Saturday, July 18, 2020

‘‘పతా హీ నహీ చలా’’ హిందీ మూలం : అమిర్‌ కిర్మాణి




‘‘పతా హీ నహీ చలా’’
హిందీ మూలం  : అమిర్‌ కిర్మాణి
................
‘‘తెలియనేలేదు!’’
కాలం గడచిపోయింది కానీ
ఎలా గడిచిపోయిందో తెలియనే లేదు.

ఒడిదొడుకుల  జీవితంలో
ముదిమి వయసు ఎప్పుడొచ్చిందో  తెలియనేలేదు

నా భుజాల  మీద ఎక్కి ఆడుకునే నా పిల్లలు
వాళ్ల భుజాల  మీద నేను ఆనుకునేంతగా ఎప్పుడు ఎదిగిపోయారో
తెలియనే లేదు.

ఒంటి గదిలో మొదలైన నా జీవన యానం
విశాలమైన ఇంటిలోకి ఎప్పుడు మారిపోయిందో తెలియనేలేదు.

సైకిల్‌ పెడల్‌ను తొక్కే నేను స్కూటర్‌ మీదికి,
కారు లోపలికి ఎలా వచ్చానో తెలియనే లేదు.

పచ్చని చెట్లతో కళకళలాడిన మా నివాస పరిసరాలు
కాంక్రీట్‌ జంగిల్‌గా ఎప్పుడు మారిపోయిందో తెలియనేలేదు.

పిల్లల ఆలనా పాలనా  చూసే తల్లిదండ్రులుగా వున్న మేం
ఆ  పిల్లల  ఆలన లోకి ఎప్పుడు వచ్చామో తెలియనే లేదు.

ఒకప్పుడు కావాలంటే పగలు  కూడా నిద్రపట్టేది
అలాంటిది రాత్రి నిద్ర ఎప్పుడు దూరమయిందో తెలియనేలేదు.

తల్లిదండ్రులం  కావాలని కలలు కన్న కాలాన్ని అటుంచితే
మా పిల్లలకు పిల్లలు ఎప్పుడు పుట్టారో తెలియనేలేదు.

ఒకప్పుడు నల్లగా నిగనిగలాడుతుండిన వెంట్రుకల్లోకి
తెలుపు రంగు ఎలా వచ్చి చేరిందో తెలియనే లేదు.

దీపావళి, హోలీలప్పుడు బంధు మిత్రులతో కేరింతలు  కొట్టేవాళ్లం
ఆ ప్రేమలను ఈ వర్తమాన కాలం  ఎప్పుడు మింగేసిందో తెలియనే లేదు.

ఉద్యోగం చేసే రోజుల్లో ఎంత ఆరాటముండేదో
అలాంటిది రిటైర్‌ అయ్యే రోజు ఎప్పుడొచ్చిపడిందో తెలియనేలేదు.

పిల్లల కోసం సంపాదించడం, పొదుపు చేయడంతో తలమున్కయ్యేవాళ్లం
అలాంటిది దూర తీరాలకు పిల్లలు ఎప్పుడెగిరిపోయారో తెలియనేలేదు.

ఆనాడు ఉమ్మడి కుటుంబాన్ని చూసి గర్వంగా ఉప్పొంగి పోయేవాళ్లం
ఇద్దరికే పరిమితమైన ఈనాటి కుటుంబం ఎప్పుడొచ్చిందో తెలియనేలేదు.

................................................

(రేపు నా 70వ పుట్టిన రోజు. విచిత్రంగా ఇవాళే ఈ కవితను ‘వాట్స్‌ఆప్‌’లో చూశాను. ఒక్కసారిగా మనసులో
ఏదో అలజడి. ఇందులో చాలా చరణాలు  వ్యక్తిగతంగా నాకు వర్తిస్తాయి. ఇది నేను కొన్నాళ్లుగా రాద్దామనుకుని
రాయలేకపోయిన కవిత అనిపించింది.
అందుకే హిందీ పెద్దగా రాకపోయినా తెలుగులోకి అనువదించకుండా వుండలేకపోయాను. కవి ‘అమీర్‌ కిర్మాణి' గారి
అనుమతి లేకుండా అనువదించినందుకు క్షంతవ్యుణ్ని. ఈ అనువాదం కేవం నా ఫేస్‌బుక్‌ వాల్‌ కే పరిమితం. దీనిని
మరెక్కడా ఉపయోగించను. ఈ లోగా ప్రముఖ
హిందీ`తెలుగు అనువాదకులు ఎవరైనా ఈ కవితను అనువదిస్తే (లేదా ఇప్పటికే అనువదించి వుంటే) దయచేసి
తెలియజేయండి. దీని స్థానంలో ఆ అనువాదాన్ని పొందుపరుస్తాను. ధన్యవాదాలు. ).
హిందీ ఒరిజినల్‌ కవితను ఈ కింది ఆడియోలో వినవచ్చు:
సారీ ఆడియో అప్లోడ్ కావడం లేదు.
18-07-2020