... ఇంగ్లీషూ తెలుగూ - ఏ భాషనూ సరిగా నేర్పలేకపోతున్న మన చదువులు! ...
ఈమధ్య ''తెలుగు భాషను రక్షించుకుందాం'' అనే నినాదం తరచుగా వినిపిస్తోంది.
అదే క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతినుంచే ఇంగ్లీషును ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై విమర్శలూ వెల్లు వెత్తుతున్నాయి.
నిజానికి ఒక భాషను రక్షించాలంటే మరో భాషను నిరసించాల్సిన అవసరం లేదు.
తెలుగును తప్పకుండా రక్షించుకోవాల్సిందే.
తెలుగుతో పాటు ఉర్దూ, కోయ, గోండు, లంబాడా తదితర భాషలన్నింటినీ కాపాడుకోవాల్సిందే.
ఏ భాషా కాలగర్భంలో కలిసిపోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సిందే.
మెజారిటీ ప్రజలు మాట్లాడే తెలుగు భాషలో పరిపాలన సాగితే సామాన్య ప్రజానీకానికి ఎంతో సౌలభ్యంగా వుంటుంది.
అదేసమయంలో విద్యార్థులు ఈనాటి పోటీ ప్రపంచంలో రాణించేందుకు ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం విశేషంగా తోడ్పడుతుంది.
అయితే అష్టకష్టాలు పడి, పదిహేను సంవత్సరాలపాటు పాఠశాలల్లో, కళాశాలల్లో, బండెడు పుస్తకాలతో కుస్తీ పట్టి, పట్టా సంపాదించుకునే నేటి సగటు విద్యార్థికి ఏ భాషలోనూ పరిపూర్ణ పరిజ్ఞానం లభించకపోవడం ఒక విషాదం.
ఇవాళే విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.
మొత్తం ఎనిమిదిన్నర లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే ...
అందులో లక్షా 80 వేల మంది విద్యార్థులు ఇంగ్లీషులో ఫెయిలయ్యారు.
వారిలో 36,505 మంది విద్యార్థులకు 0 ... అక్షరాలా సున్నా మార్కులొచ్చాయి.
అదేసమయంలో తెలుగులో ఫెయిలైన విద్యార్థుల సంఖ్య కూడా తక్కువేమీ లేదు.
మొత్తం 62,426 మంది విద్యార్థులు తెలుగులో ఫెయిలయ్యారు.
వారిలో 24,029 మంది విద్యార్థులకు సున్నా మార్కులొచ్చాయి.
ఒకపక్క వేలకువేల ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ కళాశాలలు తాము సాధించిన ఫలితాలను గురించి లక్షలకులక్షలు గుప్పించి పత్రికా ప్రకటనలతో, టీవీ యాడ్‌లతో సంబరాలు జరుపుకుంటుంటే - ఇంకోపక్క దిగువ మధ్య తరగతి, నిరుపేద విద్యార్థులు చదివే ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు మూతపడే పరిస్థితికి చేరుకుంటున్నాయి.
ఎన్ని సంవత్సరాలు చదివినా మనకు మన మాతృభాష రాదు.
ఎన్ని సంవత్సరాలు ఎన్ని పుస్తకాలు బట్టీయం పట్టినా మనం ఇంగ్లీషులో తప్పులులేకుండా రాయలేం, మాట్లాడలేం. (కాన్వెంట్ చదువుల గురించి పక్కన పెట్టి ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల గురించి మాట్లాడుకుందాం). ఎంత దారుణమిది.
ఎక్కడుంది లోపం?
మన దేశానికి మానవ వనరులే తిరుగులేని సంపద. ఇంతటి బృహత్తరమైన సంపద మరే దేశానికీ లేదు. అ లాంటి మానవవనరులను సక్రమంగా వినియోగించుకోవడంలో ఎందుకు విఫలమౌతున్నాం? ఎక్కడ విఫలమవుతున్నాం?
పాఠ్యపుస్తకాలలో, సిలబస్‌లో దారుణమైన లోపాలేవో వున్నాయి.
అందుకే ఎన్ని సంవత్సరాలు వాటిని తిరగేసినా ఫలితాలు రావడం లేదు.
దీనికి తోడు ఇంగ్లీషు బోధించే ఉపాధ్యాయులకే సరైన భాషా పరిజ్ఞానం వుండటంలేదు. వాళ్లకే రానప్పుడు పిల్లలకేం చెప్తారు.
మరోపక్క నిన్నమొన్నటి వరకు ఇంగ్లీషులో మనకంటే ఎంతో వెనకబడి వున్న
మన ప్రత్యర్థి దేశం చైనా అతి కొద్ది సంవత్సరాలలోనే మనల్ని దాటి ముందుకు దూసుకుపోతోందన్న వార్తలు వస్తున్నాయి.
ఇంగ్లీషు నైపుణ్యం విషయంలో మొత్తం 44 దేశాల జాబితాలో చైనా 29వ స్థానంలో వుంటే, భారతదేశం 30వ స్థానంలో వున్నట్టు ఒక సర్వేలో తేలింది.
చైనా ప్రభుత్వం ఇంగ్లీషు బోధించే టీచర్లకు మంచి శిక్షణ యిచ్చి, ఆకర్షణీయమైన జీతాలిచ్చి, అనేక ప్రోత్సహకాలు కల్పించి ఈ అభివృద్ధిని సాధించింది.
మన దేశం ఇదే అ లసత్వాన్ని కొనసాగిస్తే మునుముందు మనం చైనాకంటే మరింత వెనుకబడిపోయే ప్రమాదం వుంది. అక్కడ వాళ్లు తమ మాతృభాషను అ లక్ష్యం చేయకుండానే,
ఇంకా చెప్పాలంటే దేశీయంగా పరిపాలనా, న్యాయ, వైద్య తదితర అన్ని రంగాలలో చైనా భాషను అమలు పరుచుకుంటూనే, అభివృద్ధిపరచుకుంటూనే కొద్ది సంవత్సరాలలో ఇంగ్లీషులో ఈ తిరుగులేని ఆధిక్యతను సాధించారు.
మనం కూడా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తూనే ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్ని అవసరం వుంది.
తెలుగుకు ఇంగ్లీషు, ఇంగ్లీషుకు తెలుగు వ్యతిరేకం కావన్న వాస్తవాన్ని గ్రహించి ఆంగ్ల భాషాభివృద్ధికి మరింత బలమైన పునాదులు వేసుకోవాలి.
ఇంగ్లీషు భాషాపరిజ్ఞానం దళితబడుగువర్గాల సత్వర సర్వతోముఖాభివృద్ధికి కూడా విశేషంగా దోహదం చేస్తుంది.