Friday, April 22, 2011

ఇంగ్లీషూ తెలుగూ - ఏ భాషనూ సరిగా నేర్పలేకపోతున్న మన చదువులు!

... ఇంగ్లీషూ తెలుగూ - ఏ భాషనూ సరిగా నేర్పలేకపోతున్న మన చదువులు! ...

ఈమధ్య ''తెలుగు భాషను రక్షించుకుందాం'' అనే నినాదం తరచుగా వినిపిస్తోంది.
అదే క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతినుంచే ఇంగ్లీషును ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై విమర్శలూ వెల్లు వెత్తుతున్నాయి.
నిజానికి ఒక భాషను రక్షించాలంటే మరో భాషను నిరసించాల్సిన అవసరం లేదు.
తెలుగును తప్పకుండా రక్షించుకోవాల్సిందే.
తెలుగుతో పాటు ఉర్దూ, కోయ, గోండు, లంబాడా తదితర భాషలన్నింటినీ కాపాడుకోవాల్సిందే.
ఏ భాషా కాలగర్భంలో కలిసిపోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందే.

మెజారిటీ ప్రజలు మాట్లాడే తెలుగు భాషలో పరిపాలన సాగితే సామాన్య ప్రజానీకానికి ఎంతో సౌలభ్యంగా వుంటుంది.
అదేసమయంలో విద్యార్థులు ఈనాటి పోటీ ప్రపంచంలో రాణించేందుకు ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం విశేషంగా తోడ్పడుతుంది.

అయితే అష్టకష్టాలు పడి, పదిహేను సంవత్సరాలపాటు పాఠశాలల్లో, కళాశాలల్లో, బండెడు పుస్తకాలతో కుస్తీ పట్టి, పట్టా సంపాదించుకునే నేటి సగటు విద్యార్థికి ఏ భాషలోనూ పరిపూర్ణ పరిజ్ఞానం లభించకపోవడం ఒక విషాదం.
ఇవాళే విడుదలైన ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.
మొత్తం ఎనిమిదిన్నర లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే ...
అందులో లక్షా 80 వేల మంది విద్యార్థులు ఇంగ్లీషులో ఫెయిలయ్యారు.
వారిలో 36,505 మంది విద్యార్థులకు 0 ... అక్షరాలా సున్నా మార్కులొచ్చాయి.
అదేసమయంలో తెలుగులో ఫెయిలైన విద్యార్థుల సంఖ్య కూడా తక్కువేమీ లేదు.
మొత్తం 62,426 మంది విద్యార్థులు తెలుగులో ఫెయిలయ్యారు.
వారిలో 24,029 మంది విద్యార్థులకు సున్నా మార్కులొచ్చాయి.

ఒకపక్క వేలకువేల ఫీజులు వసూలు చేసే కార్పొరేట్‌ కళాశాలలు తాము సాధించిన ఫలితాలను గురించి లక్షలకులక్షలు గుప్పించి పత్రికా ప్రకటనలతో, టీవీ యాడ్‌లతో సంబరాలు జరుపుకుంటుంటే - ఇంకోపక్క దిగువ మధ్య తరగతి, నిరుపేద విద్యార్థులు చదివే ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు మూతపడే పరిస్థితికి చేరుకుంటున్నాయి.
ఎన్ని సంవత్సరాలు చదివినా మనకు మన మాతృభాష రాదు.
ఎన్ని సంవత్సరాలు ఎన్ని పుస్తకాలు బట్టీయం పట్టినా మనం ఇంగ్లీషులో తప్పులులేకుండా రాయలేం, మాట్లాడలేం. (కాన్వెంట్‌ చదువుల గురించి పక్కన పెట్టి ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలల గురించి మాట్లాడుకుందాం). ఎంత దారుణమిది.
ఎక్కడుంది లోపం?

మన దేశానికి మానవ వనరులే తిరుగులేని సంపద. ఇంతటి బృహత్తరమైన సంపద మరే దేశానికీ లేదు. అ లాంటి మానవవనరులను సక్రమంగా వినియోగించుకోవడంలో ఎందుకు విఫలమౌతున్నాం? ఎక్కడ విఫలమవుతున్నాం?
పాఠ్యపుస్తకాలలో, సిలబస్‌లో దారుణమైన లోపాలేవో వున్నాయి.
అందుకే ఎన్ని సంవత్సరాలు వాటిని తిరగేసినా ఫలితాలు రావడం లేదు.
దీనికి తోడు ఇంగ్లీషు బోధించే ఉపాధ్యాయులకే సరైన భాషా పరిజ్ఞానం వుండటంలేదు. వాళ్లకే రానప్పుడు పిల్లలకేం చెప్తారు.

మరోపక్క నిన్నమొన్నటి వరకు ఇంగ్లీషులో మనకంటే ఎంతో వెనకబడి వున్న
మన ప్రత్యర్థి దేశం చైనా అతి కొద్ది సంవత్సరాలలోనే మనల్ని దాటి ముందుకు దూసుకుపోతోందన్న వార్తలు వస్తున్నాయి.
ఇంగ్లీషు నైపుణ్యం విషయంలో మొత్తం 44 దేశాల జాబితాలో చైనా 29వ స్థానంలో వుంటే, భారతదేశం 30వ స్థానంలో వున్నట్టు ఒక సర్వేలో తేలింది.
చైనా ప్రభుత్వం ఇంగ్లీషు బోధించే టీచర్లకు మంచి శిక్షణ యిచ్చి, ఆకర్షణీయమైన జీతాలిచ్చి, అనేక ప్రోత్సహకాలు కల్పించి ఈ అభివృద్ధిని సాధించింది.

మన దేశం ఇదే అ లసత్వాన్ని కొనసాగిస్తే మునుముందు మనం చైనాకంటే మరింత వెనుకబడిపోయే ప్రమాదం వుంది. అక్కడ వాళ్లు తమ మాతృభాషను అ లక్ష్యం చేయకుండానే,
ఇంకా చెప్పాలంటే దేశీయంగా పరిపాలనా, న్యాయ, వైద్య తదితర అన్ని రంగాలలో చైనా భాషను అమలు పరుచుకుంటూనే, అభివృద్ధిపరచుకుంటూనే కొద్ది సంవత్సరాలలో ఇంగ్లీషులో ఈ తిరుగులేని ఆధిక్యతను సాధించారు.

మనం కూడా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తూనే ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్ని అవసరం వుంది.
తెలుగుకు ఇంగ్లీషు, ఇంగ్లీషుకు తెలుగు వ్యతిరేకం కావన్న వాస్తవాన్ని గ్రహించి ఆంగ్ల భాషాభివృద్ధికి మరింత బలమైన పునాదులు వేసుకోవాలి.
ఇంగ్లీషు భాషాపరిజ్ఞానం దళితబడుగువర్గాల సత్వర సర్వతోముఖాభివృద్ధికి కూడా విశేషంగా దోహదం చేస్తుంది.

3 comments:

  1. ఇండియా ఒకప్పుడు బ్రిటిష్‌వాళ్ళ పాలనలో ఉండేది. చైనా బ్రిటిష్‌వాళ్ళకి semi-colony మాత్రమే కానీ పూర్తిగా colonise కాలేదు. చైనావాళ్ళకి వచ్చినంత ఇంగ్లిష్ మనకి రాకపోవడం ఆశ్చర్యకరమే. మాతృ బాష వచ్చినంత సులభంగా ఇంగ్లిష్ రాదు అనేది నిజం. కానీ ఇంగ్లిష్ పేరు చెప్పి తెలుగు మరచిపోతున్నాం. మాంగనీస్‌ని తెలుగులో కాకి బంగారం అంటారని ఎంత మందికి తెలుసు? మాంగనీసు అని పొల్లు స్థానంలో ఉకారం పెట్టి తెలుగులో పలుకుతున్నాం.

    ReplyDelete
  2. ప్రవీణ్ శర్మ గారూ

    ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలలో తన వాటాను సొంతం చేసుకునేందుకే
    చైనా ఇంగ్లీషును నేర్చుకోవడం ప్రారంభించింది.
    కేవలం పాతిక ముప్పై ఏళ్లలో ఈ అపూర్వ అభివృద్ధిని సాధించింది.
    అదే సమయంలో తన దేశీయ భాషలను అలక్ష్యం చేయకపోగా గణనీయంగా అభివృద్ది పరచుకుంటోంది.
    చైనాకు మెడిసిన్ చదవడానికి వెళ్లి వచ్చే మన విద్యార్ధులు గల గలా చైనా భాషను మాట్లాడ గలగడమే
    ఇందుకు ఒక ఉదాహరణ. అక్కడ విదేశీ విద్యార్ధులకు చైనా బాషను నేర్పుతున్నారు.
    చైనా మన దేశం నుంచి ఇంగ్లీషు బోధించే వాళ్ళను దిగుమతి చేసుకుంటోంది.
    మనకు చైనా భాషను నేర్పి పంపిస్తోంది. అది వాళ్ళ మాత్రు భాషాభిమానం.

    రాజకీయ నిర్ణయం, సంకల్ప బలం కొరవడిన మన దేశం -
    ముఖ్యంగా మన రాష్ట్రం అటు ఇంగ్లీషులో ప్రావీణ్యతను సాధించలేక , ఇటు తెలుగును కాపాడుకోలేక స్తబ్దతకు గురవుతోంది.
    పాటశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టినట్టే కానీ ఎన్నేళ్ళు చదివినా
    మనకు తప్పులు లేకుండా ఇంగ్లీషు మాట్లాడడం, రాయడం రావడమే లేదు.
    అరవై ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలలో ఇంగ్లీషు లోనే పరిపాలన సాగుతోంది
    అయినా అత్యధిక శాతం గుమాస్తాలు ఇంగ్లీషులో సరిగా నోటు రాయలేక పోతున్నారు.

    బాషా బోధనలో, ఉపాధ్యాయ శిక్షణ లో, సిలబస్ లో ఏదో లోపం వుండటం వల్లే కదా ఇదంతా.
    ఈ ఫైల్యూర్స్ ని నివారించడం మీద తక్షణమే దృష్టి సారించడం అవసరం.
    రాష్ట్ర దేశ ప్రయోజనాల రీత్యా ఇంగ్లీషుకు పోటీగా తెలుగును,
    తెలుగుకు ప్రత్యర్ధి భాషగా ఇంగ్లీషును చూడటం మాని మన విద్యార్ధులను
    ఆ రెండు భాషల్లో నిష్ణాతులను చేయాల్సిన అవసరం వుంది.
    అప్పుడే మన దేశంలోని అపార మైన మానవ వనరులను సద్వినియోగం చేసుకోగలుగుతాం.

    ReplyDelete
  3. Prabhakar, the problem is not English but "America pitchi" which really took off during Babu's "hitech" rule. The communication skills of Telugu "engineers" are pathetic. Some of these guys can't speak or write a single error free sentence in English. This is one reason why you find so few Telugus in soft skill intensive fields (e.g. project management, voice BPO, software architects, requirements analysts etc.).

    ReplyDelete