''నాకు కశ్మీర్ కావాలి'' - జవహర్లాల్ నెహ్రూ
...........................................................
(ప్రముఖ బ్రిటిష్ రాజకీయ తత్వవేత్త,
చరిత్రకారుడు పెరి ఆండర్సన్ రచించిన “ది ఇండియన్ ఐడియాలజీ” అన్న పుస్తకాన్ని
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ “ఇండియాలో దాగిన హిందూస్తాన్” పేరిట తెలుగులో
ప్రచురించింది. అందులో కష్మీర్ కు సంబంధించి నెహ్రూ ఆలోచనల గురించిన భాగం ఇది)
'... నెహ్రూ ఆలోచనలు
కశ్మీర్ పైనే వున్నాయన్నది వాస్తవం. ఆయన ఉత్తర ప్రదేశ్‌లో పుట్టి పెరిగినప్పటికీ
తన పూర్వీకులంతా కశ్మీర్‌లోని హిందూ సంపన్న వర్గానికి చెందిన వాళ్లు కావడం వల్ల
కశ్మీర్‌తో నెహ్రూకు కొంత భావోద్వేగపరమైన అనుబంధం వుంది. ...
మొట్టమొదటిసారిగా నెహూృ పైలా పచ్చీసు వయసులో ఎలుగుబంటి వేటకోసం కశ్మీర్ వెళ్లారు. ఆ తర్వాత 1940 వరకూ మళ్లీ అటువైపు కన్నెత్తి చూడలేదు. కానీ కశ్మీర్ గురించి పర్యాటక ప్రచార కరపత్రాలలో వుండే అసహజమైన అభివర్ణనల మాదిరిగా ఆయన తన స్మృతులను రాసుకున్నారు.
''నేను ఆ అద్భుత సౌందర్యాన్ని
తనివితీరా ఆస్వాదిస్తూ కశ్మీర్లో సంచరించాను. ఆ మైకం నా మనసంతా ఆవహించింది.
కశ్మీర్ ఒక అతిలోక సుందరిలా వుంది. మానవాతీతంగా, మనిషి ఊహలకు అందని అందాలను కలిగివుంది. ఆ నదులూ, ఆ కొండలూ, కోనలూ, సరస్సూ ముగ్ధమనోహరమైన వృక్షాలూ అన్నింటిలోనూ స్త్రీ సౌందర్యం
దోబూచులాడుతోంది. ఆ ప్రేమపూర్వకమైన సౌందర్యం నన్ను వివశుణ్ని చేసింది. నేను దాదాపు
మూర్ఛిల్లిపోయాను''
అంటూ
అభివర్ణించారు. ''కశ్మీర్ మళ్లీ పిలుస్తోంది.
మునుపటి కంటే బలంగా నన్ను తనవైపు లాగుతోంది. వీనుల విందు చేసే ఆ చిరునవ్వుల చిరుసవ్వడి, ఆ జ్ఞాపకాలు నా మనసును వివశం చేస్తున్నాయి. ఒక్కసారి తన వశీకరణకు
గురైతే ఎవరైనా ఆ మోహం నుంచి ఎలా బయటపడగలరు?''
రెండో ప్రపంచ
యుద్ధం తర్వాత బ్రిటిష్ వ్యూహకర్తలలాగే కాంగ్రెస్ పార్టీ కూడా కశ్మీర్‌ను మధ్య
ఆసియా మార్గాలను నియంత్రించగల వ్యూహాత్మక రక్షణ ప్రదేశంగా భావించింది. అన్నింటికి
మించి సైద్ధాంతికంగా దేశ ప్రతిష్టను పెంచే ప్రాంతమది. భారతదేశానికి కశ్మీర్
దక్కితే మొదటినుంచీ చెప్పుకుంటున్నట్టు తమది లౌకిక (సెక్యులర్) రాజ్యమనీ, హిందూ రాష్ట్రాలతో పాటు ముస్లిం రాష్ట్రం
కూడా తమతో
సహజీవనం చేయగలదనీ, భారత ఉపఖండాన్నినిట్టనిలువునా
చీల్చిన పాకిస్థాన్ మాదిరిగా భారతదేశం ఏకపక్ష రాజ్యం కాదనీ చాటుకునేందుకు
వీలవుతుంది.
నెహూృ కైతే
కశ్మీర్ 'మరీ వ్యక్తిగత ప్రాధాన్యత' వున్న వ్యవహారంగా మారిపోయింది. ఆయన తన మనసులోని భావాలను ఏమాత్రం
దాచుకోకుండా లార్డ్ మౌంట్బాటెన్కు చెప్పుకున్నారు. కశ్మీర్ తనకు అన్నింటికంటే
ముఖ్యమైనదని వల్లభ్‌భాయ్ పటేల్ ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాదు మౌంట్
బాటెన్ సతీమణి ఎడ్వినాతో ''నా మీద కశ్మీర్ విపరీతమైన ప్రభావం
చూపుతోందనీ, ఒకోసారి అది సంగీతంలా, ప్రియురాలి సాంగత్యంలా అనుభూతిని కలిగిస్తోందనీ' చెప్పుకున్నారు. చిన్నపిల్లాడిలా ''నాకు కశ్మీర్ కావాలి'' అంటూ మారాం చేశారు.
ఆయన జూన్‌లో
లార్డ్ మౌంట్బాటెన్కు సమర్పించిన ఒక మెమొరాండమ్‌లో 'దేశ విభజన సమయంలోనే కశ్మీర్ భారతదేశానికి చెందడం అత్యంత సహజమైన
రీతిలో కచ్చితంగా జరిగిపోవాలనీ, పాకిస్తాన్
గొడవపడుతుందేమో నని భావించడం అర్థరహితమనీ వివరించారు'.
కశ్మీర్ గొడవ
దానికదేగా రూపుదిద్దుకుంది. పంజాబ్ విభజనపై పెల్లుబికిన మతహింస జమ్మూకు
వ్యాపించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. దోగ్రాలు జమ్మూ నుంచి ముస్లింలను తరిమివేయడం
మొదలుపెట్టారు. దాంతో పశ్చిమ సరిహద్దు ప్రాంతమైన పూంఛ్‌లో హిందూరాజు పాలనకు
వ్యతిరేకంగా ఒక్కసారిగా పూర్తి స్థాయి ముస్లిం తిరుగుబాటు చెలరేగింది.
భారత ఆయుధాలను
భద్రపరిచిన కశ్మీర్‌లోయ ప్రాంతానికి పటియాలా నుంచి ఒక సాయుధ దళం వచ్చింది.
పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ముస్లింలను ఊచకోత కోస్తున్నారనే వార్త
గుప్పుమనడంతో పాకిస్థాన్ నుంచీ వాయవ్య సరిహద్దు ప్రాంతం నుంచీ పఠాన్ తెగకు
చెందినవాళ్లు సంప్రదాయిక ఆయుధాలతో అడ్డొచ్చిన వాళ్ల మీద దాడి చేస్తూ శ్రీనగర్
వైపు దూసుకువచ్చారు. కశ్మీర్ రాజు జమ్మూకు పారిపోయారు.
పఠాన్ పోరాట
యోధులు శ్రీనగర్ పొలిమేర వరకూ చేరుకోవడంతో కశ్మీర్‌ను దక్కించుకోవడానికి భారతదేశం
ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. దిల్లీ వెంటనే రంగంలోకి
దిగింది.
అప్పుడు స్వతంత్ర భారతదేశానికి ఇంకా లార్డ్ మౌంట్‌బాటెనే గవర్నర్ జనరల్‌గా వున్నారు. అటు పాకిస్థాన్‌లో మాదిరిగానే ఇటు భారతదేశంలో కూడా సైన్యం అంతా ఇంకా బ్రిటిష్ అధికారుల నియంత్రణలోనే వుంది. నెహూృకు కశ్మీర్ అంటే ఎంత ప్రాణమో మౌంట్బాటెన్కు మొదటినుంచీ తెలుసు.
దేశ విభజన
సరిహద్దులను నిర్ణయించేందుకు లండన్ నుంచి రాడ్‌క్లిఫ్ భారతదేశానికి రావడానికి 9 రోజుల ముందు మౌంట్‌బాటెన్ గురుదాస్‌పూర్ జిల్లాను భారతదేశానికి
కేటాయించేలా మేనన్ చేత ఒక నోటును తయారుచేయించారు.
భారతదేశం నుంచి
కశ్మీర్ చేరుకోవాలంటే గురుదాస్‌పూర్ జిల్లా నుండి వెళ్లే రోడ్డు మార్గమే గతి.
ముస్లింలు అత్యదిక సంఖ్యలో వుండే ప్రాంతమైనప్పటికీ ఆ జిల్లాను రాడ్‌క్లిఫ్ చేత
భారతదేశానికి కేటాయింప జేశారు. మౌంట్‌బాటెన్ ఏవైపు మొగ్గుచూపాడన్న విషయంలో
సందిగ్థతే లేదు.
అయితే, కశ్మీర్లో సైనిక జోక్యం చేసుకోవాలంటే న్యాయపరమైన ఏదో ఒక కారణం కావాలి. అక్టోబర్ 26న ఆ సాకును మేనన్ సమకూర్చారు. భారత యూనియన్‌లో చేరుతున్నానని కశ్మీర్ మహరాజు ప్రకటించినట్టుగా రాజుగారి దొంగ సంతకంతో ఆయన ఒక పత్రాన్ని సృష్టించారు. దానిని అప్పుడే శ్రీనగర్ నుంచి తెచ్చినట్టు బుకాయించారు. నిజానికి ఆ సమయంలో మేనన్ దిల్లీలోనే వున్నారు.
మొత్తం కశ్మీర్
మీద భారతదేశానికి హక్కును ప్రసాదించిన ఆ పత్రాన్ని యాభై ఏళ్ల వరకూ ప్రపంచానికి
చూపించలేదు.
వాస్తవానికి
ఆనాడు కశ్మీర్ మహారాజు దిల్లీని ధిక్కరించే స్థితిలో లేడు. ఎక్కడ సంతకం పెట్టమంటే
అక్కడ పెట్టే స్థితిలో వున్నాడు. కానీ పఠాన్ల దాడికి శ్రీనగర్ ఎక్కడ పతనమవుతుందో
నన్న భయంతో దిల్లీ వేచివుండలేకపోయింది. (అలెస్టర్ లాంబ్, 'ఇన్‌కంప్లీట్ పార్టిషన్').
వల్లభ్ భాయ్
పటేల్ శ్రీనగర్‌కు వాయుమార్గంలో సైనిక బలగాలను తరలించారు. బ్రిటిష్ కమాండర్ల
నేతృత్శలో ఆ మొత్తం వ్యవహారాన్ని లార్డ్ మౌంట్‌బాటెనే పర్యవేక్షించారు. భారతదేశం
సత్వరమే కశ్మీర్లో చాలా భాగాన్ని స్వాధీనం చేసుకుంది.
జిన్నా కొంత
ఆలస్యంగా మేల్కొని పాకిస్థాన్ సైన్యాన్ని కశ్మీర్‌కు పంపించి ప్రతిఘటించాలని
ప్రయత్నించినప్పుడు దిల్లీ కమాండర్ ఇన్ చీఫ్ హుటాహుటిన కరాచీకి వెళ్లి అక్కడి
తన సహచర కమాండ్‌ర్ ఇన్ చీఫ్ మెసర్వీని కలసి భారతదేశానికి చట్టబద్ధంగా దక్కిన
కశ్మీర్‌పై పాకిస్తాన్ గనక
దాడికి పూనుకుంటే
బ్రిటిష్ సైనికాధికారులంతా వెంటనే తమ పదవులకు రాజినామా చేస్తారని, అప్పుడు మొత్తం పాకిస్థాన్ సైన్యమే పనికిరాకుండా పోతుందనీ
హెచ్చరించారు.
దాంతో జిన్నా
వెనక్కి తగ్గాడు.
ఆవిధంగా బ్రిటిష్
ప్రభుత్వం కశ్మీర్‌ను పళ్లెంలో పెట్టి మరీ భారతదేశానికి అందించింది.
.... .... ....
The Indian Ideology, Perry
Anderson
"ఇండియాలో దాగిన
హిందుస్థాన్", పెరీ ఆండర్సన్,
తెలుగు అనువాదం : ప్రభాకర్ మందార
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, సెప్టెంబర్ 2014
www.hyderabadbooktrust.com