Photo: Bathukamma Festival at Chicago. Courtesy: Andhra Prabha
కొన్ని బతుకమ్మ పాటలు
బతుకమ్మ పండుగ ఎంత విశిష్టమైనదో బతుకమ్మ పాటలు అంత విలక్షణమైనవి. తెలంగాణా సంస్కృతికి ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మ. ఆతరువాత స్థానం బోనాలది.
తెలంగాణ జాగృతి, ఆంధ్రజ్యోతి, టీవీ 9 కలిసి దేశవిదేశాల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం ఎంతో ముదావహం. తెలంగాణా జిల్లాల్లో, దేశ రాజధానిలోనే కాక దుబాయ్‌లో, అమెరికాలోని న్యూజెర్సీ, వాషింగ్‌టన్, బోస్టన్, చికాగో, కాలిఫోర్నియా వంటి నగరాల్లో ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు.
ఇదే క్రమంలో విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, అనంతపురం తదితర ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తే మరింత బాగుండేది. ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలు విలీనమై 54 ఏళ్లు కావస్తున్నా బతుకమ్మ పండుగ ఇప్పటికీ ఆంధ్రప్రాంతానికి పరాయి పండుగలాగే వుండిపోయింది. బతుకమ్మ పాటలు ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి కానీ పక్కనే వున్న ఆంధ్రలో మచ్చుకు కూడా వినిపించకపోవడం విషాదం.
సరే, ఇదిలా వుంటే మొన్న మా పక్కింటి అమ్మాయి వచ్చి ''బతుకమ్మ పాటలు ఏవైనా నెట్‌లోంచి ప్రింట్‌అవుట్ తీసివ్వరా అంకుల్ పాడుకుంటాం'' అని అడిగింది. దాంతో పది ఇరవై పాటలతో చిన్న బుక్‌లెట్ తయారుచేసిద్దాం అని ఎంతో ఉత్సాహంగా వెతికాను. కానీ ఆశ్చర్యంగా నాకు కనీసం ఒక్క బతుకమ్మ పాట సాహిత్యం కూడా దొరకలేదు. తెలంగాణా జాగృతి వారి వెబ్‌సైట్‌కి వెళ్తే ... పాటల సంగతి అటుంచి అక్కడ అసలు తెలుగు అక్షరాలే కనిపించలేదు. మార్కెట్‌లో కూడా నాకు బతుకమ్మ పాటల పుస్తకాలు లభించలేదు. ఇంత పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో కూడా బతుకమ్మ పాటలు లభించకపోవడం బాధాకరంగా అనిపించింది. బతుకమ్మ వెబ్‌సైట్‌లో, తెలంగాణా డెవలప్‌మెంట్ ఫోరం వెబ్‌సైట్‌లో, డిస్కవర్ తెలంగాణా వెబ్‌సైట్‌లో కొన్ని ఎంపి3 ఆడియో పాటలు మాత్రం కనిపించాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకుని ఓపిగ్గా వింటూ ఓ నాలుగు పాటలు టైప్‌చేసి ప్రింట్‌అవుట్ తీసి ఇచ్చి పరువు నిలబెట్టుకున్నాను. వాటినే దిగువన కూడా పొందు పరుస్తున్నాను. వీటిని పై వెబ్ సైట్‌లలో వినవచ్చు.
నేను సరిగ్గా వెతకలేదేమో అని అనుమానంగా వుంది. దయచేసి ఎవరైనా బతుకమ్మ పాటల జాడ తెలిస్తే సత్వరమే తెలుపవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.
బంగారు బతుకమ్మ...
(ప్రధాన గాయని:)
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో !
(అందరూ:)
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో !!
(ప్రధాన గాయని పాడుతుంటే అందరూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ''ఉయ్యాలో'' అంటుంటారు.)
ఆనాటి కాలాన ... ఉయ్యాలో!
ధర్మాంగు డను రాజు ... ఉయ్యాలో!
ఆరాజు భార్యయు ... ఉయ్యాలో!
అతి సత్యవతి యంద్రు ... ఉయ్యాలో!
నూరు నోములు నోమి ... ఉయ్యాలో!
నూరు మందిని గాంచె ... ఉయ్యాలో!
వారు శూరు లయ్యి ... ఉయ్యాలో!
వైరులచె హత మైరి ... ఉయ్యాలో!
తల్లిదండ్రు లపుడు ... ఉయ్యాలో!
తరగని శోకమున ... ఉయ్యాలో!
ధన ధాన్యములను బాసి ... ఉయ్యాలో!
దాయాదులను బాసి ... ఉయ్యాలో!
వనితతో ఆ రాజు ... ఉయ్యాలో!
వనమందు నివసించె ... ఉయ్యాలో!
కలికి లక్ష్మిని గూర్చి ... ఉయ్యాలో!
జనకోసం బొనరింప ... ఉయ్యాలో! ....
....
ఊరికి ఉత్తరాన ..
(ప్రథాన గాయని పాడుతుంటే అందరూ లయబద్ధంగా చప్పట్టు కొడుతూ ''వలలో'' అంటుంటారు)
ఊరికి ఉత్తరానా ... వలలో
ఊడాలా మర్రీ ... వలలో
ఊడల మర్రి కిందా ... వలలో
ఉత్తముడీ చవికే ... వలలో
ఉత్తముని చవికేలో ... వలలో
రత్నాల పందీరీ ... వలలో
రత్తాల పందిట్లో ... వలలో
ముత్యాలా కొలిమీ ... వలలో
గిద్దెడు ముత్యాలా ... వలలో
గిలకాలా కొలిమీ ... వలలో
అరసోల ముత్యాలా ... వలలో
అమరీనా కొలిమీ ... వలలో
సోలెడు ముత్యాలా ... వలలో
చోద్యంపూ కొలిమీ ... వలలో
తూమెడు ముత్యాలా ... వలలో
తూగేనే కొలిమీ ... వలలో
చద్దన్నమూ తీనీ ... వలలో
సాగించూ కొలిమీ ... వలలో
పాలన్నము దీనీ ... వలలో
పట్టేనే కొలిమీ ... వలలో
......
శ్రీలక్ష్మి నీ మహిమలు
1: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
2: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
1: గౌరమ్మ చిత్రమై తోచునమ్మా
భారతీ దేవివై బ్రహ్మ కిల్లాలివై
2: భారతీ దేవివై బ్రహ్మ కిల్లాలివై
1: పార్వతీ దేవివై పరమేశు రాణివై
పరగ శ్రీలక్ష్మివైయ్యూ గౌరమ్మ
భార్య వైతివి హరికినీ గౌరమ్మ
2: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
1: ముక్కోటి దేవతలు సక్కనీ కాంతలు
ఎక్కువగ నిను గొల్చి పెక్కు నోములు నోచి
ఎక్కువా వారయ్యిరీ గౌరమ్మ
ఈలోకమున నుండియూ గౌరమ్మ
2: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ .... //శ్రీలక్ష్మి//
....
చిత్తూ చిత్తూల బొమ్మ
1: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
2: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
1: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
2: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
1: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
2: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
1: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
2: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
రాగీ బిందె దీస్క రమణీ నీళ్లాకు బోతె ... //రాగీ//
రాములోడు ఎదురాయె నమ్మో ఈ వాడ లోన... //రాము//
ముత్యాల బిందె దీస్క ముదితా నీళ్లాకు బోతె ... //ముత్యాల//
ముద్దు కృష్ణు డెదురాయె నమ్మో ఈ వాడలోన ... //ముద్దు//
వెండీ బిందె దీస్క వెలదీ నీళ్లాకు బోతె ... //వెండి//
వెంకటేశు డెదురాయె నమ్మో ఈ వాడలోన ...//వెంకటేశు//
పగడీ బిందె దీస్క పడతీ నీళ్లాకు బోతె ...//పగడీ//
పరమేశుడెదురాయె నమ్మో ఈ వాడలోన ...//పరమేశు//
1: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
2: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
1: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
2: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
....
రామ రామా రామ ఉయ్యాలో ...
రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో!!
రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో !! //రామ రామా//
చారెడు బియ్యంలో ఉయ్యాలో! చారెడూ పప్పు పోసి ఉయ్యాలో!
చారెడు బియ్యంలో ఉయ్యాలో! చారెడూ పప్పు పోసి ఉయ్యాలో!
చారెడు పప్పుపోసి ఉయ్యాలో! వన దేవుని తల్లి ఉయ్యాలో!
చారెడు పప్పుపోసి ఉయ్యాలో! వన దేవుని తల్లి ఉయ్యాలో!
అక్కెమ్మ కేమొ ఉయ్యాలో! అన్నీ పెట్టింది ఉయ్యాలో! .....//అక్కెమ్మ కేమొ//
అప్పుడూ అక్కెమ్మ ఉయ్యాలో! తిన్నట్టు తిని ఉయ్యాలో! ....//అప్పుడూ//
తిన్నట్టు తినీ ఉయ్యాలో! పారేసినాది ఉయ్యాలో! //2//
పెద్దోడు రామన్న ఉయ్యాలో! బుద్ధిమంతుడాని ఉయ్యాలో! 2
ఏడు రోజుల్ల ఉయ్యాలో! చెల్లెరో అక్కెమ్మ ఉయ్యాలో! 2
అక్కెమ్మా కురులు ఉయ్యాలో! దురవాసినాయి ఉయ్యాలో! 2
అందరానికాడ ఉయ్యాలో! ఆకు అందుకోని ఉయ్యాలో! 2
ముట్టరాని కాడ ఉయ్యాలో! ముల్లు ముట్టుకోని ఉయ్యాలో! 2
పెద్ద నేలు రాత ఉయ్యాలో! పేరువాడా రాసి ఉయ్యాలో! 2
సిటికెనేలూ రాత ఉయ్యాలో! సిక్కువాడా రాసి ఉయ్యాలో! 2
రాకి గొంట బొయ్యి ఉయ్యాలో! రామన్న కిచ్చె ఉయ్యాలో! 2
కూసుండి రామన్న ఉయ్యాలో! రాకి గట్టుకోని ఉయ్యాలో! 2
రాయనాసి నచ్చి ఉయ్యాలో! పోయెనాసి నచ్చి ఉయ్యాలో! 2
బుడ్డెడూ నూనె ఉయ్యాలో! తీసుకా పోయింది ఉయ్యాలో! 2
చారెడంత నూనె ఉయ్యాలో! చదిరి తలకంటి ఉయ్యాలో! 2
కడివెడంత నూనె ఉయ్యాలో! కొట్టి తలకంటి ఉయ్యాలో! 2
గిద్దెడంత నూనె ఉయ్యాలో! గిద్ది తలకంటి ఉయ్యాలో! 2
ఆరసోడూ నూనె ఉయ్యాలో! అందంగ తలకంటి ఉయ్యాలో! 2
సోలెడూ నూనే ఉయ్యాలో! సోకిచ్చే తల ఉయ్యాలో! 2
వెండి దువ్వెనా ఉయ్యాలో! వెయ్యి చిక్కూతీసె ఉయ్యాలో! 2
తల్లి రావే తల్లి ఉయ్యాలో! తల్లిరో పెద్దమ్మ ఉయ్యాలో! 2
నాకునూ కష్టాలు ఉయ్యాలో! ఎందమ్మా తల్లి ఉయ్యాలో! 2
ఏమి కష్టాలనూ ఉయ్యాలో! తలపెట్టినావమ్మ ఉయ్యాలో! 2
పిడికెడంత మిరెము ఉయ్యాలో! కండ్లల్ల పోసె ఉయ్యాలో! 2
మంట అనీ అంటె ఉయ్యాలో! సంతోషపడుదును ఉయ్యాలో! 2
అట్లయిన మంచిదె ఉయ్యాలో! సప్పుడే చెయ్యదీ ఉయ్యాలో! 2
పొగాకు కండెమూ ఉయ్యాలో! తీసినాడు దేవుడూ ఉయ్యాలో! 2
కాళ్లకిందా యేసి ఉయ్యాలో! నలిపినాడుదేవుడు ఉయ్యాలో! 2
నశ్యమూ జేసిండు ఉయ్యాలో! ముక్కులాపెడ్టిండు ఉయ్యాలో! 2
ఒక్క తుమ్మన్న ఉయ్యాలో! తుమ్మినా గానీ ఉయ్యాలో! 2
నాయినీ భ్రమలూ ఉయ్యాలో! తీరునేమో గానీ ఉయ్యాలో! 2
రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో!!
రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో !!
ఏడున్నొక్క మేడలూ ఉయ్యాలో! కాలికూలాబట్టె ఉయ్యాలో! 2
ఏడు దొడ్ల బాసి ఉయ్యాలో! కాలికూలబట్టె ఉయ్యాలో! 2
బుచ్చపోళ్ల ఏసెమూ ఉయ్యాలో! సేసినాడు దేవుడు ఉయ్యాలో! 2
అక్కెమ్మ తల్లిగారు ఉయ్యాలో! ఏడువా బట్టిరీ ఉయ్యాలో! 2
ఏడువా బట్టిరీ ఉయ్యాలో! తూడువా బట్టిరీ ఉయ్యాలో! 2
సెల్లె నొక్క సేత ఉయ్యాలో! బల్లె మొక్క సేత ఉయ్యాలో! 2
పట్టుకోని అన్నలూ ఉయ్యాలో! ఏడువా బట్టిరీ ఉయ్యాలో! 2
ఏడుగురు అన్నలూ ఉయ్యాలో! చెల్లెనూ తీస్కోని ఉయ్యాలో! 2
చెల్లెనూ తీస్కోని ఉయ్యాలో! జంగలూ బాటనూ ఉయ్యాలో! 2
జంగలూ బాటనూ ఉయ్యాలో! అన్నలే బట్టిరీ ఉయ్యాలో! 2
ఉడుకుడుకు దుబ్బల్ల ఉయ్యాలో! నడుస్త ఉన్నరూ ఉయ్యాలో! 2
నడిచేటి కాళ్లకూ ఉయ్యాలో! పొక్కులొచ్చినాయి ఉయ్యాలో! 2
ఎండకాలం రోజు ఉయ్యాలో! దూపలూ కాబట్టె ఉయ్యాలో! 2
దూపైతాందాని ఉయ్యాలో! అంటలేరు మరి ఉయ్యాలో! 2
ఆకలైతాందనీ ఉయ్యాలో! అంటలేరు మరి ఉయ్యాలో! 2
వన దేవుని తల్లి ఉయ్యాలో! వనపున్నూ రాలు ఉయ్యాలో! 2
అప్పుడూ వనదేవుడు ఉయ్యాలో! ఏడుగురన్నలకూ ఉయ్యాలో! 2
ఏడుగురన్నలకూ ఉయ్యాలో! ఏడుపండ్లు ఇచ్చి ఉయ్యాలో! 2
అక్కెమ్మ కేమొ ఉయ్యాలో! వెన్న పండు యిచ్చె ఉయ్యాలో! 2
వెన్నె ముద్దపండు ఉయ్యాలో! పదాడబట్టింది ఉయ్యాలో! 2
ఏం పిల్లా నమ్మ ఉయ్యాలో! ఎందుకింతా గర్వం ఉయ్యాలో! 2
గొల్లాయినయి ఉయ్యాలో! పాలు తెచ్చినాడు ఉయ్యాలో! 2
ఏడుగురన్నలూ ఉయ్యాలో! పాలు తెచ్చినారు ఉయ్యాలో! 2
గిలాసెడూ పెరుగు ఉయ్యాలో! అక్కెమ్మ కిచ్చిండ్లు ఉయ్యాలో! 2
వనదేవుడేమొ ఉయ్యాలో! గొల్ల వేషంతోని ఉయ్యాలో! 2
గొల్ల వేషంతోని ఉయ్యాలో! వచ్చినాడనుకొని ఉయ్యాలో! 2
వచ్చినాడనుకొని ఉయ్యాలో! అక్కెమ్మగూడా ఉయ్యాలో! 2
అక్కెమ్మ గూడా ఉయ్యాలో! అయినా పెరుగునూ ఉయ్యాలో!2
అయినా పెరుగునూ ఉయ్యాలో! పారా బోసింది ఉయ్యాలో! 2
చాలోడూ అయి ఉయ్యాలో! చీరెలూ తెచ్చిండు ఉయ్యాలో! 2
ఏడుగురు అన్నలకూ ఉయ్యాలో! ఏడు దోతులిచ్చి ఉయ్యాలో! 2
సన్నయి వొయ్యెలు ఉయ్యాలో! అక్కెమ్మ కిచ్చిండు ఉయ్యాలో! 2
నాకు ఎందుకాని ఉయ్యాలో! పారేసీనాది ఉయ్యాలో! 2
ఆయినీ సీరెలూ ఉయ్యాలో! తీసుకుంటేనేమొ ఉయ్యాలో! 2
తీసుకుంటెనేమొ ఉయ్యాలో! వనదేవునికేమొ ఉయ్యాలో! 2
వనదేవుని కేమొ ఉయ్యాలో! బ్రమలూ తీరునూ ఉయ్యాలో! 2
అట్లనన్న బ్రమ ఉయ్యాలో! తీరుననుకున్నడు ఉయ్యాలో! 2
అప్పుడూ అక్కమ్మ ఉయ్యాలో! ఆయినీ సీరెలను ఉయ్యాలో! 2
నాకు ఎందుకానీ ఉయ్యాలో! పారేసి నాది ఉయ్యాలో! 2
అట్లగాకపోతె ఉయ్యాలో! మరిఎట్ల జేతును ఉయ్యాలో! 2
తూర్పు దిక్కున ఉయ్యాలో! కొసినా కొరకలూ ఉయ్యాలో! 2
కోసినా కొరకలూ ఉయ్యాలో! పండుతాందీ పిల్ల ఉయ్యాలో! 2
ఆ పంట కోసమూ ఉయ్యాలో! మీ అన్నదమ్ములూ ఉయ్యాలో! 2
మీ అన్నదమ్ములూ ఉయ్యాలో! పోతారు పిల్ల ఉయ్యాలో! 2
రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో!!
రామ రామా రామ ఉయ్యాలో! రామనే శ్రీరామ ఉయ్యాలో!!
రామ రామా నంది ఉయ్యాలో! రాగ మెత్తారాదు ఉయ్యాలో !!
ఊల్లెకూ మీరు ఉయ్యాలో! చేరవచ్చే నేమొ ఉయ్యాలో! 2
సుంకరోన్నయి ఉయ్యాలో! నేను వస్తా పిల్ల ఉయ్యాలో! 2
మీ ఏడుగురన్నలూ ఉయ్యాలో! మనిషి కొక్కా దెబ్బ ఉయ్యాలో! 2
(వీటిలో కొన్ని అసంపూర్తిగా వున్నట్టున్నాయి. మరికొన్నింటిని తరువాత వీలునుబట్టి విని టైప్ చేసి పొందుపరుస్తాను)
......
Monday, September 21, 2009
Friday, September 4, 2009
వంద గుండెలు ఆగిపోయాయి... పాతిక గుండెలు తమను తాము చిదిమేసుకున్నాయి...! ఈ పాపం ఎవ్వరిది?
...
...
...
మిగతా దేశాలతో పోలిస్తే గుండె సంబంధ వ్యాధులున్న వారు మన దేశంలోనే ఎక్కువ. ఇక్కడ ప్రతి వంద మరణాల్లో 30కి పైగా మరణాలు కేవలం గుండె జబ్బులవల్లనే సంభవిస్తున్నాయి. 1990 సంవత్సరంలో మన దేశంలో గుండె జబ్బులతో చనిపోయినవారి సంఖ్య 1.17 మిలియన్లయితే, 2000 సంవత్సరంలో అది 1.59 మిలియన్లు. కాగా వచ్చేయేటికల్లా (2010) ఈ సంఖ్య 2.03 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా.
అమెరికాలో గుండెజబ్బులూ, గుండెజబ్బుల కారణంగా సంభవించే మరణాలూ తగ్గుతుంటే, మన దేశంలో మాత్రం అతి వేగంగా పెరుగుతున్నాయి. 2015 నాటికి అమెరికాలో గుండెజబ్బులున్న వారి సంఖ్య 16 మిలియన్లుంటే, మన దేశంలో (పరిస్థితి ఇట్లాగే కొనసాగితే) 62 మిలియన్లు దాటుతుందని కాలిఫోర్నియాలోని ఒక రీసెర్చ్ ఫౌండేషన్ పేర్కొంది. దరిమిలా మధుమేహంతో పాటు గుండె జబ్బులకు కూడా భారతదేశమే ''ప్రపంచ రాజధాని'' అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
గుండెజబ్బులకు అధిక రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం, కొలెస్టరాల్, మానసిక ఒత్తిళ్లు, పొగత్రాగడం, మద్యపాన సేవనం ప్రధాన కారణాలు.
ఈమధ్య కాలంలో మద్యపానం, సిగరెట్లు (బీదవాళ్లైతే బీడీలు) కాల్చడం, గుట్కాలూ జర్దా పాన్లూ నమలడం వంటి అ లవాట్లు మన సమాజంలో విజృంభిస్తున్నాయి. బీపీలు, గుండెజబ్బులు పెరగడానికి అవే ఎక్కువగా దోహదం చేస్తున్నాయి. ప్రజలు ఈ దురలవాట్లకు దూరంగా వుండేలా వారిని చైతన్య పరిచేందుకు పాలకులు విస్తృత స్థాయిలో నిర్థిష్టమైన కార్యక్రమాలేమీ చేపట్టడంలేదు. పైగా మద్యపాన నిషేదాన్ని పూర్తిగా ఎత్తివేసి ఊరూరా వాడవాడలా బెల్టు షాపులు పెట్టి మంచి నీళ్లు దొరకని చోట కూడ మందుకు కరువులేకుండా చేస్తున్నారు.
ఇక ఆత్మహత్యల విషయానికి వస్తే ప్రపంచంలో ప్రతి సంవత్సరం పది లక్షలమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. మనదేశంలో అయితే ఏడాదికి లక్ష మంది వరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 1989లో 68,744 మంది ఆత్మహత్యలకు పాల్పడితే 2006లో 1,18,112 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉత్తరాదికంటే దక్షిణాదిలోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. పత్తి రైతుల, చేనేత కార్మికుల ఆత్మహత్యల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అపకీర్తిని మూటగట్టుకుంది. రైతు వ్యతిరేక ప్రభుత్వ పాలనలోనూ, రైతు అనుకూల ప్రభుత్వ పాలనలోనూ ఈ ఆత్మహత్యలు ఆగకుండా జరుగుతూనే వుండటం ఒక విషాదం.
పంటలు దెబ్బతినడం, అప్పుల పాలుకావడం, నిరుద్యోగం, గృహ హింస, మానసిక ఒత్తిళ్లు, ఫెయిల్యూర్లు, నిరాశానిస్పృహలు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు. ఈ విషయంలో కూడా ప్రజల్లో, యువతీ యువకుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలిగేలా అధికారికంగా విస్తృత స్థాయిలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదు. దరిమిలా పరిస్థితి భయంకరంగా తయారైంది..
ఈ నేపథ్యంలో డాక్టర వై.ఎస్. రాజశేఖరరెడ్డి దుర్మరణం, ఆ షాక్‌తో రాష్ట్రవ్యాప్తంగా గుండె ఆగి లేదా ఆత్మహత్య చేసుకుని దాదాపు 150 మంది వరకు చనిపోవడం తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. గతంలో గాంధీ, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఇంకా ఇతర ఏ జాతీయ నాయకులు చనిపోయినప్పుడు కూడా ఈ స్థాయిలో మరణాలు సంభవించలేదు.
మరి ఇప్పుడు ఎందుకు జరిగాయి? ఎందుకు ఇన్ని గుండెలు ఆగిపోయాయి? ఎందుకు ఇంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు? ఇందుకు బాధ్యులెవరు? అని ఒక్కసారి ఆలోచిస్తే కనిపించే కారణాలు:
1) ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. (గతంలో టీవీ మీడియా ఇంత విస్తృత స్థాయిలో లేదు). ఒక ఛానల్‌తో మరో ఛానల్ పోటీపడుతూ ఎడతెరిపి లేకుండా చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ వార్తా ప్రసారాలకి దాదాపు 24 గంటల పాటు రాష్ట్ర ప్రజలంతా నరాలు తెగే ఉత్కంఠతకు, మానసిక ఉద్వేగానికి, ఒకవిధమైన ఉన్మాదానికి గురయ్యారు. టీవీ ఛానళ్లు ఇతర అన్ని వార్తలను పక్కన పెెట్టేశాయి. కేబుల్ ఆపరేటర్లు కేవలం ఈ వార్తా ఛానళ్లను తప్ప ఇతర ఛానళ్ల ప్రసారాలను నిలిపి వేసి ప్రజల పంచేద్రియాలు ఈ వార్తకే అంకితమయ్యేట్టు చేశాయి. అది దుర్బల మనస్కుల మీద తీవ్ర ప్రభావం చూపింది.
2) కారణాలు ఏమైనా గానీ, డాక్టర్ వైఎస్ ఉదయం పూట ప్రయాణం చేసిన హెలీకాప్టర్ స్వరాష్ట్రంలో కూలిపోతే దాదాపు 24 గంటల వరకు ఆచూకీ కనుక్కోలేని ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం. మీడియాలో రకరకాల కథనాలు, ఊహాగానాలూ వెలువడుతున్నా ప్రభుత్వ పరంగా సకాలంలో సరైన సమాచారం ప్రజలకు లభించకపోవడం.
3) పావలా వడ్డీ రుణాలు, వృద్ధాప్య ఫించన్లు, ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు, బిసి స్కాలర్‌షిప్‌లు మొదలైనవన్నీ ఎక్కడ ఆగిపోతాయో అన్న ఆందోళన. అవన్నీ ఆగవనీ, వాటిని అమలు చేసేది ఒక వ్యక్తి కాదనీ, ప్రభుత్వమనీ వందేళ్ల చరిత్ర వున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అవగాహన కలిగించలేకపోవడం.
4) స్వాతంత్య్రం వచ్చి 62 సంవత్సరాలు అవుతున్నా ప్రజల కనీస/ప్రాథమిక సమస్యలు కూడా తీరకపోవడం. ప్రతి చిన్న విషయానికీ రాజకీయ నాయకుల దయాధర్మాల మీద ఆధారపడే దుస్థితిలో వుండటం. వారికి రాజ్యాంగం గురించి గానీ, ప్రజాస్వామిక హక్కుల గురించి గానీ కనీస అవగాహన కూడా లేకపోవడం. నిరక్షరాస్యత, అజ్ఞానం, పేదరికం.
5) కమ్యూనిస్టు దేశాలలో మాదిరగా మన ప్రజాస్వామిక దేశంలో కూడా పార్టీలకు, సిద్ధాంతాలకు అతీతంగా వ్యక్తిపూజ పెరగడం.
''దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్'' అన్నాడు మహాకవి గురజాడ ఆనాడు. ఆ మనుషులు దుర్బల మనస్కులైతే దేశమేగతి బాగుపడునోయ్ అనవలసి వస్తోంది ఈనాడు.

Subscribe to:
Posts (Atom)