ఈ రోజు (19-10-2015) నమస్తే తెలంగాణా (జిందగీ పేజీ)లో ప్రచురించబడ్డ నా
చిన్ననాటి బతుకమ్మ పండుగ జ్ఞాపకం :
అంటరాని బతుకమ్మ!
నలభైఐదేళ్ల కిందట వరంగల్లుల జరిగిన ముచ్చట. గారోజు సూర్యుని
కంటె ముందుగాలనే లేసి దోస్తులతోని కట్టమల్లన్న దాన్క పోయి సంచెడు తంగేడు పూలు
తెంపుకొచ్చినం. కొన్ని గునుగు పూలను ఇంటిముందటికి అమ్మొస్తె మా అమ్మ కొన్నది.
ఒక్కొక్క కట్టని ఒక్కొక్క రంగునీళ్లల్ల ముంచి ఆరబెట్టింది. వంటపని అయిపోయినంక
పగటీలి బతుకమ్మను పేరుస్తది.
ఇంతల మా తమ్ముడు సుధాకర్ ఏం తిన్నడో ఏమోగని
కడుపునొస్తాందని ఒకటే తల్లడిల్లబట్టిండు. ఇంట్ల నాయిన లేడు. నేను మా అమ్మ కలిసి
వాణ్ని లక్ష్మి టాకీస్ దగ్గరున్న అమ్జద్ అలీ దవఖానకు తీసుకపోయినం. తిరిగి వచ్చెవరకు
చీకటి పడ్డది. మిల్‌కాలనీల మా గ్రూపు నుంచి బతుకమ్మ ఆడటానికి పోయినోళ్లంత అప్పటికే
వాపస్ వచ్చిండ్లు.
ఇయ్యాల మనకు బతుకమ్మ లేదుర అనుకుంట బాధపడ్డది అమ్మ. కని
ఇంటికొచ్చి సూస్తె ఏమున్నది మా చెల్లె సుగుణ రెండు సిబ్బిలల్ల రెండు బతుకమ్మలను
పేర్చి, కొత్త బట్టలు కట్టుకొని
ముద్దుగ తయారై మాకోసం ఎదురుసూసుకుంట కూసునున్నది.
''ఎవరు పేర్శిండ్లే గీ బతుకమ్మలను, ఎవరన్నొచ్చిండ్లా మన ఇంటికి?'' ఇచిత్రపడుతూ అడిగింది మా అమ్మ.
''ఎవ్వరు రాలే. నేనే పేర్చిన. బాగున్నయామ్మా?''
మా చెల్లె రెండు చెంపలను నిమిరి మెటికలు ఇరిసి ''నా కంటె మంచిగ పేర్చినవు బిడ్డా'' అని తెగ సంబురపడ్డది అమ్మ. అప్పుడు మా చెల్లె వయసు
తొమ్మిదేండ్లు వుంటుండవచ్చు.
బతుకమ్మలు రెడీగ వుండె వరకు మా అమ్మకు మల్ల హుషారొచ్చింది.
జెప్పున రెండు చెంబులు నీళ్లు పోసుకున్నది. దీపం ముట్టించి, దండం పెట్టుకున్నది. ట్రంకు పెట్టెలోనించి ఇరవై ఏండ్ల
కిందటి పీతాంబురం తీసి కట్టుకున్నది. సుధాకర్‌ను, ఇంకో తమ్ముడు భాస్కర్‌ను ఇంట్లనే వుంచి మా అమ్మ, మా చెల్లె, వాళ్లకు తోడుగ
నేను బతుకమ్మలను పట్టుకోని ఆ చీకట్ల దబాదబా మల్లికుంట చెరువు దిక్కు పరుగుతీసినం.
అప్పుడు గాంధినగర్‌ల వీధిలైట్లెక్కడివి. లాంతర్ల, బుడ్డి దీపాల వెలుగు తప్పితె అంతా చీకటే. గతుకుల రోడ్డు,
తుమ్మ చెట్లు, తుప్పలు అన్ని దాటుకుంట పోయెవరకేమున్నది చెరువు చుట్టు అంత
ఖాళీగ వున్నది. ఎక్కడోళ్లక్కడ బతుకమ్మలాడి ఎల్ల్లిపోయిండ్లు.
అయితె ఇంక రెండు పెద్ద గుంపులు మాత్రం వున్నయి.
పెట్రొమాక్స్‌లైట్లు పెట్టుకోని జోర్దార్‌గా బతుకమ్మ పాటలు పాడుతున్నరు. ఆ ఆడోళ్ల
పట్టు చీరలు లైట్ల వెలుగుల తళతళ మెరిసిపోతున్నయి. ఒక్కొక్కరి ఒంటి మీద కిలోకిలో
బంగారు నగలున్నయి. కొద్దిగ దూరంగ వాళ్లకు తోడొచ్చిన మొగోళ్లు జీపుల పక్కన, మోటరు సైకిళ్ల పక్కన నిలబడి మాట్లాడుకుంటున్నరు.
ఆరోజుల్ల గిర్మాజిపేట, మండిబజార్, బీట్ బజార్,
పోచమ్మమైదాన్, గోపాల్‌సామి గుడి ఎక్కడెక్కడి నుంచో బతుకమ్మ ఆడటానికి
మల్లికుంట చెరువుకు వచ్చెటోళ్లు. ఇప్పుడైతే గా మల్లికుంట చెరువే
మాయమైపోయిందనుకోండ్రి.
ఒక గుంపు దగ్గరకు పోయి ''మావోళ్లంత ఎళ్లిపోయిండ్లు. జెర మా బతుకమ్మలను మీ దగ్గర
పెట్టుకుంటం' అని అడిగింది ఆమ్మ. ''ఏయ్ పో పో'' అని కసురుకున్నరు ఆ ఆడోళ్లు. ఇంకో గుంపు దగ్గరకు పోతే వాళ్లు సుత దగ్గరకు
రానియ్యలేదు. మా అమ్మకు, చెల్లెకు కళ్లల్ల
నీళ్లొచ్చినయి.
చేసేదేంలేక రెండు బతుకమ్మలను చెరువు గట్టుమీద పెట్టి మా అమ్మా,
చెల్లే వాటి పక్కన బిక్కు బిక్కుమనుకుంట
నిలబడ్డరు.
''మనల్ని ఎందుకు రానివ్వడం లేదమ్మా వాళ్లు?''
''వాళ్లు కోమటోళ్లు - మనం సుద్దరోళ్లం (శూద్రులం) గాదుర
కొడుకా, గందుకె రానియ్యలేదు''
అన్నది.
నాకు అంతకు ముందరి సంవత్సరం జరిగి సంఘటన గుర్తుకొచ్చింది.
''పోయిన సారి ఇద్దరు చిన్న పిల్లలు బతుకమ్మలను పట్టుకొని
వస్తే మీరు కూడ గిట్లనే ఆడనియ్యలేదు కదమ్మా. అప్పుడు వాళ్ల తల్లులు మీతోని పెద్ద
కొట్లాట కూడ పెట్టుకున్నరు యాదికున్నదా?''అని అడిగిన.
''ఔ. వాళ్లు మాదిగోళ్లుగద కొడుకా. అందుకే మా గుంపుల
ఆడనియ్యలేదు'' అదేదో మామూలు విషయమే
అన్నట్టు అన్నది అమ్మ.
అని మొక్కుబడికి ఒక బతుకమ్మ పాట అందుకున్నది.
ఆతరువాత బతుకమ్మలను చెరువుల శాస్త్రం ప్రకారం సాగనంపి అందరం
మౌనంగ, డీలాగా ఇంటికి వచ్చినం.
- ప్రభాకర్ మందార
నిన్న (18-10-2015) యాదృచ్చికంగా
ఆదివారం ఆంద్ర జ్యోతిలో
ఆదివారం ఆంద్ర జ్యోతిలో
దాదాపు ఇదే అంశం పై, ఇదే శీర్షికతో (అంటరాని బతుకమ్మ) పి. చిన్నయ్య గారి కథ వచ్చింది.
అలాగే నమస్తే తెలంగాణా ఆదివారం మాగజైన్ బతుకమ్మలో
చందు తులసి గారి "పాలపిట్టల పాట" అనే మరో కథ వచ్చింది.
అలాగే నమస్తే తెలంగాణా ఆదివారం మాగజైన్ బతుకమ్మలో
చందు తులసి గారి "పాలపిట్టల పాట" అనే మరో కథ వచ్చింది.
వాటిలో కూడా ఈ సమస్యను మరింత లోతుగా చిత్రించారు.
వీలయితే వాటిని కూడా తప్పక చదవండి
వీలయితే వాటిని కూడా తప్పక చదవండి