Tuesday, August 16, 2011

''కావాలంటే నీ కోసం నా ప్రాణాలిస్తాను... కానీ నా పుస్తకాలను మాత్రం ఇవ్వను!''


    కొంతకాలం కిందట హచ్‌ ఫోన్‌ వాళ్ల వ్యాపార ప్రకటనలు హోరెత్తిస్తుండేవి. వోడా ఫోన్‌లో విలీనం కావడం వల్ల కాలగర్భంలో కలిసిపోయినా ఇప్పటికీ అవి చాలామందికి గుర్తుండేవుంటాయి.

    ఒక చిన్నారి 'పగ్‌' జాతి కుక్కపిల్లతో - ''మీరు ఎక్కడికి వెళ్లినా (మా నెట్‌వర్క్‌) తోడుగా వస్తుంది'' ... ''మీకు సహాయం చేయడమంటే దీనికి మహా ఇష్టం'' వంటి శీర్షికలతో చేసిన ఆ ప్రచారాలు ఎంతో ముచ్చటగా, ఆలోచింపజేసేలా వుండేవి.  హచ్‌ వాళ్ల హోర్డింగులు, టీవీ  ప్రకటనలు చూపు తిప్పుకోనిచ్చేవి కావు.

    ఆ చిన్నారి కుక్కపిల్ల స్నేహపూర్వక విన్యాసాలు చూసినప్పుడల్లా దీనిలాగా సహాయం చేసే గుణం మనుషులందరికీ వుంటే ఎంత బాగుండేదో అనిపించేది.


    పురుషులందు పుణ్య పురుషులు వేరయా (స్త్రీలయందు పుణ్య స్త్రీలు వేరమ్మా?) అన్నట్టు ... అట్లాంటి వాళ్లు మనుషుల్లో లేకపోలేదు. వున్నారు.

    అపకారికి నుపకారం చేసేవాళ్లున్నారు.
    నుపకారికి అపకారం చేసేవాళ్లున్నారు.
    అపకారికి అపకారం - ఉపకారికి ఉపకారం చేసే నిష్టాగరిష్టులున్నారు.
    ఆ జన్మాంతం ఎవరికీ అపకారం, ఎవరికీ ఉపకారం చేయని మహానుభావులున్నారు.
    సహాయం చేసే గుణం లేశమాత్రం లేకపోయినా ఉచిత సలహాలిస్తూ...  క్లాసులు పీకుతూ... తెగ సహాయాలు చేసిపారేస్తున్నట్టు నటించే వాళ్ల్లూ వున్నారు.

    సరే, ఆ గొడవని అట్లా వుంచి అసలు శీర్షిక విషయానికి వస్తాను...
    నేను వరంగల్‌ ఎవివి మల్టీపర్పస్‌ హైస్కూల్లో పన్నెండో తరగతి చదువుతున్నప్పటి సంగతి ఇది. ఇప్పుడు అంతగా కనిపించడంలేదు గానీ - అప్పట్లో సామూహిక అధ్యయనాలు ఎక్కువగా వుండేవి. పరీక్షల భయం నుంచి బయటపడేందుకు నలుగురు ఒకచోట చేరి చదువుకునేవాళ్లు. కాస్త విశాలమైన ఇళ్లున్న సహవిద్యార్థి ఎవరైనా కలసి చదువుకుందాం రా అంటే నా బోటి ప్రశాంతంగా చదువుకునే వాతావరణం లేని బీద విద్యార్థులు ఉత్సాహంగా వెళ్లేవాళ్లు. పనికిమాలిన ముచ్చట్లతో, కాఫీ-టీ  సేవనాలతో చాలా సమయం వృధా అయినప్పటికీ వాటి వల్ల మాకు మేలేజరిగేది. ఇంట్లో కంటే అక్కడ ఎంతో కొంత చదువుకోగలిగేవాళ్లం.


    వార్షిక పరీక్షలకు నెల రోజుల ముందు - కొంతకాలం పరశురామన్‌ అనే నా సహ విద్యార్థి అధీనంలోని  ఇంట్లో నేనూ, రాజేష్‌ అనే మరో మిత్రుడూ కలసి చదువుకున్నాం.  పరశురామన్‌, నేనూ మిల్‌ కాలనీలోనే వుండేవాళ్లం.  పరశురామన్‌ ఫాదరూ మా నాయినా ఆజాం జాహీ మిల్లులో పనిచేసేవారు. కాకపోతే ఆయన ఇంజనీరైతే, మా నాయిన మామూలు కార్మికుడు. చూడ్డానికి మిల్‌ కాలనీ అంతా ఒక్కలాగే కనిపించేది కానీ ఉద్యోగుల హోదాలకు తగినట్టు ఐదు రకాల ... ఎ క్లాస్‌, బి క్లాస్‌, సి క్లాస్‌, డి క్లాస్‌ క్వార్టర్లు... వాటితో పాటు కొన్ని సువిశాలమైన బంగళాలు వుండేవి. పరశురామన్‌ వాళ్లు ఒక బంగళాలో వుండేవాళ్లు.

    అదే మిల్లులో పనిచేసే పరశురామన్‌ వాళ్ల బంధువు ఒకరు మద్రాస్‌లో మరో ఉద్యోగం రావడంతో వెంటనే రాజినామా చేయకుండా తన ఎ క్లాస్‌ క్వార్టర్‌ని వీళ్లకి అప్పగించి వెళ్లి పోయాడు. అందులో మా కంబైండ్ స్టడీ. ఐదు గదులూ, విశాల మైన ఆవరణా, చుట్టూ ప్రహరీ గోడా ... ఆ లంకంత ఇంట్లో మేం ముగ్గురం! ఓహ్‌, ఎంత స్వేచ్ఛగా, ఎంత ఉల్లాసంగా వుండేదో.

    నేనూ, రాజేష్‌ తిండికి తప్ప మా ఇళ్లకు వెళ్లే వాళ్లమే కాదు. పరశురామన్‌ మాత్రం రాత్రి పడుకోడానికి వాళ్ల ఇంటికి వెళ్లిపోయేవాడు. రాజేష్‌, నేనే ఆ ఇంట్లో ఎక్కువ సేపు గడిపేవాళ్లం. ఒకవిధంగా అది మా సొంత ఇల్లుగా మారింది. పరశురామన్‌ తమ ఇంటి నుంచి పెద్ద ఫ్లాస్కులో హార్లిక్స్‌ కలిపిన పాలు తెచ్చేవాడు. తరచూ రకరకాల చిరుతిళ్లను తీసుకొస్తుండేవాడు. అతని జేబుల్లో ఎప్పుడూ నోట్ల కట్టలు కనిపించేవి. మా పంట్లాములకు కూడా జేబులుండేవి (రెండు పక్కలా రెండు, వెనకాల ఒకటి వెరసి మూడు జేబులు) కానీ అవి మాకు డబ్బులు పెట్టుకునేందుకు కాకుండా ఎప్పుడైనా చేతులు దూర్చి పోజులు కొట్టడానికి మాత్రమే పనికొచ్చేవి.

    అప్పట్లో చాలామందికి లాగే మాకూ చుట్టూ నాలుగిళ్లకు వినపడేలాగా పైకి చదివే అలవాటుండేది.  ఆ అలవాటు వల్ల మేం ముగ్గురం మూడు గదుల్లో సెటిలై సీరియస్‌గా చదువుకునేవాళ్లం. (అయినా ఇంకా రెండు గదులు ఖాళీనే). ఎప్పుడైనా కబుర్లు చెప్పుకోడానికి, అతను తెచ్చిన చిరుతిళ్లను తినడానికి మాత్రమే ఒకగదిలో చేరేవాళ్లం.

    మేం టెక్స్‌ట్‌ పుస్తకాలతో కుస్తీ పడుతుంటే పరశురామన్‌ మాత్రం ఎప్పుడూ నోట్‌ పుస్తకాలనే తిరిగేస్తుండేవాడు. అదేంటీ టెక్స్‌ట్‌ పుస్తకాలను చదవవా అని ఒకసారి అడిగితే ఆ అవసరం నాకు లేదు. ట్యూషన్‌లో యిచ్చిన ఈ నోట్స్‌ చదివితే చాలు ఫస్ట్‌ క్లాస్‌ గ్యారంటీ అని మా సార్లు చెప్పారు అన్నాడు. మాకైతే నెలకు మూడు రూపాయల స్కూల్‌ ఫీజు కట్టడమే కనా కష్టంగా వున్న ఆ రోజుల్లో అతను నాలుగువందల యాభై రూపాయల ఫీజు కట్టి ట్యూషన్‌కు వెళ్తుండేవాడు. 

    ''ఏదీ ఒకసారి నోట్స్‌ ఇవ్వవా చూసిస్తాం'' అంటే- ''ఇది మాత్రం అడగొద్దు. నేనివ్వను.'' అని ఖరా కండీగా చెప్పాడు. ''అదేంటి మేం నీ స్టడీస్‌ని ఏమీ డిస్టర్బ్‌ చెయ్యం నువ్వు చదవని సబ్జెక్ట్‌ నోట్సే ఇవ్వొచ్చుకదా'' అంటే - ''డిస్టర్బెన్స్‌ అని కాదు. మా ఫాదర్‌ నాలుగువందల యాభై రూపాలు పెట్టి నన్ను చదివించేది మీకు ఇవ్వడానికి కాదు. వీటిని కాకుండా ఇంకేదైనా అడగండి తెచ్చిస్తాను. వీటిని మాత్రం చచ్చినా ఇవ్వను.'' అని మొహమాటం లేకుండా చెప్పాడు....యమధర్మరాజు  సావిత్రిని  ''ఏదైనా వరంబు కోరుకొనుము ఇచ్చెద'' అంటూనే ''అదియునూ నీ పతి ప్రాణంబు దక్క'' అని మెలిక పెట్టినట్టుగా!

    ఆ క్షణంలో అతను మాకు పరాయివాడిగా అనిపించాడు. ఫ్రెండ్స్‌మి కదా నోట్స్‌ ఇస్తే అతనికొచ్చే నష్టం ఏమిటి? మాకు ఇచ్చినట్టు వాళ్ల నాన్నకి ఎవరు చెప్తారు? ఎంతో మంచి వాడు ఇంత సంకుచితంగా మాట్లాడుతున్నాడేమిటి అని బాధ కలిగింది. కానీ, అనవసరపు వాదనతో మా స్నేహాన్ని చెడగొట్టుకోవద్దు అని ఆ విషయం ఎత్తడం మానేశాం. 

    అతను ఎప్పుడు బయటకెళ్లినా తన నోటు పుస్తకాలని బీరువాలో పెట్టి తాళం వేసుకుని వెళ్లేవాడు. మిగతా అన్ని విషయాల్లో ఎంతో 'దిల్‌దార్‌'గా వుండే అతని ప్రవర్తన ఆ ఒక్క విషయంలో మాత్రం మిత్ర పూరితంగా కాకుండా శత్రుపూరితంగా వున్నట్టు అనిపించేది. ఏం, పుస్తకాలు ఇస్తే ఏమవుతుంది? మాకోసం ఇంత ఖర్చు పెడుతున్నాడు. ఇంత గొప్ప సౌకర్యం కల్పించాడు. ఆ పుస్తకాలు కూడా చదవనిస్తే ఏం పోతుంది? మాకు మంచి మార్కులొస్తే అతనికి వచ్చే నష్టమేంటి? నిజంగా మా బాగును కోరేవాడు చేసే పనేనా ఇది అనిపించేది. 

    ఇలా వుండగా ఒకరోజు వాళ్ల ఇంటినుంచి పిలుపొస్తే హడావిడిలో నోటు పుస్తకాలని అట్లాగే వదిలేసి వెళ్లిపోయాడు పరశురామన్‌.  రాజేష్‌ అంతకు ముందే భోజనానికి వెళ్లాడు. నేనొక్కడినే ఇంట్లో వున్నాను.అతను వెళ్లిపోయాక అప్రయత్నంగా నా దృష్టి ఆ నోటు పుస్తకాల మీద పడింది. వాటి ఆకర్షణశక్తి నన్ను నిలబడనియ్యలేదు. నాలోని చెడు నిద్రలేచింది. తప్పు ...ఒద్దు ...ఒద్దు అనుకుంటూనే వాటిని అందుకుని ఆబగా తిరగేయడం మొదలుపెట్టాను. 

    పరీక్ష పేపర్‌ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన నోట్స్‌ అది. చదువుతుంటే ఎంత హాయిగా, ఎంత సులువుగా వుందో. టెక్స్‌ట్‌ పుస్తకాలకూ - ఆ నోటు పుస్తకాలకూ మధ్య కీకారణ్యానికీ - బృందావన్‌ గార్డెన్‌కీ మధ్య వున్నంత తేడా వుంది. (అప్పట్లో ప్రతి సినిమాలో బృందావన్‌ గార్డెన్‌ కనిపించేది లెండి). ఒక్క నాలుగు రోజులు వాటిని చదవనిస్తే పరీక్ష పేపర్లన్నీ దున్నిపారేయొచ్చనిపించింది. నన్ను నేను మరచిపోయి ఒక సబ్జెక్ట్‌ తరువాత మరో సబ్జెక్ట్‌ నోట్స్‌ని గబగబా తిరగేస్తూ కూచున్నాను. ఎంత సేపయిందో తెలియదు. ఎప్పుడొచ్చాడో గానీ పరశురామన్‌ గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా నా చేతిలోని పుస్తకాలని లాగేసుకుని నన్ను ఒక్క తోపు తోశాడు. ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా వుండే అతనిలో అంత కోపం చూడడం అదే మొదటిసారి.  

    నన్ను అతను అన్న మాటలు మక్కీకి మక్కీగా గుర్తులేవు కానీ వాటి సారాంశం ఏమిటంటే 'అ లగా జనంతో డబ్బున్న వాళ్లు స్నేహం చేయకూడదనీ... తక్కువ కులం వాళ్లని ఎక్కడ వుంచాలో అక్కడ వుంచాలనీ... వాళ్లు ఇటెటు రమ్మంటే ఇళ్లంతా నాదే అంటారనీ... వాళ్ల రక్తంలోనే దొంగబుద్ధి వుంటుందనీ, నైంటీనైన్‌ పర్సెంట్‌ క్రిమినల్సేననీ... జాగ్రత్త అనీ...వాళ్ల నాన్న ఎప్పుడో చెప్పాడట. నా ఫ్రండ్స్‌ అట్లాంటి వాళ్లు కాదు అని తను వాదించాడట. చివరికి మా నాన్న అన్నదే నిజమయింది. నాకు బాగా బుద్ధి చెప్పావు...' 

    నేను నిజంగా ఆ రోజు సిగ్గుతో చచ్చిపోయాను. జీవితంలో అంత గిల్టీగా ఎప్పుడూ ఫీల్‌ కాలేదు. ఇంత చిన్న విషయానికి అతను అంత హర్ట్‌ అవుతాడనీ, అంత రెచ్చిపోతాడనీ నేను ఊహించలేదు. వాటిని చదవడం అంత ఘోరమైన నేరమా? నేను సమాధానం చెప్పబోయినా కొద్దీ అతను మరింత రెచ్చిపోయాడు. దాంతో చేసేదేంలేక తలవంచుకుని సారీ చెప్పి నా పుస్తకాలను సర్దుకుని ఏడుస్తూ మా ఇంటికి వెళ్లిపోయాను. 

    ఆ తరువాత చాలా కాలం మా మధ్య మాటలు లేవు. స్కూల్లో ఎడమొహం పెడమొహంగా వుండేవాళ్లం. అదే నా చిట్టచివరి కంబైన్డ్‌ స్టడీ. పరీక్షలైపోయాయి. ఫలితాలు వచ్చాయి. ఇద్దరం సెకండ్‌ క్లాస్‌లో పాసైనా విచిత్రంగా పరశురామన్‌ కంటే నాకే పదో పదిహేనో మార్కులు ఎక్కువ వచ్చాయి. 

    ఒకరోజు స్కూల్లో టీసీ తీసుకునేటప్పుడు కౌంటర్‌ వద్ద  ఇద్దరం ఎదురుపడ్డాం. నేను చూపులు తిప్పుకుని మౌనంగా నిలబడ్డాను. చాలా ఇబ్బందిగా అనిపించసాగింది. అయితే, ఉన్నట్టుండి అతను దగ్గరకొచ్చి, నా చేయి పట్టుకుని 'సారీ' అన్నాడు. నేను నిర్ఘాంతపోయాను. ''చాలా ఫూలిష్‌గా బిహేవ్‌ చేశాను'' అన్నాడు. ఏమైంది అని ఇతర విద్యార్థులు ఆరా తీస్తుంటే ఏంలేదు అంటూ నన్ను బలవంతంగా టీ తాగుదాం పదా అంటూ పక్కనే వున్న హోటల్‌కి తీసుకెళ్లాడు. చాలాసేపు పశ్చాత్తాప పడ్డాడు. ''తను స్వార్థపరుడు కాదనీ, తనది నలుగురికి సహాయం చేసే మనస్తత్వమనీ, ఆ ఒక్క విషయంలో అంత తెలివితక్కువగా ఎలా బిహేవ్‌ చేశానో తనకే అర్థం కావడం లేదనీ, నాన్న మాటలే తనని మిస్‌గైడ్‌ చేశాయనీ''  పరిపరివిదాలుగా నొచ్చుకున్నాడు  ''నేను చేసింది కూడా తప్పే కదా. నిన్ను ఒప్పించి,  అడిగి తీసుకోవాలి తప్ప అట్లా దొంగతనంగా చదవడం నేరమే కదా'' అని నేను కూడా అతనికి అపాలిజీ చెప్పాను. అప్పటి నుంచీ మళ్లీ మా స్నేహం ఎప్పటిలా చిగురించింది. 

    అతను వరంగల్‌లోనే బిఎస్‌సి చదివాడు. ఆతరువాత వాళ్ల నాన్న రిటైర్‌ కావడంతో మద్రాస్‌కి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి తరచూ ఉత్తరాలు రాసేవాడు. అతను ఎన్ని సార్లు రమ్మన్నా నేను ఆర్థిక సమస్యల వల్లా, అతని తల్లిదండ్రులంటే వున్న బెదురు వల్లా ఒక్కసారైనా మద్రాస్‌ వెళ్లలేకపోయాను. తరువాత పరశురామన్‌ ఉద్యోగరీత్యా త్రివేండ్రం వెళ్లాడు. అక్కడి నుంచి బొంబాయి వెళ్లాడు. బొంబాయి తాజ్‌ మహల్‌ హోటల్‌లో చెఫ్‌గా చాలా కాలం పనిచేశాడు. ఆతరువాత సూరత్‌కీ, అక్కడినుంచి  అహ్మదాబాద్‌కి వెళ్లాడు. ''పెళ్లి చేసుకుంటే స్వార్థం పెరుగుతుంది... స్వేచ్ఛ పోతుంది... కాబట్టి జన్మలో పెళ్లి చేసుకోను'' అనేవాడు. మా ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఆ అంశం మీదనే ఎక్కువగా చర్చ జరిగేది. నేను అతణ్ని కన్విన్స్‌ చేయలేకపోయాను. అతను రకరకాల ఉద్యోగాలు చేశాడు. ఎందరికో సహాయం చేశాడు. కానీ, ఎందుకో ఒకచోట కుదురుగా వుండలేకపోయాడు.  అహ్మదాబాద్‌ నుంచి కొన్నాళ్లు ఉత్తరాలు వచ్చి హఠాత్తుగా ఆగిపోయాయి. నేను ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు లేదు. ఇప్పుడు పరశురామన్‌ ఎక్కడున్నాడో, ఎలావున్నాడో తెలియదు.

Don’t Give a Friend a Fish. Teach Him How To Fish Instead.