Wednesday, June 1, 2011

శత్రువుతో పాతికేళ్ల సహజీనం ....!

మేం విడిపోయి అప్పుడే పదేళ్లవుతోంది...!
మా తెగదెంపుల దశమ వార్షికోత్సవ సందర్భమిది...!!
ఒకటి కాదు రెండు కాదు పాతికేళ్ల సహజీవనం మాది...!
అంత సుదీర్ఘ అనుబంధాన్ని నేను ఎలా తెంచుకో గలిగాను?!

తను సదా నా హృదయంలో నిదురించిన చెలి... మనసున మనసై బ్రతుకున బ్రతుకైన నెచ్చలి... చీకటి మూసిన ఏకాంతంలో నేనున్నాని నిండుగ పలికిన ఆపద్భంధువు... చికాకుతో, ఒత్తిడితో సతమవుతున్నప్పుడు అక్కున చేర్చుకుని ఊరటనిచ్చిన ఆత్మీయురాలు... అలాంటి తనకి దూరమవుతానని నేను కలలో కూడా అనుకోలేదు.

నా తుదిశ్వాసతోనే మా బంధం అంతమవాలి తప్ప - కంఠంలో ప్రాణం వున్నంతవరకూ తనని నేనూ, నన్ను తనూ ఒక్క పూటైనా వదలివుండే ప్రసక్తే లేదని గట్టిగా నమ్మాను.
ఆ నమ్మకం ఎలా వమ్మయింది?
తను నా మిత్రువు కాదు- ఆగర్భ శత్రువు అన్న నిజం నాకు ఎప్పుడు ఎలా తెలిసింది!
ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే అంతా చిత్రమనిపిస్తుంది.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ కాదు. ఆ మాట కొస్తే నాకు తొలిరోజుల్లో తనంటే ఆకర్షణ కాదు కదా వికర్షణ వుండేది.
తనే నా జీవితంలోకి బలవంతంగా చొచ్చుకొచ్చింది. ఆ తర్వాతే నేను తనని ఆరాధించడం మొదలుపెట్టాను. పాతికేళ్లు ఏదో వశీకరణకు గురైనట్టు తన మాయలో పడిపోయాను.

ఇక అసలు విషయంలోకి వస్తే-
గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన వెంటనే నాకు మా వరంగల్‌లోని ఆజం జాహీ మిల్లులో 'టెంపరరీ రిలీవింగ్‌ పూల్‌ క్లర్క్‌' అనే ఉద్యోగం దొరికింది.
ఎవరైనా రెగ్యులర్‌ క్లర్కు సెలవు పెడితే వెళ్లి ఆ స్థానంలో పనిచేయాలి. లేదంటే ఇంటికి వెళ్లిపోవాలి. అదీ ఉద్యోగం. ఐదేళ్లు చేశానక్కడ.

దాదాపు ఐదువేల మంది కార్మికులు, నూటాయాభై మంది క్లర్కులూ వుండేవాళ్లు. మరో పదివేల కుటుంబాలన్నా పరోక్షంగా ఆ మిల్లు మీద ఆధారపడి బతికేవి. ఆసియాలోనే అతిపెద్ద కాంపోజిట్‌ బట్టల మిల్లు. నిజాం కాలం నాటిది. అనేక దశాబ్దాలపాటు కళకళలాడిన ఆ మిల్లు ఎన్‌టీసీ అధీనంలోకి వెళ్లాక అవినీతి వైరస్‌కు గురై జబ్బుపడ్డది. అనేక గద్దలు, రాబందులు మిల్లును నిలువునా పీక్కు తిన్నాయి. ఇప్పుడు ఆ మిల్ల్లు లేదు, మిల్లునూ, మిల్లు కాలనీనీ నేలమట్టం చేసి ప్లాట్లుగా కోసి అమ్మి పారేసింది ప్రభుత్వం. అదో పెద్ద కథ. ఆ కధతో ఈ కథకు సంబంధం లేదు కాబట్టి దాన్ని ఇంతటితో వదిలేద్దాం.

అక్కడ జనరల్‌ షిఫ్టలో ఎక్కువ మంది క్లర్కులు, సెకండ్‌, థర్డ్‌ షిప్ట్‌లో తక్కుమంది క్లర్కులు పనిచేసేవారు. నాది టెంపరరీ ఉద్యోగం కాబట్టి అన్ని షిఫ్టుల్లో, అన్ని ఖాతాల్లో (డిపార్ట్‌మెంట్లలో) పనిచేయాల్సి వచ్చేది. మూడో షిఫ్టు రాత్రి పదకొండు నుంచి ఉదయం ఏడు వరకు వుంటుంది. తెల్లవారే వరకూ నిద్రని ఆపుకోవాలి కాబట్టి పదేపదే టీలు తాగేవాళ్లం. టీ సీటు దగ్గరకే వచ్చేది. స్పెషల్‌ టీ కావాలనుకున్నప్పుడు మాత్రం కాంటీన్‌కు వెళ్లేవాళ్లం. అప్పుడు కప్పు టీ ఐదు పైసలే.... టైపింగ్‌ తప్పు కాదు నిజంగా ఐదే ఐదు పైసలు. టీ తాగగానే దాదాపు ప్రతి ఒక్కరూ బయటికి వెళ్లి సిగరెట్‌ తాగేవాళ్లు. (కొందరు బీడీలు, చుట్టలు కాల్చేవాళ్లు). టీకీ, సిగరెట్‌కీ ఆ అవినాభావ సంబంధం ఏమిటో....!

ఆజంజాహీ మిల్లు పొగ గొట్టమే తెల్లరంగులో ఒక పెద్ద కింగ్‌ సైజ్‌ సిగరెట్‌లా వుండేది.
మిల్లులో ... టాయిలెట్లలో, ఆవరణలోని చెట్ల కింద ఎక్కడ చూసినా కుప్పలు కప్పలుగా బీడీలు, సిగరెట్‌ పీకలే. పొగతాగనివాళ్ల సంఖ్య వేళ్ల మీదుండేది.

నలుగురైదుగురు క్లర్కులం టీ తాగాక ఖాతాకు కాస్త దూరంగా వుండే ఆఫీసు గదిలో తలుపులు పెట్టుకుని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూచునేవాళ్లం. అక్కడ సిగరెట్‌ కాల్చకూడదు కాబట్టి ఎవరూ చూడకుండా తలుపులు మూసేసేవారు. ఆఫీసర్లు, హెడ్‌ క్లర్కులూ వుండరు కాబట్టి రాత్రి షిఫ్ట్‌ ఎంతో స్వేచ్ఛగా అనిపించేది. నాకు అప్పటికి సిగరెట్‌ కాల్చే అలవాటు లేదు. తలుపులు మూసిన గదిలో మిత్రులు వదిలే పొగతో నాకూ సిగరెట్‌ తాగినంత పనయ్యేది.

అంతేకాదు ఆరోజుల్లో థియేటర్లలో జనం దర్జాగా సిగరెట్లు కాలుస్తూ సినిమా చూసేవాళ్లు. ప్రొజెక్టర్‌ వెలుగులో తెల్లని పొగ మేఘాలు తెరమీద బొమ్మలతో పాటు తేలియాడుతుండేవి. హాలు నుంచి బయటికి వచ్చాక చూసుకుంటే బట్టలు పొగచూరి కంపు కొట్టేవి. ఆతర్వాత ధియేటర్లలో పొగ తాగరాదు అన్న నిషేదం అమలు లోకి వచ్చింది. అయినా కొత్తలో కొందరు సినిమా చూస్తూ రహస్యంగా సిగరెట్‌ తాగడం.... మఫ్టీలో వున్న పోలీసులు వాళ్లని పట్టుకుని దొంగల్ని తీసుకుపోయినట్టు బయటకు తీసుకుపోవడం... అలా కొన్ని రోజులు సాగింది.

అట్లాగే మా ఇంట్లో మా నాన్న తెగ బీడీలు కాల్చేవాడు. ప్రతి నెల సరుకుల జాబితాలో రెండో మూడో పెద్ద కోహినూర్‌ బీడీల పాకెట్లు విధిగా వుండేవి. ఆయన ప్రంఢ్స్‌ వచ్చినప్పుడు వాళ్లు కూడా మా ఇంట్లోనే నాలుగు గోడల మధ్య కూచుని మా ముందే బీడీలు కాల్చేవాళ్లు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే ఆ రోజుల్లో ప్రత్యక్షంగా పొగ తాగకపోయినా ప్రతి ఒక్కరూ ఇప్పటికంటే ఎక్కువగా పాసివ్‌ స్మోకింగ్‌కు గురైయ్యేవాళ్లు.

నైట్‌ షిఫ్ట్‌లో మిత్రులు నాకు పదే పదే సిగరెట్‌ ఆఫర్‌ చేసేవారు. చాలా రోజులు నిరాకరిస్తూ వచ్చాను. పాసివ్‌ స్మోకింగ్‌ కారణంగా ఆ పొగ వాసన అంటేనే ఎలర్జీగా వుండేది . ''అరె ఏమయా ఆడపిల్లలాగ సిగ్గుపడ్తున్నవ్‌. ఇయ్యాల రేపు ఆడోళ్లు కూడా తాగుతున్నరు. అన్నిట్ల వుండాలె. అన్ని చూడాలె. మడిగట్టుకుని కూచుంటె ఎట్ల. రోజు తాగమంటున్నమా?'' అంటూ సీనియర్లు సూటిపోటి మాటలతో రెచ్చగొట్టేవాళ్లు. చివరికి ఒకరోజు రాత్రి ఓ బలహీన క్షణాన మొదటి సిగరెట్‌ పెదాల మధ్యకు వచ్చింది. తొలి అనుభవం చాలా పేలవంగా, వెగటుగా అనిపించింది. ఏముంది దీన్లో ... ఎందుకు ఇంత మంది దీనికి బానిసలవుతున్నారు అనుకున్నాను.

''సిగరెట్‌ పొగను నోటితో పీల్చి ముక్కుతో వదలాలి. అప్పుడు తెలుస్తుంది దాన్ల మజా...''
అదో ఛాలెంజ్‌ నాకు.
కొత్తలో ఆ ప్రయత్నం చేసి నప్పుడల్లా పొగ నషాళానికి అంటి ఉక్కిరి బిక్కిరి అయ్యేది. కళ్లల్లోంచి నీళ్లొచ్చేవి. ఓ పది పదిహేను సిగరెట్లు తగలేసిన తర్వాత గానీ నాకు పొగను ముక్కులోంచి వదలడం చాతకాలేదు. అలా అలా నెమ్మదిగా ఆ ఊబిలో కూరుకుపోయాను.
అప్పటి నా అభిమాన హీరో నాగీశ్వరరావు ఎవర్ గ్రీన్ 'దేవదాసు' మొదలుకుని అనేక సినిమాల్లో స్టైల్‌గా సిగరెట్‌ తాగిన దృశ్యాల ప్రభావం కూడా నా మీద బాగా పనిచేసింది.

ఒక మిత్రుడు సిగరెట్‌ పొగను గాలిలో రింగులు రింగులుగా వదిలేవాడు. ఆఫీసు గదిలో ఫాన్‌ ఆపి అతను సిగరెట్‌ పొగతో రింగులు సృష్టించడం అవి నెమ్మదిగా విస్తరిస్తూ గాలిలో కలసిపోవడం ఓ అద్భుత దృశ్యం. నేను కూడా అట్లా రింగులు సృష్టించాలని చాలా చాలా ప్రయత్నించాను. కానీ పాతికేళ్లయినా ఆ విన్యాసాన్ని సాధించలేకపోయాను... అది వేరే విషయం.

నేను ఇతర్లలా సిగరెట్‌కు బానిసను కాను, కాబోను అనే అనుకున్నాను మొదట్లో.
నైట్‌ షిఫ్టులో మిత్రులతో తప్ప బయట తాగనని కఠోర నిర్ణయమే తీసుకున్నాను.
సిగరెట్‌ నాకు తాత్కాలిక హాబీ మాత్రమే తప్ప వ్యసనం కాదనే భావించాను. ఎప్పుడంటే అప్పుడు నేను అవలీలగా సిగరెట్‌ మానేస్తాను అని అతి విశ్వాసానికి పోయాను.

బహుశా సిగరెట్‌ తాగడం మొదలుపెట్టిన కొత్తలో ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటారేమో.

ఆజంజాహీ మిల్లు ఉద్యోగం వదిలి ఆర్టీసీలో చేరి హైదరాబాద్‌ వచ్చాక ఇక నా సిగరెట్‌ వ్యసనానికి అడ్డనేదే లేకుండా పోయింది. అంతకు ముందు తాగాలనిపించినప్పుడల్లా ఒకే ఒక్క సిగరెట్‌ కొనుక్కుని తాగేవాణ్ని. అట్లాంటిది హైదరాబాద్‌ వచ్చాక జేబులో సిగరెట్‌, అగ్గిపెట్టెలు పెట్టుకోవడం మూడొచ్చినప్పుడల్లా కాల్చడం మొదలయింది... రూంలో కూడా కావలసినన్ని సిగరెట్‌ పెట్టెలు స్టాక్‌ వుంచుకునేవాణ్ని. ఒక దశలో నా తిండి ఖర్చుకంటే టీ సిగరెట్ల ఖర్చే ఎక్కువయింది.

ఆ తర్వాత పెళ్లయింది. ఒక గది ఇంటి లోంచి రెండు గదుల ఇంటిలోకి మారాం. ఖర్చులు పెరగడం వల్ల రోజూ కాల్చే సిగరెట్ల సంఖ్య తగ్గింది. పొగ వాసన పడక శ్రీమతి ఇబ్బంది పడుతుంటే ఇంట్లో కాకుండా వీధి అరుగు మీద కూర్చుని సిగరెట్‌ కాల్చి ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేవాణ్ని. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సిగరెట్‌ మానేద్దామని నాలుగైదు సార్లు ప్రయత్నించాను కానీ ఎప్పుడూ రెండు మూడు రోజులకు మించి మానేయలేకపోయాను. ఒకే ఒక్కసారి అనుకుంటా ఓ ఇరవై రోజుల పాటు మానేశాను కానీ ఆ తర్వాత మళ్లీ షరా మామూలే. సిగరెట్‌ కాల్చకపోతే తోచేది కాదు. పిచ్చెత్తినట్టుండేది.

ఇద్దరు పిల్లలు పుట్టాక ఒక్క జీతంతో ఇల్లు గడవడం మరింత కష్టం అయింది. దాంతో అదనపు ఆదాయం కోసం ఏదో ఒక పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేయాల్సి వచ్చేది. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా నేను సిగరెట్‌ ను మాత్రం వదులుకోలేకపోయాను. జేబులో డబ్బులు లేనప్పుడు నలిపేసిన సిగరెట్‌ పీకల్ని మళ్లీ వెలిగించి రెండు మూడు దమ్ములు లాగిన రోజులున్నాయి. పాతిక సంవత్సరాలపాటు సిగరెట్‌ అలా నన్ను విడవకుండా అంటిపెట్టుకుని వుంది. పైగా అది నా కష్టాల్లో పాలు పంచుకుంటున్నట్టు, నేనున్నానని ఉపశమనం కలిగిస్తున్నట్టు, ఆత్మస్థైర్యాన్నిస్తున్నట్టు ఓ పిచ్చి ఫీలింగ్‌. ఇంక ఎట్లా మాన్తాను? అనేకసార్లు ఖళ్‌ ఖళ్‌ మని దగ్గుతూ కూడా సిగరెట్‌ని ముద్దాడుతూనే వచ్చాను.

సిగరెట్‌ స్మోకింగ్‌ ఈజ్‌ ఇంజూరియస్‌ టు హెల్త్‌....
సిగరెట్‌ తాగితే ఊపిరితిత్తుల కాన్సర్‌ వస్తుంది....
ఒక్క సిగరెట్‌ వల్ల ఏడు నిమిషాల ఆయుర్దాయం తగ్గిపోతుంది....
ఏటా ఇన్ని లక్షల మంది అకాల మృత్యువుకు గురవుతున్నారు... వంటి హెచ్చరికలూ, వార్తలూ, సమాచారం ఏదీ నా మైండ్‌ మీద పనిచేయలేదు.

సిగరెట్‌ ఈజ్‌ మై బెస్ట్‌ ఫ్రెండ్‌.... దట్సాల్‌ !

ఇలా వుండగా ఒకసారి రెండు కుటుంబాలవాళ్లం కలసి తిరుపతి వెళ్లాం. కొండమీద సిగరెట్లు దొరకవు కాబట్టి ముందు జాగ్రత్తగా ఓ నాలుగు సిగరెట్‌ పెట్టెలు వెంట తీసుకెళ్లాను. ఒకరోజు వుండి దర్శనం చేసుకుని వద్దామని బయల్దేరాం. కానీ అది అన్‌సీజన్‌ అవడం వల్ల దానికి తోడు అక్కడక్కడా భారీ వర్షాల కురవడం వల్ల అప్పుడు తిరుమలలో ఏమాత్రం రద్దీ లేదు. ధర్మదర్శనం కూడా మంత్రులకు, విఐపీలకు అయినట్టు శీఘ్ర దర్శనం అవుతోంది. ఏ పూజకైనా టికెట్లు సులువుగా దొరుకుతున్నాయి. కాటేజీలు, క్యాంటీనూ అన్నీ ఖాళీఖాళీగా వున్నాయి. దాంతో మా ఒక రోజు యాత్ర మూడు రోజులకు పెరిగింది.

అందరూ రోజుకు మూడు పూటలా తనివితీరా దర్శనం చేసుకుంటున్నారు. ఏవేవో పూజలు చేయిస్తున్నారు. నేను పెద్ద భక్తుణ్ని ఏమీ కాదు. ఒకసారి దర్శనం చేసుకుని వచ్చాక మళ్లీ రానని కాటేజీలోనే వుండిపోయాను.

అప్పుడు ఏదో చిన్న అనువాదం చేయాల్సిన (జాబ్‌ వర్క్‌) పుస్తకాన్ని కూడా వెంట తీసుకెళ్లాను. ఆ పనిచేసుకుంటూ కూచున్నాను. తీసుకెళ్లిన సిగరెట్లు ఒక్క రోజులోనే అయిపోయాయి. రెండో రోజునుంచీ సిగరెట్ల కోసం వేట... పదిమందిని అడిగితే ఒక్కరి దగ్గర అతి రహస్యంగా ఒకటో రెండో ఏవో బ్రాండ్‌ సిగరెట్లు రెట్టింపు ధరకు దొరికేవి. సిగరెట్లు దొరకనప్పుడు బీడీలు తీసుకునేవాణ్ని. అవీ లేనప్పుడు గుట్కా పాకెట్లు కూడా. అలా రెండు రోజులు ఏది పడితే అది తాగి, గుట్కాలు (జీవితంలోనే మొదటిసారి) తిని మొత్తం నా ఆరోగ్యాన్ని గుల్ల చేసుకున్నాను. కొండ దిగే సమయానికే నాకు ఆయాసం, దగ్గు ఎక్కువయింది. హైదరాబాద్‌ చేరేసరికి మాట పడిపోయింది. ఏంత గట్టిగా అరవబోయినా గుసగుస శబ్ధం తప్ప నోట్లోంచి మాట బయటికి రావడం లేదు. ముక్కుమూసుకు పోయి ... నోటితో కూడా ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. నేరుగా హాస్పిటల్‌కు వెళ్లాను. డాక్టర్‌ చాలా సీరియస్‌గా వుంది పరిస్థితి అన్నారు. ఏడు రోజుల పాటు రకరకాల చికిత్సల అనంతరం గానీ మామూలు మనిషిని కాలేకపోయాను.
అంతే...!

పాతికేళ్లలో మొట్టమొదటిసారిగా సిగరెట్‌ నా శత్రువు అన్న భావన కలిగింది.
సిగరెట్‌ నా బెస్ట్‌ ఫ్రెండ్‌ కానే కాదు అన్న వాస్తవం తెలిసి వచ్చింది.
అదే ఈ వ్యసనంలో కీలకమైన మలుపు.
మిత్రుణ్ని వదులుకోవడం కష్టం కానీ శత్రువును వదులుకోవడం ఏం కష్టం?
ఈ విధంగా పదేళ్ల క్రితం సిగరెట్‌తో నా దోస్తీ కాస్త దుష్మనీగా మారింది.
పాతికేళ్ల మా ఫాల్స్‌ రిలేషన్‌కి పర్మనెంట్ గా తెరపడింది.

................................................................................................

ఈ దిగువ కార్టూన్ జయదేవ్ గారిది . వారికి నా కృతజ్ఞతలు.
మిగతా చిత్రాలు గూగుల్ నుంచి సేకరించినవి.