ఆపన్నులకు "అభయ" హస్తం !
---------------------------------
ఎంతైనా అమ్మ అమ్మే. నాన్న నాన్నే!
పేగు బంధం తర్వాతే ఏదైనా, ఎవరైనా!
బిడ్డ కడుపులో పడ్డప్పుడు అరుణ కూడా అందరు తల్లుల్లాగే ఎంతో మురిసిపోయింది. పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో అందమైన కలలు కన్నది. అయితే జన్యులోపమో, కాలుష్య
భూతమో కల్తీ మందుల ప్రభావమో - కారణం తెలియదు కానీ ఆమెకి శారీరక సవాళ్లను ఎదుర్కొనే పాప జన్మించింది. ముఖం చంద్రబింబంలా ఎంతో అందంగా వున్న ఆ పాపకి
ఎడమ కాలు - మోకాలు వరకే పెరిగి ఆగిపోయి వుంది. అలాగే ఎడమ చేయి బొటన వేలు తప్ప మిగతా నాలుగువేళ్లూ ఒకే వేలుగా కలగలసివున్నాయి.
అసలే పేదరికం, దానికి తోడు ఈ సవాళ్లు ... ఏమిటి నాకీ పరీక్ష అని మదన పడుతుండగానే అరుణకు మరో దెబ్బ తగిలింది. 'ఆడపిల్లను కనడమే కాకుండా ఈ లోపాలు కూడానా. నువ్వూ వద్దు నీ బిడ్డా వద్దు' అంటూ భర్త దుర్మార్గంగా ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. గోరు చుట్టు మీద రోకటి పోటు అంటే ఇదే.
అయినా అరుణ అధైర్య పడలేదు. పెద్దగా చదువుకోకపోయినా ఆమెకు కావలసినంత గుండెధైర్యం వుంది. తన బిడ్డకు పుట్టుక నుంచే సవాళ్లు వుండవచ్చు. కానీ లోకంలో ఎంతమంది ఏలోపాలూ లేకుండా పుట్టి ఆ తరువాత ఏ రోడ్డు ప్రమాదానికో గురై వికలాంగులుగా మారడంలేదు? అప్పుడైనా చేసేదేముంటుంది? జీవితం అంటేనే ఒక నిరంతర పోరాటం. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగితేనే బతుకు అని తనకు తాను ధైర్యం చెప్పుకుంది. కన్నీళ్లు తుడుచుకుని, తన బిడ్డకు అన్నీ తానే అయి జీవన సమరాన్నిసాగిస్తోంది. ఇప్పుడు ఆమె బిడ్డ 'ఇందిర'కు పదమూడేళ్లు. చక్కగా ఎనిమిదవ తరగతి చదువుకుంటోంది. వాళ్లు హైదరాబాద్‌లోని ఆస్మాన్‌గఢ్‌లో వుంటున్నారు.
మొన్నీమధ్య ''అభయ'' అనే స్వచ్ఛంద సంస్థ ఇందిరకు ప్రత్యేకంగా తయారు చేయించిన కృత్రిమ కాలును అందించింది. అప్పుడు తీసినవే ఈ చిత్రాలు.
ఆ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి చేవూరి రామకృష్ణ, వారి శ్రీమతి కళారాధ తమ పదవీవిరమణ అనంతరం మరికొందరు మిత్రులతో కలసి 2007లో ''అభయ''ను (రిజిష్టర్డ్ నెం. 1788) స్థాపించారు. నిరుపేద వికలాంగులకు (ఫిజికల్లీ ఛాలెంజ్డ్/ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్‌కు) తమకున్న పరిధిలో కృత్రిమ అవయవాలు, ఊతకర్రలు, వీల్ చైర్లు,
హియరింగ్ ఎయిడ్స్ వంటివి ఉచితంగా అందిస్తున్నారు. కొందరు వికలాంగ విద్యార్థులు చదువుకునేందుకు ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు.
చేవూరి రామకృష్ణ హైదరాబాద్‌లోని వికలాంగుల కార్పొరేషన్‌లో ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రత్యేకించి నిమ్స్ ఆసుపత్రిలోని ఆ కార్పొరేషన్ యూనిట్‌లో పని చేస్తున్నప్పుడు ఆయన నిరుపేద వికలాంగుల కడగళ్లని కళ్లారా చూశారు. అందుకే పదవీ విరమణ అనంతరం తన శేష జీవితాన్ని కూడా వికలాంగుల సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయానికి కుటుంబ సభ్యులందరి నుంచీ పరిపూర్ణ మద్దతు లభించింది. వారి పిల్లలిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. అభయకు ప్రాథమిక పెట్టుబడిని వాళ్లే అందించారు. ఆ తరువాత కొందరు ఎన్‌ఆర్‌ఐలు, బంధుమిత్రులు, దాతలు ముందుకు వచ్చారు.
ప్రస్తుతం అభయ కార్యాలయం సికిందరాబాద్ గాంధీ హాస్పిటల్‌లోని ''ఆర్టిఫిషియల్ లింబ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్''లో పనిచేస్తోంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చినప్పుడు వారి చేతుల మీదుగానే నిరుపేద వికలాంగులకు కృత్రిమ అవయవాలను ప్రదానం చేయిస్తున్నారు. దూరప్రాంతంలో వున్న దాతలు గాంధీ ఆసుపత్రివరకూ రాలేకపోతే వారు సూచించిన వారిచేత ప్రదానం చేయిస్తున్నారు.
గత నెల 12న ఇందిరకు ప్రదానం చేసిన ప్రత్యేకమైన కృత్రిమ కాలు దాతలు స్వయంగా రామకృష్ణ కళారాధ దంపతులే కావడం విశేషం. వారు ఇందిరకు ఆ కృత్రిమ కాలును నా చేతుల మీదుగా అందించాలనుకోవడం నాకు దక్కిన అనూహ్య గౌరవం. నిజానికి అభయతో గానీ, వారి సేవా కార్యక్రమాలతో గానీ నాకు ఎలాంటి అనుబంధం లేదు. అభయను సందర్శించడం కూడా నాకు ఇదే తొలిసారి. ముందు నేను చాలా మొహమాట పడ్డాను. ఆ తరువాత వారి ఆత్మీయతకు శిరసు వంచక తప్పలేదు. నాకున్న అర్హతల్లా శ్రీమతి చేవూరి కళారాధ గారితో పాటు ఆర్టీసీ కేంద్ర కార్యాలయంలో సహోద్యోగిగా పనిచేసి వుండటమే.
లోకంలో ఎటు చూసినా స్వార్థం, సంకుచితత్వం, అమానవీయత రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ''సొంత లాభం కొంత మానుక పొరుగువాడికి తోడుపడవోయ్'' అన్న నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ దంపతులు ఇంత మహత్తరమైన సేవా కార్యక్రమాన్ని తమ భుజస్కంధాలపై వేసుకోవడం అబ్బురమనిపించింది.
ఇప్పటి వరకూ అభయ దాదాపు 300 మందికి పైగా అమూల్యమైన సేవలు అందించింది. అభయకు సంబంధించిన పూర్తి వివరాలను, సేవలను ఈ కింది సైట్లలో చూడవచ్చు.
1)
https://sites.google.com/site/abhayaforyou/
2)
https://www.facebook.com/home.php?sk=group_192592937447633
Phone: +91-9160766014
Email: mailtoabhaya@gmail.com