Monday, October 19, 2015

అంటరాని బతుకమ్మ!


ఈ రోజు (19-10-2015) నమస్తే తెలంగాణా (జిందగీ పేజీ)లో ప్రచురించబడ్డ నా

చిన్ననాటి బతుకమ్మ పండుగ జ్ఞాపకం : 

అంటరాని బతుకమ్మ!

నలభైఐదేళ్ల కిందట వరంగల్లుల జరిగిన ముచ్చట. గారోజు సూర్యుని కంటె ముందుగాలనే లేసి దోస్తులతోని కట్టమల్లన్న దాన్క పోయి సంచెడు తంగేడు పూలు తెంపుకొచ్చినం. కొన్ని గునుగు పూలను ఇంటిముందటికి అమ్మొస్తె మా అమ్మ కొన్నది. ఒక్కొక్క కట్టని ఒక్కొక్క రంగునీళ్లల్ల ముంచి ఆరబెట్టింది. వంటపని అయిపోయినంక పగటీలి బతుకమ్మను పేరుస్తది.

ఇంతల మా తమ్ముడు సుధాకర్‌ ఏం తిన్నడో ఏమోగని కడుపునొస్తాందని ఒకటే తల్లడిల్లబట్టిండు. ఇంట్ల నాయిన లేడు. నేను మా అమ్మ కలిసి వాణ్ని లక్ష్మి టాకీస్‌ దగ్గరున్న అమ్జద్‌ అలీ దవఖానకు తీసుకపోయినం. తిరిగి వచ్చెవరకు చీకటి పడ్డది. మిల్‌కాలనీల మా గ్రూపు నుంచి బతుకమ్మ ఆడటానికి పోయినోళ్లంత అప్పటికే వాపస్‌ వచ్చిండ్లు.

ఇయ్యాల మనకు బతుకమ్మ లేదుర అనుకుంట బాధపడ్డది అమ్మ. కని ఇంటికొచ్చి సూస్తె ఏమున్నది మా చెల్లె సుగుణ రెండు సిబ్బిలల్ల రెండు బతుకమ్మలను పేర్చి, కొత్త బట్టలు కట్టుకొని ముద్దుగ తయారై మాకోసం ఎదురుసూసుకుంట కూసునున్నది.
''ఎవరు పేర్శిండ్లే గీ బతుకమ్మలను, ఎవరన్నొచ్చిండ్లా మన ఇంటికి?'' ఇచిత్రపడుతూ అడిగింది మా అమ్మ.

''ఎవ్వరు రాలే. నేనే పేర్చిన. బాగున్నయామ్మా?''

మా చెల్లె రెండు చెంపలను నిమిరి మెటికలు ఇరిసి ''నా కంటె మంచిగ పేర్చినవు బిడ్డా'' అని తెగ సంబురపడ్డది అమ్మ. అప్పుడు మా చెల్లె వయసు తొమ్మిదేండ్లు వుంటుండవచ్చు.
బతుకమ్మలు రెడీగ వుండె వరకు మా అమ్మకు మల్ల హుషారొచ్చింది. జెప్పున రెండు చెంబులు నీళ్లు పోసుకున్నది. దీపం ముట్టించి, దండం పెట్టుకున్నది. ట్రంకు పెట్టెలోనించి ఇరవై ఏండ్ల కిందటి పీతాంబురం తీసి కట్టుకున్నది. సుధాకర్‌ను, ఇంకో తమ్ముడు భాస్కర్‌ను ఇంట్లనే వుంచి మా అమ్మ, మా చెల్లె, వాళ్లకు తోడుగ నేను బతుకమ్మలను పట్టుకోని ఆ చీకట్ల దబాదబా మల్లికుంట చెరువు దిక్కు పరుగుతీసినం.

అప్పుడు గాంధినగర్‌ల వీధిలైట్లెక్కడివి. లాంతర్ల, బుడ్డి దీపాల వెలుగు తప్పితె అంతా చీకటే. గతుకుల రోడ్డు, తుమ్మ చెట్లు, తుప్పలు అన్ని దాటుకుంట పోయెవరకేమున్నది చెరువు చుట్టు అంత ఖాళీగ వున్నది. ఎక్కడోళ్లక్కడ బతుకమ్మలాడి ఎల్ల్లిపోయిండ్లు.
అయితె ఇంక రెండు పెద్ద గుంపులు మాత్రం వున్నయి. పెట్రొమాక్స్‌లైట్లు పెట్టుకోని జోర్దార్‌గా బతుకమ్మ పాటలు పాడుతున్నరు. ఆ ఆడోళ్ల పట్టు చీరలు లైట్ల వెలుగుల తళతళ మెరిసిపోతున్నయి. ఒక్కొక్కరి ఒంటి మీద కిలోకిలో బంగారు నగలున్నయి. కొద్దిగ దూరంగ వాళ్లకు తోడొచ్చిన మొగోళ్లు జీపుల పక్కన, మోటరు సైకిళ్ల పక్కన నిలబడి మాట్లాడుకుంటున్నరు.
ఆరోజుల్ల గిర్మాజిపేట, మండిబజార్‌, బీట్‌ బజార్‌, పోచమ్మమైదాన్‌, గోపాల్‌సామి గుడి ఎక్కడెక్కడి నుంచో బతుకమ్మ ఆడటానికి మల్లికుంట చెరువుకు వచ్చెటోళ్లు. ఇప్పుడైతే గా మల్లికుంట చెరువే మాయమైపోయిందనుకోండ్రి.

ఒక గుంపు దగ్గరకు పోయి ''మావోళ్లంత ఎళ్లిపోయిండ్లు. జెర మా బతుకమ్మలను మీ దగ్గర పెట్టుకుంటం' అని అడిగింది ఆమ్మ. ''ఏయ్‌ పో పో'' అని కసురుకున్నరు ఆ ఆడోళ్లు. ఇంకో గుంపు దగ్గరకు పోతే వాళ్లు సుత దగ్గరకు రానియ్యలేదు. మా అమ్మకు, చెల్లెకు కళ్లల్ల నీళ్లొచ్చినయి.

చేసేదేంలేక రెండు బతుకమ్మలను చెరువు గట్టుమీద పెట్టి మా అమ్మా, చెల్లే వాటి పక్కన బిక్కు బిక్కుమనుకుంట నిలబడ్డరు.

''మనల్ని ఎందుకు రానివ్వడం లేదమ్మా వాళ్లు?''

''వాళ్లు కోమటోళ్లు - మనం సుద్దరోళ్లం (శూద్రులం) గాదుర కొడుకా, గందుకె రానియ్యలేదు'' అన్నది.

నాకు అంతకు ముందరి సంవత్సరం జరిగి సంఘటన గుర్తుకొచ్చింది.

''పోయిన సారి ఇద్దరు చిన్న పిల్లలు బతుకమ్మలను పట్టుకొని వస్తే మీరు కూడ గిట్లనే ఆడనియ్యలేదు కదమ్మా. అప్పుడు వాళ్ల తల్లులు మీతోని పెద్ద కొట్లాట కూడ పెట్టుకున్నరు యాదికున్నదా?''అని అడిగిన.

''ఔ. వాళ్లు మాదిగోళ్లుగద కొడుకా. అందుకే మా గుంపుల ఆడనియ్యలేదు'' అదేదో మామూలు విషయమే అన్నట్టు అన్నది అమ్మ.
అని మొక్కుబడికి ఒక బతుకమ్మ పాట అందుకున్నది.
ఆతరువాత బతుకమ్మలను చెరువుల శాస్త్రం ప్రకారం సాగనంపి అందరం మౌనంగ, డీలాగా ఇంటికి వచ్చినం.

- ప్రభాకర్‌ మందార
 (ఇది నా దగ్గరి ఎడిట్ కాని యునికోడ్ వెర్షన్)


నిన్న (18-10-2015) యాదృచ్చికంగా
ఆదివారం ఆంద్ర జ్యోతిలో 
దాదాపు ఇదే అంశం పై, ఇదే శీర్షికతో (అంటరాని బతుకమ్మ) పి. చిన్నయ్య గారి కథ వచ్చింది.
అలాగే నమస్తే తెలంగాణా ఆదివారం మాగజైన్ బతుకమ్మలో
చందు తులసి గారి "పాలపిట్టల పాట" అనే మరో కథ వచ్చింది.
వాటిలో కూడా ఈ సమస్యను మరింత లోతుగా చిత్రించారు. 
వీలయితే వాటిని  కూడా తప్పక చదవండి


Thursday, September 17, 2015

కొత్త పుస్తకం : 1984 దిల్లీ నుండి 2002 గుజరాత్‌ వరకు... వ్యవస్థల వైఫల్యంపై పంచనామా

1984 దిల్లీ నుండి 2002 గుజరాత్‌ వరకు... వ్యవస్థల వైఫల్యంపై పంచనామా

రచన : మనోజ్‌ మిట్ట, హెచ్‌.ఎస్‌ . ఫూల్కా
ఆంగ్లమూలం: When A Tree Shook Delhi, The 1984 Carnage and its Aftermath (Roli Books, New Delhi);
The Fiction of Fact-finding: Modi and Godhra (Harper Collins publishers India), .

తెలుగు అనువాదం : ప్రభాకర్‌ మందార, రివేరా

ప్రధమ ముద్రణ : సెప్టెంబర్ 2015

441 పేజీలు, 
వెల : రూ. 250/-




ప్రతులకు వివరాలకు:
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌,
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడిమల్కాపూర్‌,
హైదరాబాద్‌ - 500006
ఫోన్‌ : 040 2352 1849
ఇమెయిల్‌ : hyderabadbooktrust@gmail.com

HBT Blog:
http://hyderabadbooktrust.blogspot.in/
.......................................................................................................................................

తెలుగు పుస్తకానికి మనోజ్ మిట్టా ప్రత్యేకంగా రాసిన ముందుమాట నుంచి ...
....
'1978లో నల్లకుంట పోలీసులు రమీజాబీపై అత్యాచారంచేసి, ఆమె భర్తను కొట్టి చంపిన సందర్భంగా రాజుకున్న గొడవలతో నాకు తొలిసారిగా మత హింస అంటే ఏమిటో తెలిసింది. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పోలీసుల చర్యకు వత్తాసు పలుకుతూ రమీజాబీని వేశ్యగా చిత్రించింది. ఆమె రోడ్డు మీద విటుల కోసం ఎదురుచూసేదని ప్రచారం చేసింది.

అంతవరకు ప్రభుత్వ ఆస్తులను లక్ష్యం చేసుకుని సాగుతున్న విధ్వంసకాండ ఆ తరువాత మత హింసగా మారింది. ఆ తరువాత జస్టిస్‌ ముక్తదర్‌ కమిషన్‌ పోలీసుల వాదనను ఎంత ఎండగట్టినా 1978నాటి హింసాకాండ హైదరాబాద్‌ అంతటికీ మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున పాత బస్తీకి విస్తరించింది.

మేముండే మలక్‌పేట పాత బస్తీకి దగ్గర కాబట్టి అది తీవ్రస్థాయిలో మత హింస చెలరేగిన ప్రాంతాల్లో ఒకటిగా మారింది. తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకూ నా చదువు ఈ గొడవలతో తరచూ కుంటుపడుతుండేది. మా ఇరుగు పొరుగు ప్రాంతాలు తరచూ కర్ఫ్యూ నీడలో బిక్కుబిక్కుమంటుండేవి.

హైదరాబాద్‌లో చదువుకుంటున్న రోజుల్లో 1984 ఆగస్ట్‌లో నేను చిట్టచివరి మత హింసాకాండను చూశాను. అత్యంత దారుణంగా జరిగిన మతోన్మాద హింసాకాండల్లో అదొకటి అని చెప్పవచ్చు. అప్పుడు మొత్తం 40 మంది బలయ్యారు.

అయితే, ఆ తరువాత కొద్ది నెలలకే దిల్లీలో చోటు చేసుకున్న దారుణ మారణకాండలో అధికారిక లెక్కల ప్రకారం 2,733 మంది బలైనట్టు తేలింది. హైదరాబాద్‌లోనే కాదు దేశంలోని మరే ఇతర ప్రాంతంలోనూ ఆ స్థాయిలో మతోన్మాద హింసకు చెలరేగిన దాఖలాలు లేవు.

దిల్లీలో జరిగిన మారణహోమం భారత దేశ చరిత్రనే ఒక మలుపు తిప్పింది. ఆ వెంటనే వచ్చిన లోక్‌సభ ఎన్నికలలో సిక్కు వ్యతిరేక ఉన్మాదాన్ని ఉపయోగించుకుని రాజీవ్‌ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

1984 నాటి రక్తపాతంపై విచారణ జరిపిన మిశ్రా కమిషన్‌ చాలా అవకతవకగా వ్యవహరించింది. దానికి తోడు రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం బాబ్రీ మసీదు ప్రాంగణంలో రామజన్మభూమి గుడికి తలుపులు తెరిచి మతోన్మాదులకు మరింత శక్తిని సమకూర్చింది.

షాబానో సమస్యపై ముస్లిలను సంతృప్తిపరిచేందుకు తీసుకున్న నిర్ణయానికి ప్రతిగా రామజన్మభూమి గుడికి తెరలేపినట్టు అనిపించినా ఆ చర్య హిందూ జాతీయవాదానికి అసలు ప్రతినిధిగా భావించబడే భారతీయ జనతా పార్టీకి ఒక వరంగా మారింది.

ఈ విధంగా మతపరంగా వేడెక్కి వున్న వాతావరణం మధ్య దిల్లీలో పత్రికా రచయితగా నా జీవితం ప్రారంభమయింది. నేను సహజంగానే 1984 నాటి హింసాకాండ బాధితులకు న్యాయం చేకూర్చాలన్న లక్ష్యానికి అంకితమయ్యాను.

హైదరాబాద్‌లో బాల్యం నుంచే నాలో లౌకికవాదం పట్ల ఏర్పడిన అభిమానమే ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకాడకుండా ముందుకు సాగేందుకు దోహదం చేసిందని నేను భావిస్తున్నాను.

- మనోజ్ మిట్టా 

(19 సెప్టెంబర్ 2015 శనివారం సాయంత్రం 
బంజారాహిల్స్లోని లామకాన్ లో జరిగే పుస్తకావిష్కరణ సభలో, 
ఆ సందర్భంగా 'బహుళత్వ భారతంలో కలుపుకుపోయే రాజకీయాల'పై నిర్వహిస్తున్న
ఆసక్తికరమైన చర్చలో  

పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ, 
ప్రొఫెసర్ కోదండరాం, 
ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం లతో పాటు 
ఈ పుస్తక రచయితలు  మనోజ్ మిట్టా, హెచ్ ఎస్ ఫూల్కాలు పాల్గొంటున్నారు)