అశోకుడు ''రహదారులకు ఇరువైపులా చెట్లను నాటించెను'' అని చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ కాకతీయులు ''ప్రజలకోసం తటాకములను నిర్మించిరి'' అని మాత్రం చదువుకోలేదు. ఆంధ్ర వలసపాలకులకు తెలంగాణ పట్ల చిన్నచూపు వుండటం, తెలంగాణా నాయకులకు అస్తిత్వ సోయి లేకపోవడం వల్లనే ఇప్పటివరకూ మన చరిత్రకు మన పాఠ్యపుస్తకాల్లోనే చోటు లేకుండాపోయింది. అశోకుడు నాటించిన చెట్లు ఇప్పుడు ఎక్కడైనా వున్నాయో లేవోగానీ కాకతీయులు తవ్వించిన చెరువులు మాత్రం ఇప్పటికీ కళకళలాడుతున్నాయి, వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్నాయి.
కాకతీయులు ప్రకృతి ప్రేమికులు. చెరువులను తవ్వించడమేకాదు వాటిని పూలతో పూజించారు. బతుకమ్మ పండుగ కాకతీయుల హయాములోనే జగత్‌ప్రసిద్ధి చెందింది.
బతుకమ్మకూ చెరువులకూ మధ్య అవినాభావ సంబంధం వుంటుంది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఆడపడచులు ఆటపాటలతో ఆరాధించి చివరికి చెరువులకే సమర్పిస్తారు. బతుకమ్మ పండుగ తెల్లారి వెళ్లి చూస్తే చెరువుల మీద పూల తివాచీలు పరచినట్టు ముగ్ధమనోహర దృశ్యం కనిపిస్తుంది.
ఒకవిధంగా బతుమ్మ పండుగ చెరువుల పరిరక్షణకు కూడా ఎంతో దోహదం చేసింది.
ఇదంతా ఒకప్పటి మాట. 1956 తరువాత చెరువులను పరిరక్షించకపోవడం అటుంచి ఇష్టారాజ్యంగా కబ్జాలు చేయడం మొదలయింది.
తెలంగాణా అంతటా వందలాది వేలాది చెరువులు భూభకాసురుల చేతుల్లో చిక్కి మటుమాయమైపోయాయి. అట్లాంటి చెరువుల్లో ''మల్లికుంట చెరువు'' కూడా ఒకటి. వరంగల్లులో ఆజం జాహీ మిల్లుకు రెండు కిలోమీటర్ల దూరంలో వుండేది. ఆ చెరువు కట్టమీద నిలబడి చూస్తే ఒక పక్క కనుచూపు మేర నీళ్లు మరో పక్క పచ్చని పొలాలు కనువిందు చేసేవి.
మేం అప్పుడు మిల్ కాలనీలో వుండేవాళ్లం. ఆ చెరువుతో మాది ముప్ఫై ఏళ్ల అనుబంధం. భారీ వర్షాలు పడ్డప్పుడు చెరువులోని చేపలు వరదలో ఎదురీదుతూ మా ఇంటి దాకా వచ్చేవి. పిల్లలంతా కేరింతలు కొడుతూ వాటిని పట్టుకునేందుకు నానా తంటాలు పడేవాళ్లు.
నేను ఆ చెరువులోనే బట్టలు ఉతికే బండలను పట్టుకుని నీళ్లలో కాళ్ళు ఆడిస్తూ ఈత నేర్చుకున్నాను. చెరువులో బట్టలు ఉతికే దృశ్యాన్ని కొంచెం దూరం నుంచి చూస్తున్నప్పుడు బట్ట బండను తాకడం ముందుగా కనిపించేది. దాని శబ్ధం మాత్రం కొన్ని క్షణాలు ఆలస్యంగా వినిపించేది. ఆ విచిత్రం వెనకున్న మర్మం తెలియక ఆశ్చర్యపడుతూ చూస్తుండిపోయేవాళ్లం.
చేపలు పట్టేందుకు వల విసిరే దృశ్యం కూడా అద్భుతంగా అనిపించేది. పెదనాయిన అని పిలుచుకునే మా పక్కింటి హనుమయ్య గారితో అప్పుడప్పుడు చెరువుకు వెళ్లేవాణ్ని. ఆయన వల విసిరి, తర్వాత దానిని దగ్గరకు లాగి అందులో పడ్డ చేపలను బుట్టలో వేస్తుంటే చూడటం గొప్ప అనుభూతి. ఆయన కొడుకు, నా దోస్తు కుమారస్వామి అదే చెరువులో ఈతకొడుతూ కాళ్లకు తీగెలు చుట్టుకుని మరణించడం ఒక విషాదం జ్ఞాపకం.
బతుకమ్మ పండుగనాడు మల్లికుంట చెరువు దగ్గర పెద్ద జాతర జరిగేది. మల్లికుంట చెరువు కంటే భద్రకాళి చెరువు చాలా పెద్దదైనప్పటికీ అక్కడ బతుకమ్మలు పెట్టుకుని ఆడేందుకు తగిన స్థలం లేకపోవడం వల్ల వరంగల్ పట్టణంలోని మహిళలంతా ఎక్కువగా మల్లికుంట చెరువుకే తరలి వచ్చేవారు.
సాయంత్రం మూడు నాలుగు ప్రాంతం నుంచే పీతాంబరాల, బతుకమ్మల ఊరేగింపు మొదలయ్యేది. అప్పటికి మా అమ్మ తీరుబడిగా ఏ సత్తు పిండి చేస్తూనో, బతుకమ్మను పేరుస్తూనో కనిపించేది. దాంతో 'ఇంకా ఎప్పుడు పోదామే' అని నేను నిమిష నిమిషానికి హడావిడి పెట్టడం, 'ఆడోళ్లకు లేని తొందర నీ కెందుకుర' అని అమ్మ విసుక్కోవడం ఓ తీపి గుర్తు.
దూరం నుంచి చెరువు గట్టుకు వచ్చేవాళ్లు త్వరగా వచ్చి చీకటి పడకముందే వెళ్లిపోయేవారు. చెరువు చుట్టపక్కల వున్నవాళ్లు పొద్దుగుంకిన తరువాత తీరుబడిగా వెళ్లి రాత్రి తొమ్మిది పది వరకు ఆడేవాళ్లు. కానీ అక్కడ విద్యుద్దీపాలవంటి ఏర్పాట్లు ఏమీ వుండేవి కావు. బతుకమ్మల మీద వెలిగించే ఒత్తులు, తినుబండారాలూ ఆటవస్తువులూ అమ్మే వాళ్లదగ్గరి గుడ్డిదీపాలు మాత్రమే కాస్తంత వెలుతురునిచ్చేవి.
రాత్రి తిరిగి వస్తున్నప్పుడు పిల్లలు తప్పిపోయారని కొందరు, నగలు పోయాయని మరికొందరు ఆ చీకట్లో శోకాలు పెడుతూ వెళ్తుంటే ఆందోళనగా అనిపించేది. వేలాది మంది మహిళలు పాల్గొనే బతుకమ్మ పండుగ కోసం ప్రభుత్వం కనీసం తుమ్మచెట్లను కొట్టేయించి, కొన్ని వీధి దీపాలనైనా ఎందుకు ఏర్పాటు చేసేదికాదో, అంత నిర్లక్ష్యమెందుకో తలచుకుంటే బాధగా అనిపిస్తుంది.
ఇప్పుడైతే బతుకమ్మను అనాధను చేస్తూ ఆ మల్లికుంట చెరువే మాయమైపోయింది. ఇప్పుడక్కడ చెరువు ఆనవాళ్లు కూడా లేవు.
(నమస్తే తెలంగాణ 6 అక్టోబర్ 2013 బతుకమ్మ సౌజన్యంతో )