Saturday, January 4, 2020

*నేను ఈ దేశపు పౌరుడినేనా?*

ఇటీవలి పౌరసత్వ చట్టం పై జనవరి 3 నాటి సాక్షి దిన పత్రికలో ప్రచురించ బడిన బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌ శ్రీ మాడభూషి శ్రీధర్‌ వ్యాసం . 



*నేను ఈ దేశపు పౌరుడినేనా?*




*‘‘ఏ వ్యక్తికీ పౌరసత్వం ఆటోమేటిక్‌గా దొరకదు, ప్రతి వ్యక్తీ తనకు పౌరుడిగా ఉండే అర్హతలున్నా యని రుజువు చేసుకోవలసిందే’’*
– ఈ మాట నేను చెప్పడం లేదు, హోం శాఖ ప్రకటించింది.
ప్రతి పౌరుడు తనను తాను పౌరుడని రుజువు చేసుకోవలసిన దుస్థితి. ఎందుకొచ్చింది?
నన్ను ఓటు అడిగి, నా వంటి వారి ఓటుతో గెలిచి నన్ను పౌరుడిగా రుజువు చేసుకొమ్మంటారా అని లక్షలమంది పౌరులు అడుగుతున్నారు.
పౌరసత్వచట్టం, దాని సవరణ చట్టం 2019 జాతీయ పౌర పట్టిక, జాతీయ ప్రజాపట్టిక వంటి శాసనాల అమలు ప్రభావం గురించి ఆలోచించ వలసి ఉంది.
జనాభా లెక్కల్లో మిమ్మల్ని లెక్కిస్తే మీరు ఈ దేశ ప్రజ అవుతారే గాని, ఈ దేశ పౌరుడు కాదు. జాతీయ ప్రజా పట్టికలో మీ పేరు నమోదు చేస్తే మీరు జనంలో ఒకరవుతారు కాని పౌరుడని గుర్తించినట్టు కాదు.
మీరు ఆధార్‌ కార్డు చూపితే మీకు ఆధార్‌ ఉన్నట్టే అవుతుంది కాని అది పౌరసత్వానికి రుజువు కాదు.
మీకు ఓటరు కార్డు ఉందా, ఉంటే ఓటేయొచ్చు కానీ, మీరు పౌరుడని దేశం ఒప్పుకోదు.
మీకు పాస్‌ పోర్టు ఉన్నా అది పౌరసత్వానికి రుజువులు కావు.
ఈ మాటలు సాక్షాత్తూ హోం మంత్రి అమిత్‌ షా చెప్తున్నారు.‘
‘ఏది పౌరసత్వానికి రుజువో ఇప్పుడే చెప్పలేము. నియమాలు తయారు చేస్తున్నారు. అప్పుడు ఏ పత్రాలతో పౌరసత్వం రుజువుచేసుకోవాలో వివరిస్తాం. ఇప్పటికి అధికారికంగా చెప్పేదేమంటే ఆధార్‌ కార్డు, ఓటర్‌ కార్డు, పాస్‌పోర్ట్‌లు ఉన్నంత మాత్రాన పౌరసత్వానికి రుజువు కాబోవు’’ అని డిసెంబర్‌ 21న కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేంద్ర హోం శాఖ అధికార ప్రతినిధి చెప్పిందేమంటే జన్మించిన స్థలం లేదా తేదీ లేదా రెండూ ఇవ్వడం ద్వారా పౌరసత్వం రుజువుచేసుకోవలసి ఉంటుందని.
ఏ పత్రాలు లేని వారు నిరక్షరాస్యులు తన స్థానికతను రుజువు చేసుకోవడానికి ఎవరయినా వ్యక్తిగత సాక్షులను తెచ్చుకోవచ్చునని వివరించారు. కానీ.. జన్మస్థలం, పుట్టిన తేదీకి సంబంధించి వ్యక్తిగత సాక్షులు ఎవరుంటారు? వారిని నమ్మను పొమ్మంటే గతేమిటి? పౌరసత్వ చట్టం సవరణ 2019 కింద పూర్తి ప్రక్రియ వివరాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ న్యాయశాఖతో సంప్రదించి త్వరలో రూపొందిస్తుందని హోం శాఖ ప్రతినిధి వివరించారు.
దీని తరువాత ‘‘ఏ వ్యక్తికీ పౌరసత్వం ఆటోమేటిక్‌గా దొరకదు, ప్రతి వ్యక్తీ తనకు పౌరుడిగా ఉండే అర్హతలున్నాయని రుజువు చేసుకోవలసిందే’’ అని అధికారికంగా ప్రకటించారు.
అంటే ఫలానా వ్యక్తి పౌరుడు కాడని రుజువు చేసే బాధ్యత ప్రభుత్వం తనపై ఉంచుకోలేదు.
తాను పౌరుడినని రుజువు చేసుకోవలసిన బాధ్యత భారం పౌరుడిదే.
ఒకవేళ పౌరుడినని రుజువు చేసుకోలేకపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
ఆ వ్యక్తి విదేశీయుడైపోతాడు. విదేశీయుల ట్రిబ్యునల్‌ కూడా విదేశీయుడే అని తేల్చితే వాడి గతి దారుణం.
డిటెన్షన్‌ సెంటర్లో ఉండిపోవాలి.
హైకోర్టులో ఈ నిర్ణయాన్ని సవాలు చేయవచ్చు.
ఎన్నేళ్లలో హైకోర్టు తీర్పు చెబుతుందో, దానికి ఎంత ఖర్చవుతుందో, ఆ ఖర్చు పెట్టుకోలేని వారి గతి ఏమవుతుందో చెప్పలేము.
ఇవి పుకార్లు కావు, అనుమానాలు కావు. ప్రభుత్వ అధికారిక ప్రకటనల పరిణామాలు.
ఈ ప్రశ్నలకు ఆధారం ఏమంటే అస్సాంలో 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగించిన పౌరసత్వ నమోదు ప్రక్రియ అనుభవంలో ఎదురైన సవాళ్లు.
19 లక్షల పై చిలుకు ప్రజలు పౌరులు కాదని అస్సాం తుది పౌర జాబితా తేల్చివేసింది.
అస్సాంలో ఒక్క డిటెన్షన్‌ సెంటర్‌ కోసం 46 కోట్ల రూపాయలు వెచ్చించింది.
పౌరులని రుజువు చేసుకోలేక విదేశీయులని ముద్రపడిన మూడు వేలమందికి అందులో స్థలం దొరుకుతుంది.
19 లక్షల మంది అస్సామీయులను పౌరులు కాదని తేల్చిన నేపథ్యంలో వారందరికీ డిటెన్షన్‌ సెంటర్లలో వసతి కల్పించాలంటే 27 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా.
అందుకు సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం.
అస్సాంలో నిరసన జ్వాలలు ఎగసిపోతుంటే నిరంకుశంగా అణచి వేస్తున్నది.
బీజేపీ సీనియర్‌ నాయకులు పార్టీ వదిలిపోతున్నా పట్టించుకోవడం లేదు.
ఎట్టి పరిస్థితిలో అస్సాంలోనూ దేశవ్యాప్తంగానూ జాతీయ పౌరసత్వ పట్టిక తయారు చేయాలని పట్టుబట్టింది కేంద్రం.
వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్‌, బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com
*సాక్షి దినపత్రిక నుండి