Wednesday, February 4, 2015

కులాలను నిర్మూలించాలంటే ముందు వాటిని అర్థం చేసుకోవాలి!

కులాలను నిర్మూలించాలంటే ముందు వాటిని అర్థం చేసుకోవాలి!
- ఆనంద్‌ తెల్‌తుంబ్డె

(అనురాధ గాంధి "భారతదేశంలో కుల సమస్య" పుస్తకానికి రాసిన ముందుమాట పూర్తి పాఠం)

భారతదేశంలో కులాలు ఒక ఆందోళన కలిగించే వాస్తవం. అయితే కొందరు అవి ఎన్నటికీ పోవని భావిస్తే, మరికొందరు అదొక సమస్యేకాదని అసలు పట్టించుకోరు. తత్ఫలితంగా కులాలు లక్షలాది ప్రజల జీవితాలను సంక్షోభానికి గురిచేస్తూ, పాలకవర్గాల అధికార పునాదులను బలోపేతం చేస్తూ  కొనసాగుతున్నాయి. కుల నిర్మూలనపై దృష్టిని కేంద్రీకరిస్తే వాటిని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కామ్రెడ్‌ అనురాధా గాంధీ రాసిన 'భారతదేశంలో కుల సమస్య' వ్యాసం ఈ కోవలోకే వస్తుంది.

ఈ వ్యాసానికి ప్రాధాన్యత ఇది ప్రాచీన కాలంలోని కులాల మూలాలు మొదలుకుని వర్తమాన కాలంలో కుల నిర్మూలనా కార్యక్రమాల వరకూ సమగ్రంగా విశ్లేషించినందువల్ల మాత్రమే కాదు - దళితులూ ఆదివాసీలతో విప్లవ జీవితాన్ని గడిపిన కామ్రెడ్‌ అనురాధా గాంధీ భారత ప్రజాస్వామిక విప్లవంలో కులాలకు కీలకపాత్ర వుందని గ్రహించి, కుల సమస్యపై విప్లవకారులకు ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని అందించాలన్న ఉద్దేశంతో రాయడం వల్ల లభించింది. మిత్రులమంతా 'అను' అని పిలుచుకునే కామ్రెడ్‌ అనురాధా గాంధీ ఈ సుదీర్ఘమైన వ్యాసాన్ని 1990ల మధ్యలోనే రాశారు. నాతో సహా కొద్దిమంది ఇతర మిత్రులతో ఈ వ్యాసంపై ఆమె అప్పుడే చర్చించారు. ఆ తరువాత తను అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఇంతవరకూ దీనిని ఎందుకు ప్రచురించలేదో మాకు తెలియలేదు. ఆమె చనిపోయిన తరువాత 'అనురాధా గాంధీ మెమొరియల్‌ కమిటీ' వారు ఈ వ్యాసంతో సహా మరికొన్ని ఆమె ఇతర రచనలను వెలుగులోకి తెచ్చారు. నవంబర్‌ 2011లో ఎంపికచేసి ప్రచురించిన ఆమె ఏరిన రచనల సంకలనం 'స్క్రిప్టింగ్‌ ది ఛేంజ్‌' లో ఈ వ్యాసాన్ని పొందుపరిచిన తరువాత - కులాల పట్ల అన్ని రకాల కమ్యూనిస్టుల అవగాహనకు ఇది పూర్తిగా భిన్నమైన విశిష్ట రచన అన్న గుర్తింపును పొందింది. ఎవరికోసం రాశారో ఆ ప్రజలకు చేరేవిధంగా ఈ రచనను తెలుగులో తీసుకురావడం ఆహ్వానించదగ్గ విషయం.

ఒక సామాజిక శాస్త్ర విద్యార్థిగా, ఆ తరువాత ఒక విప్లవ కార్యకర్తగా కామ్రెడ్‌ అనురాధ కులాలపై చేసిన అధ్యయనం ఇందులో సమున్నతంగా ఆవిష్కృతమయింది. కులాల మూలాలకు సంబంధించిన సిద్ధాంతాలూ, చరిత్రలో కులాల అభివృద్ధికి సంబంధించిన ముఖ్యాంశాలూ మొదలుకుని కుల నిర్మూలనకు ఒక ఆచరణాత్మక కార్యాచరణను రూపొందించే వరకూ కుల వ్యవస్థను ఆమె సమగ్రంగా సమీక్షించారు. ఆరంభంలోనే కుల వ్యవస్థను ఒక భావజాలంగా, ఒక సామాజిక విధానంగా గుర్తించి; కుల సమస్య పునాది, ఉపరితల నిర్మాణం గురించి విభిన్న కమ్యూనిస్టు వర్గాలు చర్చించే మూసపద్ధతిని ఆమె అధిగమించడం కనిపిస్తుంది. మార్క్స్‌, ఎంగెల్స్‌లను అనుసరిస్తూ బ్రిటిష్‌ వలసవాద పూర్వ భారత సమాజంలో మూడు విభిన్న దశలను అను గుర్తించారు: అవి 1) ఆదివాసీ అల్పజన పాలన (ఆలిగార్కీ), 2) ప్రాచీన మతతత్వ, రాజ్య యాజమాన్య విధానం. ఇది ప్రత్యేకించి వివిధ ఆదివాసీ వర్గాలు ఒక ఒప్పందంతో ఒక్కటి కావడం ద్వారా, శూద్ర సమూహాలను ఓడించి బానిసలుగా చేసుకోవడం ద్వారా సాగేది. అంటే అర్థశాస్త్ర పద్ధతి. 3)  జాతి ప్రాతిపదికతతో కూడిన భూస్వామ్య లేదా ఎస్టేట్‌ సంపద అంటే భారతీయ తరహా భూస్వామ్య విధానం. కామ్రెడ్‌ అనురాధ తన వాదనను చరిత్రలోని అగాధాల మీదుగా, వర్తమాన కాలంలో కుల వ్యవస్థకు వ్యతిరేకమైన తన శ్రామికవర్గ పార్టీ కార్యాచరణ వరకూ సమర్థవంతంగా విస్తరించారు. నూతన ప్రజాస్వామిక విప్లవ పోరాటం విజయం సాధించడంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగే వర్గ పోరాటం అంతర్భాగమని ఈ వాదన చాటుతుంది. ప్రజాస్వామిక విప్లవం విజయవంతమైన తరువాత మిగిలే కులాల గురించి కూడా ఆమె ప్రస్తావించారు.

ఈ విస్తృత విశ్లేషణలో కులాల మూలాల, పరిణామాల గురించిన తన అవగాహనను పొందుపరిచారు. అయితే అది పాండిత్యపరంగా ఆవిష్కరించే పద్ధతిలో కాకుండా చారిత్రక ఆధారాలతో విశ్లేషిస్తున్న పద్ధతిలో సాగింది. కుల వ్యవస్థ ఏ నేపథ్యంలో ఆవిర్భవించి, అభివృద్ధి చెందిందని సాధారణంగా చర్చిస్తుంటారో ఆ మతపర, సాంస్కృతికపర దృక్పథానికి భిన్నంగా సందర్భోచిత భౌతికవాద దృక్పథంతో ఇది కూడుకుని వుంది. భారతదేశ చరిత్ర అభూతకల్పనలకు గురైనందువల్ల కులం వంటి వ్యవస్థకు భౌతికవాద రూపాన్ని అందించాలంటే కొంత ఊహాజనిత అభ్యాసం తప్పదు. మేధో ప్రపంచం దానిని ఆమోదించకపోవచ్చు కానీ ప్రజలను మార్పునకు సంసిద్ధం చేయడం మన లక్ష్యం అయినప్పుడు ఈ పద్ధతి బాగా పనిచేస్తుంది. అను వ్యాసం ఖచ్చితంగా ఈ మార్పును ఉద్దేశించినదే కాబట్టి తను ఆశించినదానిని అది తప్పకుండా సాధిస్తుందని భావించవచ్చు. భారత కుల వ్యవస్థను భౌతికవాద దృక్పథంతో వివరిస్తున్నప్పుడు సహజంగానే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వుంటుంది. అదేమిటంటే ఇంత సంక్లిష్టమైన కుల వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేకుండా ఒక్క భారతదేశంలోనే ఎందుకు రూపుదిద్దుకుంది అని. అను కూడా ఈ ప్రశ్నను దాటవేసినట్టు అనిపిస్తుంది.

అతి ప్రాచీన సమాజాల్లో వాటి మిగులు ఉత్పత్తి స్థాయికి తగినవిధంగా వున్న విభజనల మాదిరిగానే భారతదేశ కుల వ్యవస్థ కూడా సమాజాన్ని పొరలుపొరలుగా విభజించిందని ఒక్కమాటలో చెప్పవచ్చు. తక్కువ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన చిన్న తరహా సమాజాల్లో ఈ విభజన తక్కువ స్థాయిలో వుంది. సాధారణంగా వయసు, లింగభేదం, రక్తసంబంధాల స్థితిని బట్టి విభజించుకుంటూ ఆ సమాజాలు తమను తాము పునర్వ్యవస్థీకరించుకున్నాయి. భారీ, సంపన్న సమాజాలు తద్విరుద్ధంగా శాశ్వత, సంక్లిష్ట సమూహాలుగా లేదా వర్గాలుగా విభజించబడ్డాయి. భారతదేశం తన సహజసిద్ధమైన ధర్మాదాయంతో ప్రాచీన కాలంలో ఒక సుసంపన్నమైన దేశంగా వుండేది. అందువల్ల అది సంక్లిష్టమైన విభజనను రూపొందించుకుంది. ఆర్థిక చరిత్రకారుడు ఆంగస్‌ మాడిసన్‌ అభిప్రాయం ప్రకారం ( ద వరల్డ్‌ ఎకానమీ: ఎ మిల్లీనియల్‌ పర్‌స్పెక్టివ్‌) ఒకప్పుడు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశం. 17వ శతాబ్ది వరకూ ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఇక్కడ వుంది. అయితే ప్రపంచమంతటా ఉత్పత్తిలో వచ్చిన మార్పులు, ఆధునికత కారణంగా ఇతర వర్గీకరణ వ్యవస్థలన్నీ మటుమాయమైపోయినా భారతదేశంలో కుల వ్యవస్థ మాత్రం తన విధ్వంసక శక్తితో చెక్కుచెదరకుండా అలాగే ఎందుకు ఉండిపోయిందన్నది ప్రశ్న.

సామాజిక శాస్త్రవేత్తలు సంక్లిష్ట సమాజాల్లో స్థూలంగా మూడు రకాల ప్రధాన విభజన విధానాలు వున్నట్టు గుర్తించారు. అవి : 1) కఠినమైన హద్దులూ, పరస్పరం తీవ్రంగా విభేదించుకునే హోదాలు కలిగి, మార్పునకు ఎలాంటి అవకాశాలూ లేని కుల వ్యవస్థలు 2) యూరోపియన్‌ లక్షణాలు కలిగిన అంటే మతాధికారులూ, పెద్ద మనుషులూ, రైతులూ వ్యాపారులూ వృత్తినిపుణులూ వంటి విశాల తరగతికి చెందినవారి మధ్య ప్రత్యేకతలతో కూడిన ఎస్టేట్స్‌ విధానం 3) ఆధునిక సమాజాల్లో సర్వసాధారణమైన వర్గ వ్యవస్థలు. మొదటి రెండు రకాల వ్యవస్థల్లో హోదా అనేది ఆపాదించబడివుంటుంది లేదా అతని పుట్టుకను బట్టి వుంటుంది. కానీ, వర్గ వ్యవస్థలు విచిత్రంగా హోదాను స్వయంగా సాధించుకునేందుకు అనేక అవకాశాలను కల్పిస్తాయి. అసమానాతలతో కూడిన సాధారణ పునరుత్పత్తి విభాగాలకు సంబంధించి ఆర్థిక, సాంస్కృతిక, సంస్థాగత ఒత్తిళ్లు వున్నప్పటికీ వర్గ వ్యవస్థలో సమకాలీనంగా వ్యక్తిగత సామర్థ్యంతో అభివృద్ధి చెందేందుకు ఆదర్శప్రాయమైన అవకాశాలు వుంటాయి.

కుల వ్యవస్థ ఇలాంటి అవకాశాన్ని పూర్తిగా తిరస్కరిస్తుంది. ఒక కులంలో పుట్టిన వ్యక్తికి ఆ కులం వల్ల అన్ని జీవన అవకాశాలు ఘనీభవించుకుపోతాయి. డా.అంబేడ్కర్‌ కులాన్ని ఒక్కమాటలో అద్భుతంగా నిర్వచించారు: ''కులం అన్నివైపులా దారులు మూసుకుపోయిన వర్గం.'' ఈ నిర్వచనం కులానికీ వర్గానికీ మధ్య వున్న తేడానీ పరస్పర సంబంధాన్నీ స్పష్టం చేస్తోంది. సమాజాన్ని కులాల పేరిట వేటికవి ప్రత్యేకంగా వుండే అనేక సమూహాలుగా  విభజించడమే కుల వ్యవస్థ ప్రత్యేకత. ఆ కులాలన్నీ వర్ణంలో హోదా పరంగా శాశ్వత హెచ్చుతగ్గుల దొంతరతో వుంటాయి. ఆ హెచ్చుతగ్గుల దొంతర బృహత్‌ వర్ణ వ్యవస్థలో అంతర్గతమై వుంటుంది. ఒక వ్యక్తి ఏ కులంలో పుడతారో ఆ కులమే అతని లేదా ఆమె సామాజిక హోదాను నిర్ణయించడంతో పాటు వారు ఏ సమూహం పరిధిలో ఏవిధంగా జీవించాలి, పెళ్ళిల్లూ, చావులూ అన్నింటినీ నిర్దేశిస్తుంది. హిందూమత ధర్మం, కర్మ సిద్ధాంతం ద్వారా, మతపరమైన సంప్రదాయాల ద్వారా కూడా కులం నిర్వచించబడుతుంది. గత జన్మలో చేసిన పనులను బట్టి ఈ జన్మలో కులపర హోదా లభిస్తుందనీ, ఈ జన్మలో ధర్మాన్ని పాటస్తే వచ్చే జన్మలో మంచి కులంలో పుడతారనీ కర్మ సిద్ధాంతం ఉద్బోధిస్తుంది. కులం కట్టుబాట్లని ఇక్కడ, ఇప్పుడు కచ్చితంగా పాటింపజేసేందుకు పన్నిన పన్నాగం తప్ప మరొకటి కాదిది. ఒక సిద్ధాంతం ద్వారానైనా, భౌతిక అంశాల ద్వారానైనా భారతదేశానికి మాత్రమే పరిమితమైన ఇలాంటి వ్యవస్థ పలా ఉనికిలోకి వచ్చిందన్నది ప్రశ్న.

కులం లాంటి లక్షణాలు అనేక ఇతర దేశాల్లో కూడా కనిపిస్తాయి. నైజీరియా, దక్షిణ కేమరూన్‌లలో ఇగ్బూ అనే దేశవాళీ మత వ్యవస్థ 'ఓసు' అనే ప్రజలను సజీవ బలిపశువులుగా, సంఘ బహిష్కృతులుగా, అంటరానివాళ్లుగా, సగం మనుషులుగా చూస్తుంది. సెనెగల్‌, గాంబితా, గునియా, సియెర్రా లియోన్‌, లైబిరియా, ఐవరీ కోస్ట్‌, ఘనా, ప్రాచీన మాండెన్‌ మొదలైన దేశాల్లో మరో కుల వ్యవస్థలాంటి వ్యవస్థ వుంది. ఆ వ్యవస్థలో వృత్తులను బట్టి, జాతిసంబంధాలను బట్టి ప్రజల్ని సాంప్రదాయికంగా విభజించారు. వీటికి తోడు సెనెగల్‌లో వోలోఫ్‌, పశ్చిమ ఆఫ్రికాలో ఫులనీ వంటి కుల వ్యవస్థలను పోలిన వ్యవస్థలున్నాయి. వోలోఫ్‌ తెగవారు ప్రధానంగా రక్త సంబంధాల ప్రాతిపదికన కఠినంగా విభజించిన సమాజాల్లో నివసిస్తున్నారు. అక్కడ పరస్పరం తీవ్రంగా విభజించబడిన మూడు కులాలు వున్నాయి. అవి స్వేచ్ఛాజీవులు (గోర్‌ లేదా జాంబుర్‌), బానిసల వంటివారు (జామ్‌), వృత్తిపనివారు (నీనో). ఆ కులాల మధ్య కులాంతర వివాహాలు చాలా అరుదుగా జరుగుతాయి. ఫులానిస్‌లు అనేవారు సంచార ముస్లిం తెగకు చెందినవారు. వీరు ప్రధానంగా ప్రస్తుత బుర్కినో ఫాసో, మాలి, నైగర్‌ దేశాల్లో వున్నారు. ఫులానిస్‌లు కఠినమైన కుల వ్యవస్థకు కట్టుబడివుంటారు. వాళ్లలో హోదా పరంగా పైనుంచి కిందికి వున్న కులాలు గొప్పవాళ్లు, వర్తకులు, చిల్లర వ్యాపారస్తులు, బానిసలు. ఈశాన్య కెన్యా, దక్షిణ ఇథియోపియా దేశాల్లోని బొరానా సమూహాల్లో వర్ణ వ్యవస్థను పోలిన వ్యవస్థ వుంది. అక్కడ బొరానా గుటు (పరిశుద్ధులు) అత్యున్నతమైనవారిగా పరిగణిస్తారు. గబ్రా, సాకుయెలది ఆతరువాత స్థాయి. సాంప్రదాయిక వేటగాళ్లయిన వాట్టాలది అట్టడుగు స్థాయి. వాట్టాలను అవాంఛనీయులుగా, పనికిమాలినవారిగా, జీవితకాల బానిసలుగా చూస్తారు. యెమెన్‌లోని కుల వ్యవస్థలాంటి వ్యవస్థ అల్‌-అఖ్దమ్‌ అనే సామాజిక వర్గాన్ని (అరబిక్‌లో అఖ్దమ్‌ అంటే సేవకులు అని అర్థం) శాశ్వత పారిశుధ్య పనివారిగా, అంటరానివారిగా చూస్తుంది. అల్‌-అఖ్దమ్‌లు 1000 సంవత్సరాలుగా ఇస్లాం మతాన్ని పాటిస్తున్నవారే అయినా వారిని దళితులలాగా చూస్తారు. వాళ్లు కూడా దళితుల మాదిరిగా తమను అల్‌-ముహమషీన్‌లుగా, అట్టడుగువర్గంవారిగా పిలిపించుకోడానికే ఇష్టపడతారు. ఇదేవిధంగా జపాన్‌లో బురకుమిన్‌ అనేవారు వున్నారు. (బురకు అంటే జపాన్‌ భాషలో సమాజం లేదా శివారు ప్రాంతం అని అర్థం; హిసాబెట్సుబురకు అంటే వివక్షకు గురైన సమాజాలు/ శివారు ప్రాంతాలు అని అర్థం). బురకుమిన్‌ల లాగే కొరియాలో బేక్‌జీయాంగ్‌వర్‌ అనే 'అంటరాని' సంఘబహిష్కృత వర్గం ఒకటి వుంది. పేష్వాల పాలనలో దళితుల పరిస్థితి ఎలా వుండేదో వలసవాద పూర్వ కొరియన్‌ సమాజంలో బేక్‌జియాంగ్‌ల పరిస్థితి కూడా అలాగే వుండేది. వాళ్లని కూడా వెలివేసినవారిగా, మైల వర్గంగా పరిగణిస్తూ వారితో ఇతరులు మాట్లాడటానికే యిష్టపడేవారుకాదు. బేక్‌జియాంగ్‌లు ఎవరైనా తమకు రోడ్డు మీద యాంగ్‌బన్‌లు (ఉన్నత కులం వారు) ఎదురైతే చప్పున తలవంచుకుని గౌరవించాలి. మన దేశంలో దళితులలాగే వాళ్లు కూడా 19వ శతాబ్దిలో, 20వ శతాబ్ది ప్రారంభంలో ప్రతిఘటనా పోరాటాలు మొదలుపెట్టారు. మొదట సంస్కరణను ఆ తరువాత మొత్తం సమూల మార్పును డిమాండ్‌ చేశారు. అయితే కొరియా సమాజంలో చోటు చేసుకున్న అసాధారణ మార్పుల మూలంగా ఆతరువాత ఆ విధానం అంతరించింది.

కులాలను పోలిన ఇలాంటి విభజనలనూ, వివక్షా పద్ధతులనూ పైపైన పరిశీలించి వాటిని తిరస్కరించాలనుకునేవారు కొందరు భారతదేశం మాదిరిగావున్న ఈ సమాజాలను ఇష్టపడుతుంటారు. కానీ వాళ్లు ఆ సమాజాల్లో చూసింది కేవలం ఒకనాటి వ్యవస్థకూ, పద్ధతులకూ చెందిన అవశేషాలను మాత్రమే అన్న సంగతిని మరిచిపోతుంటారు. పైకి భారతదేశంలోని కుల వ్యవస్థలాగే కనిపించవచ్చు కానీ అవి పూర్తిగా భిన్నమైనవి. పైకి కనిపించే అంటరానితనం, వివక్ష, వెలి వంటి లక్షణాలు తప్ప ఆ సమాజాల్లో గాఢంగా చొచ్చుకుపోయిన, సర్వత్రా వ్యాపించిన హెచ్చుతగ్గుల దొంతరను, పక్షపాతంను  సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ధర్మశాస్త్ర వ్యవస్థలేవీ ఆకాశానికి ఎత్తవు. పైగా భారత దళితుల పరిస్థితికి అతి సమీపంగా వుండే బరకుమిన్లను పరిశీలిస్తే వారిది అతి సూక్ష్మమైన వర్గం. సమాజంలో అతి తక్కువ మందికి మాత్రమే వర్తించే లక్షణం వారిది.   భారతీయ కుల వ్యవస్థ కేవలం విభజన ప్రాతిపదికన ఏర్పడినది కాదు. నాలుగు అంచెల హెచ్చుతగ్గుల దొంతరతో కూడిన వర్ణవ్యవస్థతో పెనవేసుకుపోయి వున్న ఈ వ్యవస్థకు దేవుడి అనుమతి కూడా జోడించబడి వుంది. సంప్రదాయికంగా వర్ణ వ్యవస్థ చట్రంలో అంతర్భాగం కాకపోయినప్పటికీ, అంటరానివాళ్లు ప్రధాన కుల వ్యవస్థలోని హెచ్చుతగ్గుల దొంతర మాదిరిగానే తమలో తాము అనేక కులాలుగా విడిపోయివున్నారు. అందువల్లనే భారతదేశంలోని కుల వ్యవస్థ భారీ, సంక్లిష్ట, వ్యవస్థగా రూపొందింది. వదులైన అదేసమయంలో కఠినమైన హెచ్చుతగ్గుల దొంతరతో సంక్లిష్టంగా మార్పుచెందింది. విస్తృత స్థాయి వర్ణ వ్యవస్థ చట్రంలో కఠినంగా, తనలో తాను వదులుగా సువిశాలమైన భౌగోళిక ప్రాంతంలో ప్రజా జీవితాల్లో ఆచరించబడుతోంది. ఈవిధంగా గుణాత్మకంగా, పరిమాణాత్మకంగా ఇతర దేశాల వ్యవస్థలకు ఇది పూర్తిగా భిన్నమైనది.

కులాల మూలాల గురించిన అనేక మేధోపరమైన సిద్ధాంతాల సంగతి ఎలా వున్నా, భారత ఉపఖండపు విలక్షణమైన, సుసంపన్నమైన ప్రకృతిసహజ పరిస్థితుల నేపథ్యంలో కులాల మూలాలకు సముచితమైన భౌతికవాద దృక్పథంతో వివరణను ఇవ్వవచ్చు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో మాదిరిగా భారత ఉపఖండంలోని సంచార తెగలవారు వ్యవసాయంలో స్థిరపడేందుకు ఎలాంటి నిర్మాణపరమైన మార్పులకు గురికావలసిన పరిస్థితిలేదు. భారతదేశంలో చదునైన సారవంతమైన మైదాన ప్రాంతాలు, పుష్కలమైన సూర్యరశ్మి, వర్షాలు సమృద్ధిగా వుండటం వల్ల సంచార కుటుంబాలు తమ ఆదివాసీ స్వభావాన్ని కోల్పోకుండానే వ్యవసాయంలో స్థిరపడవచ్చు. ఉదాహరణకు ఇంగ్లాండ్‌ని తీసుకుంటే అక్కడ సూర్యరశ్మికి, వర్షాలకు, మైదానాలకు కొరత వుండటం వల్ల సాగుచేయాలంటే పెద్ద ఎత్తున కూలీల దండు అవసరమై అది యజమానులూ సేవకులతో కూడిన వ్యవస్థల ఏర్పాటుకు దారితీసింది. భారత దేశంలో కులాలు ఆదివాసీ అస్తిత్వాలతో ప్రారంభమై వ్యవసాయ సమాజంతో కలగలిసి క్రమేణా మతపరమైన పరిణామాలతో ఒక అత్యంత సంక్లిష్టమైన వ్యవస్థగా రూపుదిద్దుకున్నాయి. కాలక్రమంలో బయటినుంచి వచ్చిన ఆర్యులు ఇక్కడి భూములను జయించి అప్పటికే ఏర్పడివున్న కులవ్యవస్థపై తమ వర్గ వ్యవస్థనూ వర్ణ వ్యవస్థనూ రుద్దారు. సాధారణంగా కుల వ్యవస్థతో కూడిన ఈ నిర్మాణం తన సమగ్రతను కోల్పోకుండా చరిత్ర పొడవునా అంతకంతకూ బలపడుతూ వచ్చింది. వర్ణ వర్గ వ్యవస్థలో అంతర్భాగంగా ఆదివాసీ అస్తిత్వాలతో (జాతితో) ఒక సంక్లిష్టమైన వ్యవస్థ ఎలా ఏర్పడిందో ఇది వివరిస్తుంది, కుల వ్యవస్థను నిర్వచిస్తుంది. ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా రూపొంది, ఇంకా భారతదేశంలో మాత్రమే కొనసాగుతున్న పెత్తందారీ వర్గాలు నిర్మించిన సంక్లిష్ట మతపర, సామాజికపర నిర్మాణం జాతుల మధ్య హెచ్చుతగ్గుల దొంతరతో కూడిన పరస్పర సంబంధాన్ని పటిష్టం చేసింది.

మిగతా ప్రపంచంలోని కులాల వంటి సమూహాలతో ఈ హిందూ కులాన్ని వేరు చేస్తున్న విశిష్ట లక్షణాలు: 1) అంతర్గత వ్యవస్థలో వున్న నిర్దిష్టమైన రక్తసంబంధ స్వభావం. ఇది ఇక్కడి ఆదివాసీ అవశిష్ట లక్షణం. 2) మొత్తంగా భారతీయ వర్గ సమాజ నిర్మాణంతో కులానికి వున్న సంబంధం. కలసిభుజించడం, సజాతి వివాహాలు, సామాజిక నియమాలు, సంప్రదాయాలు; ఈ నియమాల ఉల్లంఘనలకు వెలి, సంఘ బహిష్కరణ వంటి శిక్షలు, వాటి నిర్వహణకు కుల సంఘాలు మొదలైనవి రక్తసంబంధ ఆదివాసీ సమూహాల ప్రత్యేక లక్షణం. భారతీయ కులాలన్నీ (వాస్తవానికి ఉప కులాలు, నిజమైన సజాతి వివాహాలు చేసుకునే విభాగాలు)  ఈ ఆదివాసీ లక్షణాలను ప్రతిబింబిస్తాయి. ప్రతి కులం, ఉపకులం పరిధిలోని విజాతి వివాహాలు చేసుకునే సమూహాల్లో కూడా ఆదిమ ఆదివాసీ సమాజ లక్షణాలను కలిగివుంటాయి. విజాతి వివాహాలు చేసుకునే  ప్రతీ సమూహంలోని వ్యక్తులంతా తాము ఒకే మూలపురుషుడి వంశీకులమని భావిస్తారు. చైనా, స్కాట్‌లాండ్‌, ఐర్లాండ్‌ ఇంకా కొన్ని అవశేషాలు కనిపించినా దాదాపు అన్ని వర్గ సమాజాల్లో అలాంటి సమూహాలు అంతర్ధానమైపోయాయి. కులానికి ఆదిమ ఆదివాసీ సమాజానికీ మధ్య వున్నటువంటి సన్నిహిత సంబంధం భారతదేశంలోని సామాజిక నిర్మాణంలోని మౌలిక భాగంలో తప్ప మరెక్కడా కనిపించదు. ఈ ప్రకారంగా ప్రతి హిందువు మూడు సామాజిక సమూహాలకు చెందివుంటాడు. 1. ఆస్తిని కలిగివుండే కుటుంబం, 2. విజాతి వివాహ గోత్రం, 3. సజాతి వివాహపు కులం లేదా ఉప కులం. ఇవి వరుసగా ఆదివాసీల కుటుంబం,  జాతులు, ఆదివాసీ సమాజంలోని ఆదివాసీలను పోలి వుంటాయి.

కుల వ్యవస్థ సామాజిక హెచ్చుతగ్గుల దొంతరను, కులాల మధ్య పరస్పర సంబంధాలను నిర్దేశించే వ్యవస్థ. కుల సమూహాలు ఆదివాసీ సమూహాల మాదిరిగానే వుంటాయి. వాటిలో హెచ్చుతగ్గుల దొంతర తప్పనిసరి కాదు. భారతీయ కులాలలోని ప్రత్యేక లక్షణం ఏమిటంటే అవి పైకి నిరాకారంగా కనిపించినప్పటికీ పటిష్టమైన హెచ్చుతగ్గుల దొంతరతో రూపుదిద్దుకున్నాయి. కుల వ్యవస్థపై వర్ణ వ్యవస్థ చూపిన ప్రభావం ఇది. కులాలపై పరిశోధన చేసిన తొలి తరం పరిశోధకుల్లో ఒకరైన ఎమైల్‌ సెనార్ట్‌ నాలుగు వర్ణాలు అనేవి కులాలు కాదనీ అవి వర్గాలనీ 1894 లోనే స్పష్టం చేశారు. ఇవాళ ఇందులోని ప్రతీ వర్గం పెద్ద సంఖ్యలో విడివిడి కులాలను కలిగి వుంది. హెచ్చుతగ్గుల దొంతరలో వాటి స్థాయి సామాజిక పని, సంప్రదాయం, వృత్తి మొదలైన వాటిపై ఆధారపడి వుంటుంది. (ఎమైల్‌ సి.ఎం. సెనార్ట్‌, కాస్ట్‌ ఇన్‌ ఇండియా, ట్రాన్స్‌లేటెడ్‌ బై సర్‌ ఇ. డెన్షన్‌ రోజ్‌, లండన్‌, 1950). ఈవిధంగా బ్రాహ్మణులది ఒక కులం కాదు, ఒక వర్గం లేదా వందలాది కులాలతో కూడిన ఒక ఎస్టేట్‌ అని చెప్పవచ్చు. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, దళితులకు కూడ ఇది వర్తిస్తుంది. కులం యొక్క ఈ సామాజిక, మతపర హెచ్చుతగ్గుల దొంతర తన వెనుక భారతీయ సమాజపు వర్గ స్వభావం వుందన్న వాస్తవాన్ని కప్పిపుచ్చుతుంది. రాజ్యం ఆ దొంతరను మరింత పటిష్టపరుస్తుంటుంది. సమాజపు వర్గ స్వభావం కుల వ్యవస్థ రూపంలో వ్యక్తమవుతూవుంటుంది. ఆ స్వభావం కుల, వర్గ వ్యాఖ్యానాలకు అతీతంగా అభివృద్ధి చెందింది. హిందూ సమాజంలో అంతర్భాగంగా వున్నందున మనం కులం అంటే కులమే అని చెప్పడం జరుగుతూ వుంటుంది. ఒకవేళ కులం వర్గ సమాజానికి వెలుపల గనుక వుంటే భారతదేశంలో ఇప్పటికీ ఉనికిలో వున్న దేశవాళీ తెగల మాదిరిగా అదొక ఆదివాసీ తెగగా ఏర్పడేది.

సాధారణంగా కులాలు అచంచలమైనవి అన్నట్టు మాట్లాడుతుంటారు. అవి ఘనీభవించినవీ, శిలాసదృశమైనవీ, మారనివి అన్నట్టు సజీవమైన కానట్టు భావిస్తుంటారు.  వర్ణానికీ కులానికీ మధ్య, కులానికీ అంటరానితనానికీ మధ్య, శూద్రులకూ దళితులకూ మధ్య గందరగోళం మామూలే. స్వీయ నిర్వహణ, స్వీయ నియంత్రణలను సాధించి కుల వ్యవస్థ బలమైన వ్యవస్థగా మారింది. ఉదాహరణకు కుల వ్యవస్థ దైవ సృష్టిగా పరిగణిస్తారు. అందుకే అంతర్గతంగా ఎన్ని విస్ఫోటనాలు జరిగినా అది చెక్కుచెదరకుండా వుంది. వర్ణం పరిధిలోనే కుల వ్యవస్థలో అనేక సాధారణ అంతర్‌కుల వివాదాలున్నాయి. అయినా వర్ణ వ్యవస్థ నిర్దేశించిన హెచ్చుతగ్గుల దొంతరకు అవన్నీ కట్టుబడి వుంటాయి. ఈ లక్షణాల మూలంగానే కుల వ్యవస్థ ప్రధాన నిర్మాణాన్ని తిరుగులేకుండా కొనసాగుతోంది. ఇందులోని మరో నిర్వహణాపరమైన అంశం ఏమిటంటే అన్ని కులాలకీ వాటి వాటి హోదాలను బట్టి మనుగడ సాగించే అవకాశాలకు ఢోకా లేకుండా పరస్పర ఆధార సంబంధాలతో కలిసి వుండటం. కులాలన్నింటికీ వ్యవస్థ ఒక విధమైన భద్రతను కల్పిస్తోంది. అన్ని కులాల ప్రజలూ తమ తమ కుల ధర్మానికి కచ్చితంగా కట్టుబడి వుండాలన్నదే ఏకైక నిబంధన. ప్రతి కులానికీ తమవైన మానసికపరమైన  మంచి చెడులు, వివిధ లాభాలూ నష్టాలూ వున్నాయి. దోపిడీ, అణచివేతలు ఈ వ్యవస్థలో అంతర్భాగాలు. కానీ ఎవరు దోపిడీ చేసేది, ఎవరు దోపిడీకి గురయ్యేదీ తెలుసుకోవడం అసాధ్యం. చివరికి వర్ణ వ్యవస్థలో అత్యున్నత స్థాయిలో వున్న బ్రాహ్మణ వర్ణంలో సైతం అగ్ర స్థానం కోసం తమలో తాము పోట్లాడుకునే వివిధ ఉపకులాలు వున్నాయి. అంటరానివాళ్లలోని పరిస్థితి ఇందుకు భిన్నమైనదేం కాదు. వాళ్లు అవర్ణులుగా పరిగణింబడుతున్నప్పటికీ వాళ్ల మధ్య కూడా ఈ హెచ్చుతగ్గుల పోటీ వుంది. తమ శ్రమపై బతకని ద్విజ కులాలకూ - వారికి ఊడిగం చేస్తూ బతికే శూద్రులకూ, అంటరానివాళ్లకూ మధ్య విభజనను ఇటీవలే గుర్తించినా దాని ఆచరణ ఇప్పుడంత సాధ్యమయేయిది కాదు. ఈవిధంగా విశాల ప్రాతిపదికన చేసే ఏ విభజననూ కుల వ్యవస్థ అనుమతించదు. ఎందుకంటే ఆ విభజన మొత్తం వ్యవస్థనే కుప్పకూల్చే ప్రమాదం వుంది. మనుషులు సృష్టించిన వ్యవస్థల్లో ఒక్క ఈ కుల వ్యవస్థే ఇంత సుదీర్ఘకాలం ఎలా మనుగడ సాగిస్తోందో, ఇంకా అది మనుషుల్ని ఎలా ఆడిస్తోందో అర్థమవుతుంది.

భారత ఉపఖండంలోని ప్రజలకు కులాలే జీవన సర్వస్వం. ఇక్కడ సంభవించే రాజకీయ, ఆర్థిక మార్పులను అవి ఎప్పటికప్పుడు తమలో ఇముడ్చుకుంటాయి. కులాలు ఉపఖండ లక్షణాలు కలిగినవైనా సరైన సమాచార, రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల అవి ఎక్కడికక్కడ స్థానికంగానే నిర్వహించబడుతుంటాయి. చారిత్రకంగా ఎలాంటి రాజకీయ ఆర్థిక మార్పులు చోటుచేసుకున్నా అవి కేవలం ద్విజ కులాలకే పరిమితమవుతూ వచ్చాయి. దిగువ శ్రామిక కులాల అంటే శూద్రుల, అంటరానివాళ్ల జీవితాలపై వాటి ప్రభావం ఏమీ పడలేదు. వీరికి ఆ మార్పులతో ప్రత్యక్ష సంబంధం లేకపోవడమే అందుకు కారణం. భారతదేశంలో ముస్లింల పాలన మొదలై, స్థిరపడిన తరువాత మొట్టమొదటిసారిగా కింది కులాలపై ప్రభావాన్ని చూపించింది. ప్రత్యామ్నాయ దేవుడు, ప్రత్యామ్నాయ మతం వున్నాయనీ అవి సర్వ మానవ సమానత్వాన్ని ప్రభోదిస్తాయనీ వీరికి తొలిసారిగా తెలిసింది. ప్రధానంగా సూఫీ సాధువుల ద్వారానే వీరికి ఇస్లాం మతం పరిచయమయింది. సూఫీ సాధువులు శూద్ర, అంటరాని కులాలవారితో కలగలిసిపోయి మానవీయ సహోదరత్వాల గురించి ప్రబోధించేవారు. ముస్లిం పాలన ఆధునిక భూస్వామ్య వ్యవస్థను ప్రవేశపెట్టడంతో ఈ కులాలవారికి తమ ఊళ్లను వదిలిపెట్టి నగరాల్లో సామూహికంగా నివసించే అవకాశం లభించింది. ఆ కాలంలో కింది కులాలవారు పెద్ద సంఖ్యలో ఇస్లాం మతంలో చేరారు. ఆతదనంతరం డబ్బుకు, అధికారానికి ఆశపడి అగ్రకులాల వారు కూడా ఇస్లాం మతం పుచ్చుకోవడం మొదలుపెట్టడంతో ఇస్లాం మతంలో కూడా కులాలు ప్రవేశించాయి. బ్రిటిష్‌ వలసవాద కాలంలో క్రైస్తవమతంలోకి మతమార్పిడులు మొదలైన తరువాత ఈ కులతత్వం ఆ మతంలో మరింత స్పష్టంగా కనిపించింది. ముస్లింలలో, క్రైస్తవులలో అధిక సంఖ్యాకులు మతమార్పిడి చేసుకున్న కింది కులాలవాళ్లే కావడంవల్లనే సంఘ్‌ పరివార్‌ ఆ మతాలను ద్వేషించడం మొదలుపెట్టింది. కాబట్టి మతతత్వమనేది ప్రధానంగా ఈ కులతత్వం నుంచే అవిర్భవించిందని చెప్పవచ్చు.

బ్రిటిష్‌ వలసవాద పాలనాకాలంలో సమాజంలో అత్యంత ప్రభావశీలమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కింది కులాలవారికి,  ప్రత్యేకించి నిర్దిష్ట కుల వృత్తులు లేని అంటరాని కులాల వారికి వలస పాలన అనేక అవకాశాలను అందుబాటులోకి తెచ్చింది. అంటరానివాళ్లు బ్రిటిష్‌ సైన్యంలో, క్లబ్బుల్లో, ఇళ్లల్లో, పరిశ్రమల్లో పెద్ద ఎత్తున చేరారు. ముఖ్యంగా వలసపాలన అంటరానివాళ్లకు ఆధునిక విద్యలో ప్రవేశం కల్పించింది. మొదట క్రైస్తవ మిషనరీల ద్వారా, ఆ తరువాత ప్రభుత్వం ద్వారా వారికి విద్యావకాశాలు అందుబాటులోకి వచ్చాయి. తమ దోపిడీని కొనసాగించుకునేందుకే అయినా వలస పాలకులు ఓడరేవులు, రోడ్లు, కాలువలు, రైల్వేలను నిర్మించేందుకు అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టడంతో అది దిగువ కులాల వారికి ఒక వరంగా మారింది. మౌలిక సదుపాయాలను పారిశ్రామిక పెట్టుబడులు మరింత వేగంగా విస్తరించాయి, వాటితో పాటే వీరికి ఉద్యోగావకాశాలను పెంచాయి. చాలామంది ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. చిన్న చిన్న వ్యాపారాలవైపు మళ్లారు. అయితే వలస పాలన ఇలాంటి అనూహ్యమైన సానుకూలతలను సృష్టిస్తూనే మరోవైపు వివిధ మానవ పరిణామ అధ్యయనాలను, కుల జనాభా సేకరణను జరిపి ప్రజల్లో హెచ్చుతగ్గుల దొంతరను, కుల స్పృహను మరింత బలోపేతం చేసేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించింది. వలసవాద పాలన విస్తృతమైన సమాచార, రవాణా వ్యవస్థల ద్వారా భారతదేశాన్ని రాజకీయంగా ఐక్యం చేసిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగా నూతన అఖిల భారత కుల విధానాలు సామాజిక రంగంను దాటి రాజకీయరంగంలో చోటు సంపాదించుకున్నాయి. ఇలాంటి సామాజిక, రాజకీయ నేపథ్యంలో పెట్టుబడిదారీ వ్యవస్థ భారతదేశంలో అడుగుపెట్టింది. కుల వ్యవస్థతో దానికి ఎలాంటి వైరుధ్యాలూ పదురు కాలేదు. పైగా శ్రామిక వర్గాన్ని విభజించి వుంచడానికి పెట్టుబడిదారీ విధానానికి కుల వ్యవస్థ అత్యుత్తమ సాధనంగా అగుపించింది. కాగా, పెట్టుబడిదారీ విధానం సమాజంలోని ఇతర వర్గాలను సుసంఘటితం చేసింది. ప్రధాన నగరాలలోని ద్విజ కులాల వారు పెట్టుబడిదారీ విధానాన్నీ, ఆధునికతనూ స్వాగతించారు. ఒకవైపు పెట్టుబడిదారీ విధానం ప్రజలను చీలుస్తూనే మరోవైపు పెట్టుబడిదారులను సమైక్యం చేసింది. పెట్టుబడిదారులు తమ మధ్య వున్న సాంప్రదాయిక విభేదాలను అధిగమించారు. వ్యాపార రంగంలో సంబంధాలను నెలకొల్పుకోవడం, కాపాడుకోవడం అనివార్యమైన పంపిణీ వ్యవస్థ ప్రభావం వల్ల విభిన్న కులాలకు చెందిన ప్రజలతో - వారిలో ఎక్కువమంది అగ్రవర్ణాలకు చెందినవారే అయినా - సంబంధాలను పెట్టుకోవలసి వచ్చింది. కాలక్రమంలో వారి మధ్య వున్న కుల విభేదాలు కాస్తా వర్గ విభేదాల స్థాయికి తగ్గిపోయాయి. '' రైల్వే వ్యవస్థ లోంచి ఆవిర్భవించిన  ఆధునిక పారిశ్రామిక రంగం - భారత దేశ అభివృద్ధికీ, శక్తికీ ప్రధాన అవరోధంగా వున్న కుల వ్యవస్థనూ, ఆ వ్యవస్థ ప్రధానంగా ఆధారపడిన వంశపారంపర్య శ్రమ విభజన (కుల వృత్తుల) విధానాన్నీ నిర్మూలిస్తుంది'' (ఆన్‌ కొలోనియలిజమ్‌, మాస్కో ఎడిషన్‌ 1974, పే.85) అన్న కారల్‌ మార్క్స్‌ మాటలను ఇక్కడ ముఖ్యంగా ఆయన భారతదేశం విషయంలో విఫలమయ్యారని అసమంజసంగా వాదించేవారు  గుర్తుచేసుకోవాలి.

కుల వ్యవస్థలో వలసవాద పరిపాలనా కాలంలో చోటు చేసుకున్న మార్పుల కంటే ఎంతో ఎక్కువ మార్పులు అధికార మార్పిడి జరిగి స్వాతంత్య్రం వచ్చిన తరువాత చోటుచేసుకున్నాయి. స్వదేశీ పాలవర్గాలు కుల వ్యవస్థను తమకు అనుకూలంగా పూర్తిస్థాయిలో వినియోగించుకున్నాయి. తమ వంచనా శిల్పంతో సామాజిక న్యాయం అనే ముసుగుతో ప్రజలను ముఖ్యంగా దళితులనూ ఆదివాసీలనూ దారుణంగా మోసగించాయి. అధికారం చేజిక్కించుకున్న తరువాత కాంగ్రెస్‌ పార్టీ స్వాతంత్య్రోద్యమ కాలంలో ప్రజలను ఉత్తేజపరచడానికి ప్రవచించిన సామ్యవాద భావనలకు తిలోదకాలిచ్చి ప్రభుత్వ విధానాన్ని క్రమేపీ పెట్టుబడిదార్లకు అనుకూలంగా మలుస్తూ వచ్చింది. గాంధీ ప్రజాకర్షణనను ప్రాతిపదికగా చేసుకుని తాను యావత్‌ భారతదేశ ప్రజలకు ప్రతినిధినని చాటుకున్న సంగతి ఎలా వున్నా, కాంగ్రెస్‌ పార్టీ అప్పుడప్పుడే తలెత్తుతున్న భారతీయ బూర్జువా వర్గానికి కొమ్ము కాసింది. 'బొంబాయి ప్లాన్‌' ఉదంతంలోనే కాంగ్రెస్‌ పార్టీ బూర్జువా అనుకూల స్వభావం బయటపడింది. రాజ్యాంగ నిర్ణయ సభ రాజ్యాంగ రచనలో తలమున్కలై వుండగానే ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ పంచ వర్ష ప్రణాళికను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. ఆరోజుల్లో అది సోవియట్‌ రష్యాకు సంబంధించిన విధానం. కొత్తగా స్వాతంత్య్రాన్ని పొందిన భారత దేశం సోవియట్‌ రష్యా మార్గంలో పయనించబోతోందని ప్రపంచానికి భ్రమ కలిగించేందుకు ఉద్దేశించిన ప్రయత్నమది. దాని వల్ల దేశంలో సామ్యవాద ఆకాంక్షలకు ఊతమిచ్చినట్టయింది. బొంబాయి ప్లాన్‌ను కొందరు భారతీయ పారిశ్రామికవేత్తలూ టెక్నోక్రాట్‌లతో కూడిన ఒక బృందం భారతదేశం స్వాతంత్య్రానంతరం పదిహేనేళ్ల పెట్టుబడి ప్రణాళికను ప్రతిపాదిస్తూ 1944 జనవరిలోనే రూపొందించారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత బ్రిటిష్‌ ప్రభుత్వం భారత దేశానికి స్వాతంత్య్రం ప్రకటిస్తుందన్న నమ్మకం సర్వత్రా వ్యాపించివున్నా వలసవాదానంతర భారతదేశం ఏ విధానాన్ని అనుసరిస్తుంది అన్న విషయంలో అప్పటికింకా అధికారికంగా ఎలాంటి స్పష్టతా లేదు. కానీ బొంబాయి ప్లాన్‌ మాత్రం అప్పటికి అతి కొద్ది మాత్రమే ఊహించిన భారత విభజనను పరిగణనలోకి తీసుకుని లెక్కలను సంసిద్ధం చేసింది. ఆ ప్లాన్‌ను జవహర్‌లాల్‌ నెహ్రూ అధికారికంగా స్వీకరించకపోయినా మొదటి మూడు పంచవర్ష ప్రణాళికల్లో అందులో వున్న విధంగానే వివిధ విభాగాలకు పెట్టుబడులను కేటాయింపులు జరిపారు. రెండో పంచవర్ష ప్రణాళిక పి.సి.మహలనోబిస్‌ ఇచ్చిన  స్వదేశీయ అభివృద్ధి నమూనా విధానంపై ఆధారపడిందని మనం చిన్నప్పుడు పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుకున్నాం! ప్రజలను వంచించేందుకు పాలకవర్గాలు పన్నిన ఈ కుట్రలను మన మేధావులు ఛేదించలేకపోవడం విచిత్రం.

రాజ్యాంగ నిర్మాణంలో కూడా పాలకవర్గం ఇలాంటి కుట్రలకే పాల్పడింది. అత్యధిక శాతం దళితులు ఆరాధించే స్థాయికి చేరుకున్న బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ను రాజ్యాంగ నిర్మాణ సభలో చేర్చుకోవడం, ఆతరువాత ఆయనను అత్యంత కీలకమైన రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్‌గా నియమించడం ఒక వ్యూహాత్మక ఎత్తుగడ. కాంగ్రెస్‌ పార్టీకీ, దాని మహానేత గాంధీకీ బద్ధ వ్యతిరేకి అయిన అంబేడ్కర్‌ను రాజ్యాంగ నిర్మాణ సభలో చేర్చుకోగానే బొంబాయి కాంగ్రెస్‌ శాసనసభా పక్షం నుంచి తీవ్రమైన ప్రతిఘటన పదురయింది. ఆ సమయంలో సమైక్య బెంగాల్‌లో షెడ్యూల్డ్‌ కాస్ట్‌ ఫెడరేషన్‌ (ఎస్‌సిఎఫ్‌) నాయకుడు జోగేంద్రనాథ్‌ మండల్‌ నుంచి అంబేడ్కర్‌కు మద్దతు లభించింది. అంబేడ్కర్‌ తూర్పు బెంగాల్‌ నుంచి ఎన్నికయ్యేందుకు ఆయన ముస్లింలీగ్‌ను ఒప్పించారు. అయితే ఆ విజయం కొద్దికాలమే నిలిచింది. దేశ విభజన ప్రకటన వెలువడడంతో అంబేడ్కర్‌ తన సభ్యత్వాన్ని కోల్పోవలసి వచ్చింది. అయితే అంబేడ్కర్‌కు వున్న ప్రాధాన్యతను గ్రహించిన కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా ఆయన బొంబాయి నుంచి ఎన్నికయ్యేందుకు ఏర్పాట్లు చేసింది. అంతేకాదు రాజ్యాంగ ముసాయిదా కమిటీకి ఆయనను అధ్యక్షుడిగా ప్రకటించి అందరినీ మరింత ఆశ్చర్యపరిచింది.

అగ్రవర్ణాలలోని సంస్కరణవాదులూ, గాంధీ నాయకత్వంలోని కుల వ్యవస్థ సమర్థకులూ ఎంతోకాలంగా కోరుతున్నట్టు రాజ్యాంగం అంటరానితనాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించింది. అయితే షెడ్యూల్డ్‌ కులాలకు (ఎస్‌సి), షెడ్యూల్డ్‌ తెగలకు (ఎస్‌టి) కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం పేరిట కులాలను అది పరిరక్షించింది. నిజానికి ఎస్‌సీలకు రిజర్వేషన్లు తదితర సౌకర్యాలను వలసవాద పాలనా కాలంలోనే కల్పించారు. ఈనాటి కోటా విధానం ఆనాటి ప్రాథమిక విధానం నుంచి స్వీకరించిందే. వైస్‌రాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో కార్మిక ప్రతినిధిగా వున్నప్పుడు అంబేడ్కరే ఆ విధానాన్ని ప్రతిపాదించారు. 1936లో లబ్దిదారులను గుర్తించడం కోసం షెడ్యూల్ట్‌ కులాలు అన్న పరిపాలనాపరమైన తరగతి కిందకు తెచ్చారు. దీనిద్వారా అంటరానితనంతో పాటు కులాలను నిషేదించాలని రాజ్యాంగ నిర్ణయ సభ అనుకొంది. కానీ అలా జరుగలేదు. ఈ సౌకర్యాలను ఆదివాసీలకు కూడా విస్తరించాలని సభ నిర్ణయించింది. ఆదివాసీలు కులం పరిధిలోకి రానివారు కాబట్టి వారికి కులంతో నిమిత్తంలేకుండా రిజర్వేషన్లు కల్పించవచ్చు. కానీ వారికోసం 'షెడ్యూల్డ్‌ ట్రైబ్‌' అనే మరో షెడ్యూల్‌ను ఏర్పాటుచేసింది. ఎస్‌సీలను గుర్తించేందుకు అంటరానితనం అనే నిర్దిష్టమైన లక్షణం వున్నట్టు ఆదివాసీలను గుర్తించేందుకు ఎలాంటి లక్షణం లేదని స్పష్టంగా తెలిసినప్పటికీ ఆపనిచేసింది.  ఆదివాసీలను గుర్తించే  పద్ధతి ఏదైనాకా, వారికి ఇలాంటి సౌకర్యాలు కల్పించాలంటే వారిని ఇప్పుడున్న షెడ్యూల్‌లోనే కలిపివుండవచ్చు. కావాలంటే ఆ షెడ్యూల్‌కు కులాలతో నిమిత్తంలేకుండా మరేదైనా పేరు పెట్టి వుండవచ్చు. దానివల్ల ఇంతకు ముందరి అంటరానివాళ్ల సాంప్రదాయిక కుల గుర్తింపు రూపుమాసిపోయేందుకు అవకాశం వుండేది. అలాగే దళితుల మాదిరిగా సామాజిక వెలి అనేది లేని ఆదివాసీలకు అది ఆపాదించబడేది కాదు. కానీ అలా జరుగలేదు. ఆదివాసీలకు ప్రత్యేక షెడ్యూల్‌ను సృష్టించడం ద్వారా పాలక వర్గాలు ఏ కులం వారైనా తమకు షెడ్యూల్డ్‌ తెగ హోదా కల్పించాలని కోరేందుకు వీలును కల్పించారు. రాజస్థాన్‌లో 2008లో గుజ్జార్‌లు చేసిన ఆందోళనలు ఇందుకో ఉదాహరణ. ప్రస్తుతం మహరాష్ట్రలో దంగార్లు కూడా అదేవిధమైన డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఎవరూ షెడ్యూల్డ్‌ కులం హోదా కావాలని డిమాండ్‌ చేయకపోవడం విచిత్రం.

రాజ్యాంగం వీటన్నింటినీ కప్పిపుచ్చేందుకు 'సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన' వారిని ఇతర వెనుకబడిన తరగతుల పేరిట (ఒబిసి కులాలు) గుర్తించి వారికి కావలసిన రాయితీలను రాజ్యం కల్పిస్తుంది అంటూ మరో సందిగ్ద క్లాజును చేర్చింది. భారతదేశం వంటి వెనుకబడిన దేశంలో దాదాపు ప్రజలంతా సామాజికంగా వెనుకబడినవారే. హెచ్చుతగ్గుల దొంతరలతో కూడిన కుల వ్యవస్థలో ఒకరికంటే మరొకరు విద్యాపరంగా వెనుకబడి వుంటారు. అందువల్ల ఈ సౌకర్యం మరిన్ని సమస్యలను సృష్టిస్తుంది. నిజంగా ప్రజలకు సహాయం చేయాలనుకుంటే రిజర్వేషన్లు ఒక్కటే మార్గం కాదు. వలసవాద పాలనా కాలంలో చేసినట్టు అరుదైన పరిస్థితులలో వర్తింపజేసే అరుదైన చర్యగా రిజర్వేషన్లను అమలుచేయవచ్చు. భారతదేశం వంటి వెనుకబడిన దేశంలో ప్రభుత్వం నిజంగా, నిజాయితీగా ప్రజలకు సహాయం చేయాలనుకుంటే సంపద పున:పంపిణీని చేపట్టవచ్చు. ఆరోగ్యం, విద్య వంటి ప్రాథమిక సౌకర్యాలను కల్పిస్తూ సామ్యవాద విధానాలను అమలుపరచవచ్చు. రాజ్యాంగ నిర్మాణ సభలో అంబేడ్కర్‌ చేసిన తన మొట్టమొదటి ఉపన్యాసంలోనే ఇలాంటి సంస్కరణల గురించీ, రాజ్యం అనుసరించాల్సిన సామ్యవాద విధానాల గురించీ సైద్ధాంతికంగా మాట్లాడారు. అయితే ప్రజలకు సహాయం చేయడం పాలకవర్గాల లక్ష్యం కాదు. తమ పరిపాలన శాశ్వతంగా కొనసాగేట్టు చేసుకోవడం కోసం ప్రజలను వాడుకోవడమే వాళ్ల లక్ష్యం. 1990లో వి.పి.సింగ్‌ అమలుపరచిట్టుగా ఈ చర్యలన్నీ పాలకవర్గాలకు అవసరమైనప్పుడు వినియోగించుకునేందుకు ఉద్దేశించినవి.

రాజ్యం వీటి తరువాత వెంటనే ఒక సంక్లిష్టమైన పద్ధతిలో భూసంస్కరణలను చేపట్టింది. దాని వెనక వున్న అసలు ఉద్దేశం గ్రామీణ భారతదేశంలో సంపన్న రైతులను కేంద్ర పాలకులకు ఏజెంట్లుగా పనిచేసేట్టు చేయడం. అదేసమయంలో దున్నే వాళ్లకే భూమి ఇవ్వాలని ప్రజల్లో బలంగా వున్న ఆకాంక్షలను కొంతవరకు నెరవేర్చడం. భూమి అంశం రాష్ట్రాల పరిధిలోనిది. దున్నేవారికి భూమి పంపిణీ అనేది కాగితాల మీద వివిధ రాష్ట్రాల్లో విభిన్న స్థాయిల్లో జరిగింది. లబ్దిపొందినవాళ్లలో అత్యధికులు భూస్వాములకు ఇష్టమైన శూద్రకులాలకు చెందినవాళ్లు. చాలామంది భూస్వాములు ఆవిధంగా పంపిణీ అయిన భూమిని తిరిగి తమ గుప్పిట్లోకే తీసుకోగలిగారు. నిజానికి చాలా చోట్ల భూమిని దున్నుతున్నది దళితులు. అయినా వారికి ఎలాంటి భూమీ దక్కలేదు. ఈవిధమైన అవకతవకల భూసంస్కరణల తరువాత వెంటనే హరిత విప్లవాన్ని మొదలుపెట్టారు. దాని ఉద్దేశం ఆనాడు తీవ్రంగా వున్న ఆహార కొరతనూ, ప్రజల క్షుద్బాధనూ తీర్చడం. హరిత విప్లవం వ్యవసాయ ఉత్పత్తిని పెంచుతూనే వ్యవసాయ సంబంధాలలో, తద్వారా కుల సంబంధాలలో గణనీయమైన మార్పును తీసుకొచ్చింది. వాస్తవానికి హరిత విప్లవం ఒక పెట్టుబడిదారీ ఎత్తుగడ. అది గ్రామీణ భారతదేశంలో ఉత్పాదకాలు, ఉత్పత్తులు, రుణాలు, సాధనాలనూ, సేవల మార్కెట్‌నూ, నగదు ఆర్థిక వ్యవస్థనూ పెంపొందించింది. శూద్ర భూయజమానులను పెద్ద ఎత్తున బలోపేతం చేసింది. వాళ్లను సంపన్న రైతులుగా మార్చింది. వాళ్లు గ్రామాలను నియంత్రించేందుకు అగ్రవర్ణ భూస్వాముల నుంచి బ్రాహ్మణీయ పెత్తనాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు.

పెట్టుబడిదారీ సంబంధాలు వచ్చి ఒకరిపై మరొకరు ఆధారపడే సాంప్రదాయిక కుల సంబంధాలను కుప్పకూల్చాయి. అవి దళితులను వ్యవసాయ వేతనాల కోసం పూర్తిగా సంపన్న రైతుల మీద ఆధారపడే గ్రామీణ కూలీలుగా మార్చాయి. అంతవరకూ వుంటూ వచ్చిన విభిన్న స్థాయిల కుల వైరుధ్యాల స్థానంలో - వ్యవసాయ కూలీలుగా దళితులకూ, పెట్టుబడిదారీ రైతులుగా సంపన్న భూయజమానులకూ మధ్య ప్రత్యక్ష వర్గ సంబంధాలను నెలకొల్పాయి. ఈ సంపన్న రైతులు అంతకు ముందరి ఆడంబరపు అగ్రవర్ణ భూస్వాముల వంటివారు కాదు. సాంస్కృతిక పటాటోపం లేకపోయినా వీళ్లు అధిక సంఖ్యాకుల కులాలకు చెందినవాళ్లు కావడంతో కుల ఆధిపత్యాల కారణంగా ఈ వర్గ వైరుధ్యాలు ఒక కొత్త కులపర అరాచకాలకు బాటలు వేశాయి. గతంలో కుల అత్యాచారాలు వ్యక్తిగత స్థాయిలో జరుగుతుండేవి, తప్పు చేసిన కింది కులానికి చెందిన వ్యక్తే అగ్రవర్ణ వ్యక్తి చేతుల్లో శిక్షకు గురవుతుండేవారు. కానీ, ఇప్పుడు జరుగుతున్న కొత్త అరాచకాలలో శూద్రకులాలవారు దళితులందరికీ గుణపాఠం చెప్పే లక్ష్యంతో మొత్తం దళిత సమాజంపై మూకుమ్మడి దాడులు చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో వచ్చిన ఈ నూతన ధోరణిని ప్రతిబింబిస్తూ మొట్టమొదటి అరాచకం 1968 డిసెంబర్‌ 25 నాడు తమిళనాడు కిల్వన్మణిలో జరిగింది. అక్కడ భూస్వాములను ప్రశ్నించిన పాపానికి వారి అనుచరులు 44 మంది దళితులను సజీవ దహనం చేశారు. చనిపోయినవారిలో ఎక్కువమంది మహిళలూ పిల్లలే వున్నారు. ఆ తరువాతి దశాబ్దాలలో కిల్వన్మణిలో జరిగిన వర్గపోరాటాన్ని తలదన్నుతూ బీహార్‌లో ప్రత్యక్ష కుల యుద్ధాలుగా మారాయవి. నూతన ఉదారవాద భారతదేశంలో ఈ ధోరణి కొనసాగడమే కాదు మరింత విజృంభిస్తోంది.

విద్యావంతుల, మేధావుల ప్రపంచం ఈ దారుణాల పట్ల చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. వలసవాదానంతర భారతదేశానిది ఒక విలక్షణమైన స్థితి. ఇక్కడ ముందుగా రాజ్యం ఏర్పడి ఆతరువాత అది సజాతి వర్గాన్ని తయారుచేసుకుంది. సర్వసాధారణంగా ఇతర చోట్ల వర్గాలు ముందు ఏర్పడి ఆతరువాత అవి తమ రాజ్యాన్ని స్థాపించుకుంటాయి. హరిత విప్లవంతో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన ఉత్పత్తి ఫలితంగా సంపన్న రైతుల వద్ద అంతులేని అదనపు సంపద పోగైంది. వారు దానిని సమీప పట్టణాలలో రవాణా, సినిమా థియేటర్లు, బియ్యం/నూనె మిల్లులు, జిన్నింగ్‌ ప్రాసెసింగ్‌ ఫాక్టరీలు, కాంట్రాక్టులు, కమిషన్‌ ఏజెన్సీలు వంటి రకరకాల రంగాలలో పెట్టుబడి పెట్టారు. గ్రామంలోని సంపన్న రైతులు భూస్వామిగా, పెటీ బూర్జువాగా, బ్రాహ్మణవాద సంరక్షుడిగా, రాజకీయవేత్తగా బహుపాత్రలను పోషిస్తారు. వీరిలో కొందరు కేంద్రంలోని అధికార పార్టీతో చేతులు కలిపి పంచాయితీ సమితులను, జిల్లా పరిషత్‌లను, రాష్ట్ర శాసనసభల్లో గణనీయమైన భాగాలను, సాధించుకుంటే, మరికొందరు స్వతంత్ర ఆకాంక్షలతో ప్రాంతీయ పార్టీలను స్థాపించి బలమైన రాజకీయ శక్తులుగా ఆవిర్భవించారు. ఈ అన్ని పరిణామాలూ ఎన్నికల రాజకీయాల్లో పోటీ పెరగడానికి దోహదం చేశాయి. ఆ తరువాత కులాల్లోని, సమాజాల్లోని చిన్న చిన్న సమూహాలవారిపట్ల వారికి ఆశను పెంచాయి. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లు గెలిచే ఎన్నికల వ్యవస్థలో ఈ సమూహాల ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. ఈ ఎన్నిల విధానంలో కొద్దిపాటి ఓట్లు రాజకీయ నాయకుల గెలుపు ఓటములను తారుమారు చేస్తాయి. దేశీయంగా వచ్చిన ఈ పరిణామాలు, వాటికితోడు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత రెండు దశాబ్దాలపాటు కొనసాగిన పెట్టుబడిదారీ స్వర్ణయుగం ముగిసి ప్రపంచం అంతటా ఏర్పడ్డ సంక్షోభం, అశాంతి వల్ల 1970ల మధ్య సంకీర్ణ రాజకీయాలు పుట్టుకొచ్చాయి. కేంద్రంలో అధికారం చేజిక్కించుకున్న విభిన్న రాజకీయ పార్టీల కూటమి జనతాపార్టీ ఈ ధోరణికి ఒక ఉదాహరణ. ఎన్నికల రాజకీయాలలో రాజకీయ నాయకులకు కులం అత్యంత ప్రధాన వనరుగా మారింది.

భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డ ఆయుధాలను వినియోగించుకోవడం అప్పటినుంచే మొదలయింది. రాజకీయ నాయకులు కులాలను మభ్యపెట్టడానికి రిజర్వేషన్లను విచ్చలవిడిగా వాడుకోవడం   ప్రారంభించారు. వలసవాద కాలంలో రిజర్వేషన్లనేవి అసాధారణ స్థితిలో వున్న వారికి అరుదుగా కల్పించే విధానంగా వుండేది. కానీ వలసవాద అనంతరం రిజర్వేషన్లు పాలకవర్గాల అమ్ముల పొదిలోని అస్త్రాలుగా మారిపోయాయి. మండల్‌ రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన తరువాత ఈ రిజర్వేషన్ల లొల్లి తారాస్థాయికి చేరుకుంది. ఇవాళ రిజర్వేషన్లు కావాలని గట్టిగా కోరని కులం ఒక్కటి కూడా లేదు. విచిత్రం ఏమిటంటే ఈ డిమాండ్లలో అధికశాతం మండల్‌ రిజర్వేషన్లలో భాగస్వామ్యం కావాలని కోరుకోవడం లేదు. ఇందుకు బహుశా 52 శాతం అంచనా జనాభాలో 27 శాతం రిజర్వేషన్ల పరిమితి వల్ల ఇప్పటికే అక్కడ ఒత్తిడి ఎక్కువవుండటం కారణం కావచ్చు. అయితే, రిజర్వేషన్లలో భాగంగా ఎస్‌.టి. హోదా కావలన్న డిమాండ్లు మాత్రం పెరిగాయి. రాజకీయ నాయకులు పన్నిన మరో పన్నాగం ఎస్‌.సి.లలోని చిన్న చిన్న కులాలను రెచ్చగొట్టి వారిని చీల్చాలని చూడటం. ఎస్‌సిలలో పెద్ద సంఖ్యలో వున్న కులాలవారే రిజర్వేషన్‌ ఫలాలను కొల్లగొడ్తున్నారనీ చిన్న కులాలవారికి అన్యాయం జరుగుతోందని చిచ్చు పెట్టడం. దీనివల్ల రిజర్వేషన్లలో రిజర్వేషన్లను డిమాండ్‌ చేస్తూ ఉపకులాల ఉద్యమాలు మొదలయ్యాయి. ఎస్‌సి/ఎస్‌టి సమాజాల్లో వాస్తవంగా అవసరమైన వాళ్లకి లబ్దిని కలిగించడంలో ప్రస్తుత రిజర్వేషన్లు విఫలమయ్యాయని జనం గ్రహించి వుంటే ఫలితం వేరుగా వుండేది. అందుకు విరుద్ధమైన పద్ధతిలో రెచ్చగొడితే తప్ప ఈ రాజకీయ నాయకులు రిజర్వేషన్ల అంశాన్ని తమ స్వప్రయోజనాలకోసం సులువుగా ఉపయోగించుకోలేరు. ఆంధ్రప్రదేశ్‌లో 1990ల మధ్యలో మొదలైన మాదిగ దండోరా ఉద్యమం ఇవాళ అనేక రాష్ట్రాలకు వ్యాపించింది. అంబేడ్కర్‌ కలలు గన్న కుల నిర్మూలన లక్ష్యానికి తగిలిన చివరి శరాఘాతం వంటిది ఇది. ఆయన ఎంతో శ్రమించి కుల నిర్మూలన పోరాటంలో అగ్రగామిని చేసేందుకు దళిత భావనను నిర్మించారు. ఆ భావన ఇవాళ ఉపకులాల రూపంలో చీలికలు పేలికలయింది. ప్రభుత్వ నూతన ఉదారవాద విధానాల మూలంగా ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు క్షీణించి రిజర్వేషన్లు తగ్గిపోతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం విచిత్రం. రిజర్వేషనిస్టులు ఇవేవీ వినిపించుకునే స్థితిలో లేరు.

వలసవాదానంతర కుల రాజకీయ ఆర్థిక వ్యవస్థలో మరో కీలకమైన మార్పు చోటుచేసుకుంది. అది శూద్రులకు పెద్ద ఎత్తున ఆర్థిక, రాజకీయ సాధికారికత సమకూడటంతో అగ్రవర్ణాలకూ, శూద్రులకూ మధ్య సాంప్రదాయిక విభేదాలు తగ్గుముఖం పట్టడం. నాలుగు వర్ణాలలోని కులాలను సాంప్రదాయికంగా ధ్వంసం చేసి మొత్తం కుల వ్యవస్థను దళితులూ దళితేతరులూ అనే వర్గాల స్థితికి తీసుకెళ్లాలన్న తన లక్ష్యాన్ని పెట్టుబడిదారీ విధానం సాధించింది. చాలావరకు కుల విభేదాలు బలహీనమయ్యాయి కానీ మరోవైపు అందుకు విరుద్ధమైన రీతిలో కుల అస్తిత్వాలు బలం పుంజుకున్నాయి. ఎన్నికల రాజకీయాలూ, రిజర్వేషన్లూ వంటి ఆధునిక వ్యవస్థలు ఈ అస్తిత్వాలకు ఎరువునూ నీరునూ అందించాయి. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు గెలిచే ఎన్నికల విధానం కుల అస్తిత్వాలకు మరింత ప్రేరణనిచ్చింది. బ్రిటిష్‌ వలస ప్రాంతంలో కొత్తగా స్వాతంత్య్రం పొందిన దాదాపు అన్ని దేశాలూ ఈ బ్రిటిష్‌ నమూనా ఎన్నికల విధానాన్నే అనుసరించాయి. కానీ కులాలూ, సమూహాలూ, మతాలూ, భాషలూ, ప్రాంతాలూ మొదలైన వాటిద్వారా అడ్డంగా, నిలువుగా చీలిపోయివున్న భారతదేశానికి ఈ నమూనా ఏమాత్రం పనికిరాదు. అయినప్పటికీ భారత పాలకవర్గాలు తమ అధికారాన్ని కలకాలం కాపాడుకోవడానికి ఇదే బాగా ఉపయోగపడుతుందని భావించాయి. వాళ్లు చేయవలసిందల్లా అస్తిత్వాలను ప్రేరేపిస్తూ ఇప్పటికే దేశంలో నెలకొని వున్న విభజనలను తమకు అనుకూలంగా మలచుకోవడమే. రాజకీయాలు అస్తిత్వ రాజకీయాలుగా మారేందుకు ఈ వ్యవస్థ ఎంతో దోహదం చేయడం మనం చూస్తున్నాం.

ప్రస్తుత కులాలు వెనుకటి ధర్మశాస్త్రాలు నిర్ణయించినట్టుగానో, మనువు నిర్దేశించినట్టుగానో సాంప్రదాయిక కులాలుగా కాకుండా చాలావరకు రాజ్యాంగపరమైన కులాలుగా కనిపిస్తాయి. దళితులకూ దళితేతరులకూ మధ్య స్పష్టమైన విభజన రేఖ ఏర్పడింది. దళితేతరులకు దళితులు బయటివారుగా ఉపయోగపడతారు. అందువల్ల పాలక వర్గాలు కులాలను తమ గుప్పిట్లోంచి పోనివ్వవు. అంతేకాదు అవి దళితులను దళితులుగా కూడా వుండనివ్వవు. దళితులు సంఘటితమై ప్రస్తుత వ్యవస్థను ధిక్కరించే పరిస్థితిరాకుండా వారిని ఉపకులాలుగా చీలుస్తాయి. రిజర్వేషన్లు వచ్చి దళితులలో ఒక మధ్యతరగతి వర్గాన్ని సృష్టించాయి. పట్టణాల్లో, నగరాల్లో ఆ వర్గాన్ని స్పష్టంగా గమనించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ మురికివాడల్లో నివసించే మెజారిటీ దళితుల కడగండ్లను ఆ మధ్యతరగతి దళిత వర్గం పట్టించుకోదు. గత ఆరు దశాబ్దాలుగా అమలు పరుస్తున్న రిజర్వేషన్లు కేవలం 10 శాతం మంది దళితుల పరిస్థితినే మెరుగు పరిచాయి. మిగతా 90 శాతం మంది దళితులు మునుపటిలాగే దుర్భర స్థితిలో కొనసాగుతున్నారు. ఆమాటకొస్తే వారు రిజర్వేషన్లు ప్రవేశపెట్టక ముందు కంటే ఎక్కువ దుర్భర స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రిజర్వేషన్లు వారికి సాధికారికతను కల్పించడానికి బదులు వారిని మరింత వెనక్కి నెట్టేస్తున్నాయి. రిజర్వేషన్లు అంతకంతకూ అతి తక్కువ మందికే ఉపయోగపడుతూ మెజారిటీ దళితులకు ఆరోగ్యం విద్య వంటి కీలకాంశాలను దూరం చేస్తున్నాయి. వాళ్లు రిజర్వేషేన్లు పొందేందుకు కావలసిన అర్హతను పొందే స్థితిలో కూడా లేరు. తత్ఫలితంగానే ఐఐటి, ఐఐఎం మొదలైన విద్యా సంస్థల్లో రిజర్వేషన్‌ సీట్లన్నీ ఖాళీగా వుండిపోతున్నాయి. మధ్యతరగతి దళితుల సంఖ్య ఆ ఖాళీలను పూరించేంత స్థాయిలో లేదు. వారికి వాటిలో ప్రవేశించే సామర్థ్యం లేదు. రిజర్వేషన్లు ఒకవిధంగా తొలితరం దళితులకు మాత్రమే ఉపయోగపడ్డాయి. కానీ ఆ రిజర్వేషన్ల వర్తింపు ఎంతకాలం, ఏమేరకు లాభం చేకూర్చాయన్నది ప్రశ్నార్థకమే. ఒక దళిత బిడ్డకు చిన్నతనంలో రిజర్వేషన్లు కలిగించే మానసిక హాని ఆతరువాత కాలంలో అతనిని మేధోపరంగా ఎంతో కృంగదీస్తున్నట్టు వారి పనితీరువల్ల స్పష్టమవుతోంది. రిజర్వేషన్ల వల్ల పరిపాలనలో దళిత భాగస్వామ్యం పెరిగి తద్వారా దళిత ప్రజాబాహుళ్యానికి మేలు జరుగుతుందనుకున్న అంబేడ్కర్‌ ఆశలు ఈ రెండు రకాలలోనూ నెరవేరలేదు. ఆయన తన జీవితకాలంలోనే ఈ విషాదాన్ని గుర్తించారు. సామాన్య దళితులు ఎదుర్కొన్న ప్రతి సంక్షోభంలోనూ ఇది వ్యక్తమయింది. నేను రాసిన 'ఖైర్లాంజీ: ఎ స్ట్రేంజ్‌ అండ్‌ బిట్టర్‌ క్రాప్‌, పర్సిస్టెన్స్‌ ఆఫ్‌ కాస్ట్స్‌ పుస్తకాలు దీనిని సవివరంగా వివరిస్తాయి. (మొదటి పుస్తకం ''ఖైర్లాంజీ, ఒక చేదు పాట, మానవ మృగాలు చెలరేగిన నేల'' పేరిట 'మలుపు' ప్రచురణగా తెలుగులో వెలువడింది - అను).

అంతస్తులను కోరుకునే కులాల లక్షణాలను దృష్టిలోపెట్టుకుంటే కుల ప్రాతిపదికతతో కూడిన అస్తిత్వాలు ఎలాంటి ప్రగతిశీల ప్రణాళికలకూ ఉపయోగపడవని స్పష్టమవుతుంది. సామాజిక, సాంస్కృతిక రంగాలలో అస్తిత్వాలు సహజమైనవి, కానీ రాజకీయాల్లో మాత్రం అవి సమస్యాత్మకమైనవి. ప్రగతిశీల రాజకీయాల విశ్వజనీన లక్ష్యాలకు ఈ అస్తిత్వాలు ఏమాత్రం దోహదంచేయవు. దళితుల వంటి ప్రజల విముక్తిని కోరుకునేవాళ్లు దీనిని గుర్తించాలి. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లు గెలిచే (ఎఫ్‌పిటిపి) ఎన్నికల వ్యవస్థ ఈ అస్తిత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తుంది. అవి పాలకవర్గాల ప్రయోజనాలను నెరవేర్చేందుకు ఉద్దేశించినవి తప్ప అణగారిన ప్రజల విముక్తి లక్ష్యాలను నెరవేర్చేందుకు కాదు. అస్తిత్వ రాజకీయాలను శిఖరాగ్రం చేర్చిన బహుజన సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి) బృహత్తర ప్రయోగం అప్పుడే తన పరిమితులను ప్రస్తావించడం మొదలుపెట్టింది. ఆయా కులాల పరిధిలోనే వర్గాలు పుట్టుకురావడం సమకాలీన వాస్తవం. అస్తిత్వాలు కింది తరగతుల వారికి మేలు చేయకుండా ఈ వర్గాలు అడ్డుకుంటాయి. తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు మధ్యతరగతివారికి ఈ అస్తిత్వాలు ఒక ముసుగులా తోడ్పతాయి. దళిత పెట్టుబడిదారుల మాదిరిగానే దళిత మధ్యతరగతివారి వల్ల కూడా కింది తరగతులవారికి కలిగే మేలేమీ వుండదు. పైగా ఈ అస్తిత్వ రాజకీయాల దుష్ఫలితాలనన్నింటినీ అట్టడుగువర్గం వారే భరించాల్సి వస్తుంది. నిజం చెప్పాలంటే గత ఆరు దశాబ్దాలలో దళితులలోని అతి కొద్ది మంది మాత్రమే అభివృద్ధిని సాధించారు. కానీ ఈ అస్తిత్వ అనుబంధం ప్రభావంవల్ల యావత్‌ దళిత సమాజం, వారి సంస్కృతి తిరోగమనానికి గురైంది.

అస్తిత్వాల భారాన్ని దుర్బలులైన గ్రామీణ ప్రాంత దళితులే అత్యాచారాలు, దాడుల రూపంలో ఎక్కువగా భరించాల్సి వస్తోంది. 2013లో దళితులమీద అత్యాచారాల స్థాయి దారుణంగా 40,000కు చేరుకుంది. దేశంలో ప్రతి రోజూ ఇద్దరు దళితులు హత్యకు, ఆరుగురు దళిత మహిళలు లైంగిక దాడికి గురవుతున్నారు. ఇదంతా పోలీసు రికార్డుల ప్రకారం తేలిన లెక్క. దళితుల ఫిర్యాదులను స్వీకరించడానికే నిరాకరించే పోలీసుల వైఖరిని దృష్టిలో పెట్టుకుంటే అసలు లెక్కలు ఇంకా ఏ స్థాయిలో వుంటాయో ఎవరికి వారు ఊహించుకోవలసిందే. దళితుల మీద జరిగే ఈ నేరాలకు శిక్షలుపడే రేటు నామమాత్రం కావడంతో దళితుల మీద నిర్భయంగా దాడులు చేసేందుకు కులోన్మాద శక్తులకు ప్రేరణ లభిస్తోంది. కిల్వెన్మణి మొదలుకుని 1990లలో రణవీర్‌ సేన సాగించిన మారణహోమం వరకూ అన్ని దారుణాలలో నేరస్తులంతా శిక్షలు లేకుండా బయటపడ్డారు. ఈ ధోరణి పట్ల దళితుల నుంచి సంఘటితంగా పలాంటి ప్రతిఘటనా రావడం లేదు. స్వప్రయోజనపరులైన దళితుల నాయకులు తమ వ్యక్తిగత స్వార్థం కోసం పాలక పక్షాలకు ఊడిగం చేయడంలోనే ఎప్పుడూ తలమున్కలై వుంటున్నారు. తిరుగులేని నూతన ఉదారవాద శక్తి ప్రజల అవకాశాలను వేగంగా కొల్ల గొడుతోంది. ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి సేవలు కూడా చాలామంది దళితులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. వాళ్లు ఎక్కడి నుంచి అయితే ఈమాత్రం స్థాయికి వచ్చారో తిరిగి అక్కడికే నెట్టివేయబడుతున్నారు. అంతకంతకూ విజృంభిస్తున్న హిందుత్వ శక్తులు ఇప్పటికే ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించుకున్నాయి. కుల వ్యవస్థతో సహా ప్రతీదీ ప్రాచీన బ్రాహ్మణ వైభవానికి అనుగుణంగా వుండేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దళిత ప్రతినిధులందరూ అమ్ముడుపోవడం వల్ల రాబోయే రోజుల్లో కుల సమస్య మరింత దారుణంగా వుండబోతోంది.

అను రాసిన ఈ వ్యాసం సమగ్రంగానూ, దళిత అనుకూల దృక్పథంతోనూ వున్నప్పటికీ కులాలకు సంబంధించిన సమకాలీన స్థితిగతులను ప్రస్తావించలేదు. దానివల్ల ఇందులో సూచించిన కార్యాచరణలో పలు లోపాలు కనిపిస్తాయి. వామపక్షానికి దళితులను దూరం చేసిన, తత్ఫలితంగా భారత విప్లవోద్యమంలో కీలకమైన ఈ రెండు శక్తులూ వెనుకబడేట్టు చేసిన 'పునాది-ఉపరితలం' వంటి వామపక్ష పదజాలపు పరిధిని ఈ వ్యాసం అధిగమించింది. కానీ, అదేసమయంలో మరో మూస దళితవాదానికి బలయ్యింది. ఆ మూస దళితవాదం రిజర్వేషన్లను సరిగా విశ్లేషించకుండా ప్రోత్సహిస్తూ, రాజ్యం దయాధర్మాన్ని కోరుకుంటూ దళితులకంటే పాలక వర్గాలకే ఎక్కువ సేవచేస్తోంది. ఆశించిన విధంగానే ఈ వ్యాసం ఆయా కులాల్లోని శ్రామిక వర్గం పట్ల సంఘీభావాన్ని కనబరిచింది. అయితే కేవలం చేయవలసిన, చేయకూడని పనుల జాబితాతో లక్ష్యాన్ని ఎలా సాధించవచ్చో పేర్కొనలేదు. దళిత - వామపక్ష ఉద్యమాల మధ్య వున్న తేడాకు కారణాలను లోతుగా విశ్లేషించకుండా; దళితులు మార్క్స్‌ కంటే మనువు వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నారో తెలుసుకోకుండా;   సమకాలీన కులాల స్థితిగతులను పరిగణనలోకి తీసుకోకుండా కుల నిర్మూలనకు కార్యాచరణ పథకాన్ని రూపొందించడం సాధ్యమయ్యే పనికాదు. అంతమాత్రాన అను రాసిన ఈ వ్యాసం ప్రాముఖ్యత ఏమీ తగ్గదు. నికృష్టమైన కుల వ్యవస్థ నిర్మూలించబడాలని బలంగా కోరుకునే వారికి ఆయా సమస్యలపై ఆలోచింపజేసేందుకూ, విప్లవ పోరాట సిద్ధాంతాన్నీ ఆచరణనూ సుసంపన్నం చేసేందుకూ ఈ రచన తగిన భావజాలాన్నీ, వేదికనూ అందిస్తుంది. భారతీయ కులాలలోని సంక్లిష్టతను గుర్తించి ఎప్పుడో 1944లోనే స్వయానా డి.డి.కొశాంబీయే 'భారతీయ కులాలపై ఎవరు సాధారణ సూత్రీకరణలు చేసినా అది వైరుధ్యాలతో కూడి వుంటుందని' అన్నారు. అను ఇప్పుడు గనక జీవించి వుంటే ఇందులోని కొన్ని అంశాల విషయంలో పునరాలోచించుకునేవారనీ, తన సిద్ధాంతాన్ని ఆమేరకు సవరించుకునేవారనీ నేను నమ్ముతున్నాను. ఆమె ఒక ఆదర్శప్రాయమైన, నిజమైన మార్క్సిస్టు, విప్లవకారిణి. ఆమె మార్క్సిజాన్ని లిఖిత పిడివాదంగా కాకుండా, ఒక సజీవ శాస్త్రంగా పరిగణించారు.

- ఆనంద్‌ తెల్‌తుంబ్డే
బి-243, ఐఐటి, ఖరగ్‌పూర్‌, 
10 డిసెంబర్‌ 2014

భారతదేశంలో కుల సమస్య
రచన : అనురాధ గాంధి
తెలుగు అనువాదం : కె. సురేష్


ముందుమాట:  ఆనంద్ తెల్ తుంబ్డె 
తెలుగు అనువాదం : ప్రభాకర్ మందార

ప్రచురణ : 
మలుపు, 
2-1-1/5, నల్లకుంట
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం
ఇ మెయిల్: malupuhyd@gmail.com
155 పేజీలు , ధర : రూ. 120/

    

Monday, February 2, 2015

డా.బి.ఆర్.అంబెడ్కర్ మనవడు ఆనంద్ తెల్ తుంబ్డే రాసిన ముందుమాట:

భారతదేశంలో కుల సమస్య

కామ్రెడ్ అనురాధ గాంధీ "భారతదేశంలో కుల సమస్య" పుస్తకానికి
డా.బి.ఆర్.అంబెడ్కర్ మనవడు ఆనంద్ తెల్ తుంబ్డే రాసిన ముందుమాట:
"కులాలను నిర్మూలించాలంటే ముందు వాటిని అర్ధం చేసుకోవాలి "
ఈరోజు (01-02-15) నమస్తే తెలంగాణలో సంక్షిప్తంగా వచ్చింది.

చదవండి:
http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=278507&boxid=189791648

ఈ పుస్తకాన్ని "మలుపు" ప్రచురించింది.
(malupuhyd@gmail.com)

కె.సురేష్ అనువాదం చేసారు.

కాకపోతె ఈ ముందుమాటను మాత్రం నేను అనువాదం చేసాను.