Saturday, July 20, 2019

తెలుగులో 'దళిత్‌ పాంథర్స్‌' చరిత్ర


తెలుగులో 'దళిత్‌ పాంథర్స్‌' చరిత్ర



మొన్న జులై 16న ముంబయిలో మరణించిన రాజా దాలే (78) దళిత్‌ పాంథర్స్‌ వ్యవస్థాపకులైన ముగ్గురిలో ఒకరు. మిగతా ఇద్దరు నామ్‌దేవ్‌ దసాల్‌, జె.వి.పవార్‌లు. రాజా దాలే అద్భుతమైన వక్త. ఆయన ప్రసంగాలు దళిత యువతను ఉర్రూతలూగించేవి.

దళితులపై జరుగుతున్న అత్యాచారాలను చూసి సహించలేక వాటిని అరికట్టేందుకు మిలిటెంట్‌ పోరాటాలు అనివార్యంగా భావించి వాళ్లు నడుంబిగించారు. అమెరికాలోని ఆఫ్రో అమెరికన్ల 'బ్లాక్‌ పాంథర్స్‌' సంస్థ ప్రేరణతో తమ సంస్థకు దళిత్‌ పాంథర్స్‌ అని పేరు పెట్టుకున్నారు. దళిత్‌ పాంథర్స్‌ సంస్థ ఉనికిలో వున్నది ఐదేళ్లే (1972-77). అందులోనూ చురుకుగా పనిచేసింది కేవలం మూడేళ్లే. 1975లో ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించిన కారణంగా చివరి రెండేళ్లూ తీవ్ర నిర్బంధాలకు గురికావలసి వచ్చింది.

ఆ మూడేళ్ల కాలం లోనే  దళిత్‌ పాంథర్స్‌ ముంబయినీ, మహరాష్ట్రనీ ఒక ఊపు ఊపింది. దళిత సమస్యపై యావద్దేశం దృష్టి సారించేట్టు చేసింది. సామాజిక, రాజకీయ రంగాలలో తనదైన ప్రభావాన్ని చూపింది. దళిత యువతలో పోరాట స్ఫూర్తిని నింపింది. దళిత్‌ పాంథర్స్‌ రద్దయిపోయి ముఫ్పై నాలుగేళ్లు గడచినా ఈనాటికీ అది  చేసిన వీరోచిత పోరాటాలు, సాధించిన విజయాలు, రచనలు ఎందరికో ఉత్తేజాన్ని ఇస్తూనే వున్నాయి.
సంస్థ నిర్మాతల్లో ఒకరైన జె.వి.పవార్‌ రాసిన ''దళిత్‌ పాంథర్స్‌ - ఏన్‌ అథారిటేటివ్‌ హిస్టరీ'' అన్న పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ త్వరలో తెలుగులో వెలువరించనుంది. ఈ సందర్భంగా పుస్తక రచయిత రాసిన ముందుమాట నుంచి కొన్ని భాగాలు మీకోసం.


... ... ...

డా.బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మరణించిన తరువాత అంబేడ్కరిస్ట్‌ ఉద్యమంలో  స్వర్ణ యుగం వంటిది ఏదైనా వుందంటే అది దళిత్‌ పాంథర్స్‌కే చెందుతుంది. ఈ మిలిటెంట్‌ సంస్థ 1972 మే 29న ఏర్పడింది. ఐదు సంవత్సరాల అనంతరం 1977 మార్చి 7న ముంబయిలో నిర్వాహకులు చేసిన ఒక పత్రికా ప్రకటనతో దళిత్ పాంథర్స్ రద్దు అయిపోయింది.. 

అంతకుముందు నాయకుల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విభేదాల కారణంగా రాజా దాలేను , జె.వి. పవార్‌ను సంస్థనుంచి బహిష్కరిస్తున్నట్టు నామ్‌దేవ్‌ దసాల్‌ 1974 సెప్టెంబర్‌ 30న ముంబయిలో ఒక ప్రకటన విడుదల చేశారు. అది రాజుకుని 1974 అక్టోబర్‌ 23, 24 తేదీల్లో నాగపూర్‌లో జరిగిన దళిత్‌ పాంథర్స్‌ తొలి సదస్సులో నామ్‌దేవ్‌ దశాల్‌నే సంస్థ నుంచి బహిష్కరిస్తున్నట్టు తీర్మానం చేసే వరకు వెళ్లింది.

ఆ తదనంతరం 1975 జూన్‌లో ఆనాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశవ్యాప్తంగా ఆత్యయిక పరిస్థితిని విధించారు. వార్తా పత్రికల మీదా, ప్రజా సంస్థల మీదా తీవ్రమైన ఆంక్షలు అమలుయ్యాయి. అందువల్ల దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమంలో 1972 మే- 1975 జూన్‌ మధ్యకాలమే అత్యంత కీలకమైనదని చెప్పవచ్చు.

ఈ కాలంలో దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం ఒక తుఫాన్‌ను సృష్టించింది. సమకాలీన సామాజిక, రాజకీయ రంగాలను ఒక కుదుపు కుదిపింది. దళితులపై రోజురోజుకూ పెరిగిపోతున్న అన్యాయాలను, అత్యాచారాలను దీటుగా ఎదుర్కొనేవిధంగా అంబేడ్కర్‌ అనుచరులకు నూతనోత్తేజాన్ని అందించింది. నిబద్ధత తో వీధుల్లోకి వచ్చిన యువతీయువకులను వ్యవస్థను ఎదిరించే వీర సైనికుల్లా తీర్చిదిద్దింది. బాధితులకు చేయూతనిచ్చింది.
దళిత్‌ పాంథర్స్‌ మనుగడ సాగించింది కొద్దికాలమే అయినా మొద్దు నిద్ర పోతున్న వ్యవస్థను తట్టిలేపి అణగారిన వర్గాలపై దృష్టిని సారించేట్టు చేసింది. దళిత్‌ పాంథర్స్‌ లక్ష్యం కేవలం దళితుల ఆర్థికాభ్యున్నతి మాత్రమే కాదు, వారికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు సక్రమంగా అమలు జరిగేలా, సమాజంలో వారికి స్వేచ్ఛా సమానత్వం, సౌభ్రాతృత్వం దక్కేలా చేయడం కూడా.
... ... ...

1956 డిసెంబర్‌ 6న అంబేడ్కర్‌ చనిపోయిన తరువాత అంబేడ్కరిస్ట్‌ ఉద్యమం ఇటు విజయాలనూ అటు అపజయాలనూ రెండింటినీ చవిచూసింది. ఉద్యమ విజయాల విషయానికి వస్తే దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం చెప్పుకోతగ్గది. ఈ ఉద్యమకాలంలో సామాజికంగా, విద్యాపరంగా, సాంస్కృతిక పరంగా ఎంతో పరిపక్వతను సాధించడం జరిగింది. సాహిత్య, కళా రంగాలలో ఉద్యమం శిఖరాగ్రాలకు చేరుకుంది. ముఖ్యంగా ఆనాటి అంబేడ్కరిస్ట్‌ సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇవాళ కూడా ఆ సాహిత్యానికి ఎంతో గౌరవం, ఆమోదం లభిస్తున్నాయి. వాస్తవికతపై ఆధారపడి రూపుదిద్దుకున్నది కాబట్టే ఆ సాహిత్యానికి అంతటి ప్రాముఖ్యత వుంది. నిన్నమొన్నటి వరకూ ఆ రచనలను దళిత సాహిత్యంగా పరిగణించిన వాళ్లు ఇవాళ అంబేడ్కరిస్ట్‌ సాహిత్యంగా గౌరవిస్తున్నారు. అంబేడ్కర్‌కు ముందరి పరిస్థితులకూ ఈనాటి సామాజిక పరిస్థితులకూ మధ్య ఎంతో తేడా వుంది. 'చదువు, సంఘటితమవు, పోరాడు' అంటూ డా. అంబేడ్కర్‌ ఇచ్చిన గొప్ప పిలుపే ఇందుకు మూలకారణం.
... ... ...

నాటి పోరాటకాలంలో అనేక కష్ట నష్టాలకు గురైన దళిత పాంథర్లు సమాజంలో విశ్వసనీయతనూ, గౌరవాన్ని సంపాదించుకున్నారు. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌.పి.ఐ.)కి డా.అంబేడ్కర్‌ నిర్దేశించిన లక్ష్యాలను ఆ పార్టీ సాధించలేకపోయింది. ఆ పార్టీ నాయకుల స్వార్థం, స్వప్రయోజనాల మూలంగా 1960లలో అంబేడ్కర్‌ అనంతర ఉద్యమం బలహీనపడటం మొదలయింది.

ఆ నాయకులు రిపబ్లికన్‌ పార్టీ ఎదుగుదల మీద కాకుండా కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడం మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరించారు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ మరింత అహంకారపూరిత, దోపిడీ పార్టీగా తయారైంది. గ్రామీణ ప్రాంతాల్లో దళితులపై జరిగే అత్యాచారాలను రూపుమాపేందుకు దళిత్‌ పాంథర్స్‌ చిత్తశుద్ధితో కృషిచేసింది. తమను కాపాడేందుకు ఒక సంస్థ, ఒక బృందం వున్నాయన్న స్పృహను అది దళితులలో పెంపొందిచగలిగింది. ఇప్పటికీ గ్రామాల్లో దళితుల మీద అత్యాచారాలు జరిగినప్పుడు జనం దళిత్‌ పాంథర్స్‌ వంటి ఉద్యమ సంస్థ వుంటే ఎంత బాగుండేదో అని తలచుకోవడం కనిపిస్తుంది.

దీనినిబట్టి దళిత్‌ పాంథర్స్‌కు దళిత ప్రజల్లో ఎంత గుర్తింపు, అభిమానం వున్నాయో అర్థం చేసుకోవచ్చు. దళిత్‌ పాంథర్స్‌ ఉద్యమం మహరాష్ట్ర నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నప్పుడు కూడా అది ఏనాడూ పలచబడలేదు. సామాజిక శాస్త్రవేత్తలు దళిత్‌ పాంథర్స్‌ ప్రాముఖ్యతను గుర్తించారు. ఇంకా ఈనాటికీ దేశ విదేశాల్లో దళిత్‌ పాంథర్ల చరిత్రను విశ్లేషించడం జరుగుతూనే వుంది. దళిత్‌ పాంథర్ల చరిత్రను చదివి పరిశోధకులు, విద్యార్థులు ఎంతగానో ఉత్తేజం పొందుతుంటారు. దళిత్‌ పాంథర్ల మిలిటెంట్‌ క్రియాశీలతను ఇవాళ తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

-జే.వీ. పవార్