మిత్రులు నేషనల్
ట్రాన్స్ లేషన్ మిషన్, మైసూర్ చీఫ్ రిసోర్స్ పర్సన్
(అకడమిక్) డా. ప్రత్తిపాటి మాథ్యూ గారి ప్రోద్బలంతో నేను 2018లో హింద్ స్వరాజ్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించాను. అంతకు
ముందు హైదరాబాద్ బుక్ ట్రస్ట్, ఎన్ టి ఎం వారు
సంయుక్తం గా ప్రచురించిన గ్రాన్ విల్ ఆస్టిన్ రచన 'భారత రాజ్యాంగం- దేశానికి మూల స్తంభం' అనువదించి వుండటం వల్ల నాకీ అవకాశం లభించింది. ఆ తర్వాత ఇటీవల డా.
నాగసూరి వేణుగోపాల్ గారు ఆంధ్రప్రభలో తను నిర్వహిస్తున్న 'గాంధేయం ఓ గాండీవం' శీర్షిక కోసం హింద్ స్వరాజ్ పుస్తకాన్ని పరిచయం చేయమని అడిగారు. ఆ
పరిచయం (22-8-2021) ఆంధ్ర ప్రభలో
ప్రచురించ బడింది. ఆ
క్లిప్పింగ్ యధాతధంగా ...
......................................
గాంధేయం ఒక
గాండీవం
ఆంద్ర ప్రభ శీర్షికా నిర్వహణ
– డా. నాగసూరి వేణుగోపాల్
......................................
(‘‘గాంధీని సరిగా
అర్థం చేసుకోవాలంటే హింద్ స్వరాజ్‌ని పదేపదే చదవాలి’’ అన్న లార్డ్ లోథియన్ మాటలు అక్షరసత్యాలు. ఈ పుస్తకం 1920లోనే తెలుగులో వెలువడినా ప్రతులు అందుబాటులో లేకపోవడం వల్ల ‘నేషనల్ ట్రాన్స్ లేషన్ మిషన్, మైసూరు’ వాళ్లు మళ్లీ ప్రభాకర్ మందారతో
అనువాదం చేయించి 2018 ప్రచురించారు.
గాంధీజీ 1909లో హింద్ స్వరాజ్
ను గుజరాతీ భాషలో రాశారు. దక్షిణాఫ్రికా నుంచి ఆయన వెలువరించిన ఇండియన్ ఒపీనియన్
పత్రికలో సీరియల్ గా వచ్చింది. వెనువెంటనే పుస్తకరూపంలో కూడా వెలువడింది. పిమ్మట
ఇంగ్లీషు హిందీ భాషలలోకి అనువదింపబడింది. ఈ పుస్తకాన్ని బ్రిటీష్ ప్రభుత్వం
నిషేధించింది కూడా. తొలుత గాడిచర్ల హరిసర్వోత్తమరావు తెలుగులోకి అనువదించారు.
అయితే ఆ పుస్తకం ప్రతులు ఇప్పుడు అందుబాటులో లేవు. 11 దశాబ్దాల క్రితం రాసిన ఈ పుస్తకం ఇప్పటికీ చర్చనీయాంశంగానే వుంది.
కొన్ని నెలల క్రితం ఆర్ ఎస్ ఎస్ ఈ గ్రంథాన్నిపునర్ముద్రించడం గమనార్హం. ఈ గ్రంధంలో
గాంధీజీ ప్రతిపాదించిన ప్రణాళికలేమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. – డా. నాగసూరి వేణుగోపాల్ )
స్వరాజ్య సాధనకు గాంధేయ ప్రణాళిక
...
అనైక్యత వల్ల ఏ
దేశమైనా అతి తేలికగా పరాధీనమవుతుంది. కానీ కోల్పోయిన అస్తిత్వాన్ని, స్వాతంత్య్రాన్ని తిరిగి పొందాలంటే మాత్రం ఆ దేశానికి గగనంగా
మారుతుంది. సువిశాలమైన మన దేశంపై మన కంటే చిన్న చిన్న రాజ్యాలు సైతం దండయాత్రలు
చేసి, పెత్తనం చెలాయించ గలిగాయంటే అందుకు
కారణం ఈ అనైక్యతే. స్వాతంత్య్రం సిద్ధించే నాటికి మన దేశంలో పోయినవి పోగా మొత్తం 584 సంస్థానాలు వున్నాయంటే ఆ అనైక్యత, దుర్బలత ఏ స్థాయిలో వుండేదో అర్థం చేసుకోవచ్చు.
నిజానికి ఈస్ట్
ఇండియా కంపెనీ పేరిట 1608లో ఆంగ్లేయులు మన
దేశంలో అడుగుపెట్టినప్పుడు వారి లక్ష్యం కేవలం వ్యాపారం చేసి లాభాలు దండుకోవడమే.
సుగంధ ద్రవ్యాలు, సిల్కు, కాటన్, తేయాకు, అద్దకం రంగు, నల్లమందు
మొదలైనవి అప్పటి వారి ప్రధాన వ్యాపార సరుకులు. మొఘల్ చక్రవర్తి జహంగీర్ ముందుగా
ఆ కంపెనీకి 1613లో సూరత్‌లో ఒక
కాటన్ ఫాక్టరీని నెలకొల్పుకునేందుకు అనుమతులు ప్రసాదించాడు. ఆ తరువాత వివిధ
సంస్థానాలు, రాజులు పోటీపడి మరీ వారికి మద్రాసు, కలకత్తా, బొంబాjయి వంటి కీలక ప్రదేశాలలో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని
విస్తరించుకునేందుకు తోడ్పడం జరిగింది.
చాలా మంది
రాజులకూ, సంపన్నవర్గాలకు విదేశీ వస్తువులపట్ల
విపరీతమైన మోజు వుండేది. పాశ్చాత్య నాగరికత, సంస్కృతి, భాష, దుస్తులు అన్నింటిపట్లా వల్లమాలిన ఆకర్షణ వుండేది. మన ఈ లోపాలూ
బలహీనతలే విదేశీ పాలనకు ఎర్ర తివాచీని పరిచాయి. మనదేశమంతటా ఇదే పరిస్థితి
వుండిరదని కాదు. అనేక చోట్ల ఆంగ్లేయుల పెత్తనాన్ని ఎదురించారు. ఎన్నో చోట్ల
వీరోచిత తిరుగుబాట్లు జరిగాయి. కానీ ఇటు మన అనైక్యత, అటు అత్యాధునిక ఆయుధ సంపత్తి కారణంగా వారు సులువుగా వాటిని
అణచివేస్తూవచ్చారు. 1857లో పెద్ద ఎత్తున
ప్రధమ భారత స్వాతంత్య్ర సంగ్రామం జరిగిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా
కంపెనీని పక్కనపెట్టి నేరుగా రంగంలోకి దిగింది. మన దేశం మీద తన పట్టును మరింత
పటిష్టం చేసుకుంది.
సంస్థానాలుగానే
కాకుండా కులాలు, మతాలు, ప్రాంతీయ భావనలు, విభిన్న భాషల
రూపంలో సమూహాలుగా విడిపోయివున్న ప్రజలందరిలో జాతీయ భావనను పెంపొందించి అందరినీ
ఏకతాటిపైకి తీసుకురావడమంటే మాటలు కాదు. అయినా శాంతి, అహింస, సత్యాగ్రహాలను తన ఆయుధాలుగా
చేసుకుని మహత్తరమైన స్వాతంత్య్ర పోరాటాన్ని ముందుండి నడిపి, ‘రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం’ మెడలు వంచి స్వరాజ్యాన్ని సాధించారు గాంధీ. అయితే ఆయన తన
మార్గాన్ని రూపొందించింది. శాంతి, అహింస, సత్యాగ్రహాలతో తొలి ప్రయోగాలు చేసింది భారతదేశంలో కాదు, దక్షిణాఫ్రికాలో. ఒక గుజరాతీ వాణిజ్య సంస్థపై నడుస్తున్న కోర్టు
కేసులో సహాయకుడిగా పనిచేసేందుకు ఆయన 1893లో తన ఇరవైనాలుగోయేట అక్కడికి వెళ్లారు.
అప్పట్లో భారతదేశ
నలుమూలల నుంచి వలసవచ్చిన లక్షలాది మంది భారతీయులతో దక్షిణాఫ్రికా మినీ ఇండియాను
తలపింపజేసేది. ఆంగ్లేయ పాలకులు అక్కడ ఆఫ్రికన్ మూలవాసులపైనే కాకుండా భారతీయుల మీద
కూడా దారుణమైన వర్ణవివక్ష చూపేవారు. పౌరహక్కుల పరిస్థితి దయనీయంగా వుండేది.
అనేకమంది భారతీయులు న్యాయ సహాయం కోసం ఆయన వద్దకు వస్తుండేవారు. వారి సమస్యలలో, పోరాటాలలో పాలుపంచుకోవడం వల్ల ఆయన కార్యక్షేత్రం రోజురోజుకూ
విస్తరిస్తూ పోయింది. దాంతో అక్కడ వుండేది ఒక సంవత్సరమే కదా అని ఒంటరిగా వెళ్లిన
గాంధీకి తన భార్యాపిల్లలను కూడా తీసుకువెళ్లక తప్పలేదు. అక్కడి ప్రజలతో మమేకమై, వారి సమస్యలపై పోరాటాలు సాగిస్తూ శాంతి, అహింస, సత్యాగ్రహం వంటి తన ఆదర్శాలతో
ప్రయోగాలు చేస్తూ దాదాపు 21 సంవత్సరాల పాటు
దక్షిణాఫ్రికాలోనే వుండిపోయారు.
ప్రవాస భారతీయుల
హక్కుల పోరాటంలో భాగంగా ఆయన 1909లో నాలుగు నెలల
పర్యటనకోసం లండన్ వెళ్లారు. అప్పటికే భారతదేశమంతటా స్వపరిపాలనా గాలి ఉధృతంగా
వీస్తోంది. మాతృదేశ విముక్తి కోసం ఉద్యమిస్తున్నవారికి లండన్ ఒక వేదికలా వుండేది.
అంతకు పూర్వం గాంధీ అక్కడే బారిష్టర్
చదివివున్నారు. అందువల్ల అక్కడి తన పాత మిత్రులతో పాటు భారతదేశం నుంచి వచ్చిన
అనేకమంది ఉద్యమకారులను, నాయకులను కలసి చర్చలు జరిపారు. తన
భావాలను వారితో పంచుకున్నారు. ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి వేస్తే చాలు స్వరాజ్యం
వచ్చినట్టే నని, అందుకు హింసా మార్గమే సరైందని
భావిస్తున్నట్టు అనిపించింది. అసలు స్వరాజ్యం అంటే ఏమిటి, అది ఎలా వుండాలి అనే విషయంపై ఎవరికీ పెద్దగా అవగాహన వున్నట్టు
కనిపించలేదు. ఆంగ్లేయుల స్థానాల్లో భారతీయులు కూర్చోవడం, బ్రిటిష్ చట్టాలు, చదువులు, పాలనా విధానాలు, నాగరికత అన్నీ యధాతధంగా కొనసాగడం... స్వరాజ్యమంటే ఇదేనా. దానివల్ల
దేశానికి ఏమైనా మేలు జరుగుతుందా అన్న ఆలోచనలు గాంధీని కలవరపాటుకు గురిచేశాయి.
తన పర్యటన
ముగించుకుని లండన్ నుంచి సముద్రమార్గాన దక్షిణాఫ్రికాకు తిరిగి వస్తున్నప్పుడు
ఓడలో కూర్చునే స్వరాజ్య సాధనకు సంబంధించిన తన సమస్త ఆలోచనలను గ్రంధస్తం చేశారు.
దక్షిణాఫ్రికాలో దిగేటప్పటకే రచన పూర్తయింది. సామాన్య పాఠకులకు కూడా సులువుగా
అర్థమయ్యేలా ప్రశ్నలూ జవాబుల రూపంలో తన మాతృభాష గుజరాతీలో రాశారు. ‘ఇండియన్ ఒపినియన్’ పత్రికలో సీరియల్‌గా ప్రచురించినప్పుడు పాఠకుల విశేషంగా
ఆకట్టుకుంది. అయితే ‘‘హింద్ స్వరాజ్’’ పేరిట పుస్తక రూపంలో ముద్రించి ప్రతులను భారతదేశం పంపించినప్పుడు
బొంబాయి ఓడ రేవులోనే పోలీసులు వాటన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు.
ఆ చర్య గాంధీజీని
దిగ్భ్రాంతపరచింది. అది గుజరాతీ భాషలో వుండటం వల్ల అపార్థం చేసుకున్నారేమో
అనిపించింది. అప్పటికే హింద్ స్వరాజ్‌ని ఇంగ్లీష్‌లో వెలువరించాలంటూ అనేక
అభ్యర్థనలు వచ్చివున్నాయి. అందువల్ల వెంటనే స్వయంగా ఇంగ్లీష్‌లోకి అనువదించి
ప్రచురించారు. తత్ఫలితంగా హింద్ స్వరాజ్ ప్రప్రంచవ్యాప్తంగా అనేక మంది
మేధావులనుంచి ఇటు ప్రశంసలు, అటు కొన్ని విమర్శలు
వెల్లువెత్తాయి. విమర్శకులకు సమాధానంచెబుతూ ‘ఈ పుస్తకం ద్వేషానికి బదులు ప్రేమను బోధిస్తుంది. హింసావాదం
స్థానంలో స్వీయ త్యాగాన్ని ప్రతిష్టిస్తుంది. పశుబలానికి వ్యతిరేకంగా ఆత్మబలాన్ని
నిలబెడుతుంది’ అన్నారు గాంధీ. ‘హింద్ స్వరాజ్‌లో వ్యక్తం చేసిన భావాలు తనవే అయినా సుప్రసిద్ధ భారతీయ
తత్వవేత్తలతోపాటు లియో టాల్‌స్టాయ్, రస్కిన్, థోరొవ్, ఎమర్సన్ వంటి వారిని కూడా విధేయతతో అనుసరించానని’ పేర్కొన్నారు.
ఒక విధంగా హింద్
స్వరాజ్ ‘స్వరాజ్య సాధనకు తొలి గాంధేయ
ప్రణాళిక (మానిఫెస్టో)’ అని చెప్పవచ్చు. ఇందులో స్వపరిపాలన
అంటే ఏమిటి? భారతదేశం ఎందుకు పరాధీనమయింది? ఎలా స్వతంత్రమవుతుంది? భారతదేశ పరిస్థితులు, నాగరికత, సాత్విక ప్రతిఘటన సత్యాగ్రహం, విద్య వంటి అనేక అంశాల గురించి చర్చించారు. ‘ఆంగ్లేయులను మనమే రప్పించుకున్నాం. వాళ్లని మనమే వుండనిచ్చాం.
వాళ్ల నాగరికతను మనం అనుసరించడం వల్లనే ఇక్కడ వాళ్ల ఉనికి సాధ్యమయింది. రోగానికి
మూలకారణమైన వాటిని తొలగిస్తే రోగం నయమైపోతుందన్నట్టు భారతదేశ బానిసత్వానికి
మూలకారణమైన వాటిని నిర్మూలిస్తే భారతదేశం స్వతంత్రమవుతుంది’ అని వివరించారు.
తాను యురోపియన్
సంస్కృతికి, పాశ్చాత్య నాగరికతకు
బద్ధవ్యతిరేకినని పేర్కొంటూ ‘ప్రస్తుతం మనమంతా
ఆ ఆధునిక నాగరికత ఊబిలో కూరుకుపోయి వున్నాం, అందులోంచి బయటపడి మంచి నైతిక విలువలతో కూడిన మన ప్రాచీన నాగరికత, జీవన విధానం వైపు మళ్లితే వెంటనే భారతదేశం స్వేచ్ఛను పొందుతుందని’ చెప్పారు. ఆంగ్లేయులను మన దేశం నుంచి వెళ్లగొట్టాలంటే మనం వాళ్ల
భాషని, నాగరికతని అనుసరించాలని, హింసాత్మక మార్గంలో నడవాలని కొందరి వాదనను ప్రస్తావిస్తూ అది
ఆత్మహత్యా సదృశమైన విధానమన్నారు. ‘ఆంగ్లేయులు మన నాగరికతను అనుసరించి భారతీయీకరణ చెందాలి లేకపోతే
తమకు భారతదేశంలో నూకలు చెల్లాయని వాళ్లు గ్రహించేట్టు చేయాలి’ అని చాటిచెప్పేందుకే తాను హింద్ స్వరాజ్‌ని రాసినట్టు
పేర్కొన్నారు.
విద్య గురించి
చర్చిస్తూ ‘లక్షలాది మందికి ఇంగ్లీష్ విద్యను
బోధించడమంటే వాళ్లందరినీ బానిసలుగా మార్చడమే. మెకాలే ప్రవేశపెట్టిన విద్యా విధానం
మనల్ని బానిసలుగా మార్చేందుకు వేసిన పునాది. అతనికి ఆ ఉద్దేశం వుందో లేదో నేను చెప్పలేను
కానీ దాని ఫలితం మాత్రం ఇదే. మనం స్వపరిపాలన గురించి కూడా పరాయి భాషలో
మాట్లాడుకోవడం మహా విషాదం’ అన్నారు. ‘న్యాయస్థానానికి వెళ్లాలంటే నేను తప్పనిసరిగా ఇంగ్లీషు భాషను
మాధ్యమంగా ఉపయోగించాల్సి రావడం ఎంత బాధాకరమైన విషయం. ఇది బానిసత్వానికి చిహ్నం
కాదా? ఇంగ్లీషు భాషను నేర్చుకున్న మనమే మన
దేశాన్ని బానిసత్వంలోకి నెట్టివేశాం’ అన్నారు.
గాంధీ మొదటి
నుంచీ హిందూ ముస్లిం ఐక్యతను, సర్వమత సమభావనను
కోరుకున్నారు. ‘భారతదేశ పరిస్థితి`హిందువులూ ముస్లింలూ’ అన్న అధ్యయంలో ‘జాతీయతా స్ఫూర్తి, చైతన్యం వున్నవాళ్లు ఒకరి మతంలో మరొకరు జోక్యం చేసుకోరనీ, అలా చేసుకుంటే వాళ్లు ఒకే జాతిగా పరిగణించబడేందుకు అర్హులు కారనీ’ అన్నారు. భారతదేశం కేవలం హిందువులతోనే కూడి వుండాలని హిందువులు
భావిస్తున్నట్టయితే వాళ్లు ఊహా ప్రపంచంలో విహరిస్తున్నట్టే లెక్క, హిందువులూ ముస్లింలూ పార్శీలూ క్రైస్తవులూ ఎవరైతే భారతదేశాన్ని తమ
దేశంగా చేసుకున్నారో వాళ్లంతా సహదేశీయులే. తమ ప్రయోజనం కోసమైనా సరే వాళ్లంతా
ఐకమత్యంతో జీవించాలి... మనలో నిజమైన జ్ఞానం పెంపొందుతున్నకొద్దీ ఇతర మతస్థులతో
పోట్లాడాల్సిన అవసరం లేదన్న అవగాహన కలుగుతుంది’ అన్నారు.
గోసంరక్షణ
గురించి ప్రస్తావిస్తూ ‘నేను స్వయంగా ఆవును గౌరవిస్తాను.
ఆవు పట్ల అపారమైన ప్రేమాభిమానాలను కనబరుస్తాను. వ్యవసాయ దేశం కాబట్టి ఆవు
భారతదేశానికి సంరక్షకురాలు. వందలాది విధాలుగా ఆవు ఉపయోగపడుతుంది. మన ముస్లిం
సోదరులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారు. కానీ నేను ఆవును గౌరవించినట్టే నా సోదర
భారతీయుడిని గౌరవిస్తానా అన్నది ప్రశ్న. ఒక మనిషి హిందువు అయినా ముస్లిం అయినా
అతను ఆవు అంత ఉపయోగకరమైన వాడే. కాబట్టి ఒక ఆవును కాపాడేందుకు నేను ఒక ముస్లింతో
పోట్లాడాలా? లేదా అతడిని చంపాలా? ఆ పనిచేయడం వల్ల నేను ముస్లింలకే కాదు ఆవుకు కూడా శత్రువును
అవుతాను. అందువల్ల ఆవును రక్షించేందుకు నా ముందున్న ఒకే ఒక్క విధానం ఏమిటంటే
ముస్లిం సోదరుని వద్దకు వెళ్లి దేశం కోసం ఆవుని కాపాడే కార్యక్రమంలో నాతో చేతులు
కలపవలసిందిగా అభ్యర్థించడమే. ఒకవేళ అతను నా మాటను మన్నించకపోతే ఇక నాచేతిలో ఏమీ
లేదని ఆవును వదులుకుంటాను, లేదా నా ప్రాణాన్ని అర్పిస్తాను
తప్ప నా సోదరుడి ప్రాణాలు తీయను’ చెప్పారు ఇందులో.
- ప్రభాకర్ మందార
(ఆంధ్ర ప్రభ దినపత్రిక 22-8-2021 సౌజన్యంతో)