా కొట్టుకుంటారు. వాటిని నమ్మేలా మనల్ని వశీకరణం చేసుకుంటారు. అజ్ఞానం వల్ల మనం వాళ్లకు దాసోహులమైపోతుంటాం.

అపార్థాలు కూడదని భావించేవాళ్లు ఖురాన్‌ను చదవొచ్చు. అందులో హిందువులకు ఆమోదయోగ్యమైన విషయాలు అనేకం కనిపిస్తాయి.

అలాగే భగవద్గీతలో ముస్లింలు ఆక్షేపణ చెప్పడానికి అవకాశంలేని అంశాలు ఎన్నో కనిపిస్తాయి. ఖురాన్‌లో నాకు అర్థం కాని, లేక నాకు ఇష్టంలేని అంశాలు వున్నాయన్న నెపంతో నేను ముస్లింల పట్ల అయిష్టతను ప్రదర్శించాలా?

నాకు ఒక ముస్లింతో కొట్లాటపెట్టుకోవడం ఇష్టం లేనప్పుడు ఆ ముస్లిం నాతో కొట్లాడే విషయంలో అశక్తుడవుతాడు. అలాగే అతను నాతో పోట్లాడటానికి ముందుకు  రానప్పుడు నేను అతనితో పోట్లాడే విషయంలో శక్తిహీనుడిని అవుతాను.

ఒక్క చేతిని గాలిలో ఆడిస్తే చప్పట్లు మోగవు కదా. ప్రతి ఒక్కరూ తమ తమ మతాల అంతస్సారాన్ని అర్థం చేసుకుంటే, నకిలీ ప్రబోధకులను మాటలను పట్టించుకోకుండా వుంటే ఈ పోట్లాటలకు అసలు అవకాశమే వుండదు.

 

హింద్ స్వరాజ్ - మోహన్ దాస్ కరంచంద్ గాంధీ

Published by National Translation Mission,

CIIL, Manasagangotri, Mysore - 570006

Price: Rs.110 /-

Contact No. Publication Unit:

0821023451820  /  0984556514

Email:

nandeesh77@gmail.com

publication.kar-ciil@nic.in

 

ISBN: 978-81-7343-286-6

....................................No comments:

Post a Comment