తారు రోడ్డు మీద అరవై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది లారీ. స్టీరింగ్ ముందు కూచుని వున్న శ్రీకాంత్ చూపులు నిశ్చలంగా వున్నా అతని మనసు మాత్రం ప్రశాంతంగా లేదు.
చెల్లెలి పెళ్లి చూపులంటూ డ్రైవర్ ఆరోజు పన్లోకి రాలేదు. కాలుకు దెబ్బతగిలి బాధపడ్తున్న క్లీనర్‌ని తనే వద్దని పంపించేశాడు. సమయానికి ఇంకో వ్యక్తి దొరక్కపోవడంతో తానే ఒంటరిగా బయల్దేరవలసి వచ్చింది.
డ్రైవింగ్ తనకేం కొత్తకాదు. లారీ మంచి కండిషన్లో వుంది. ఈమధ్యే టైర్లు మార్చాడు. దార్లో ట్రబులిస్తుందన్న బెంగలేదు. ఎటొచ్చీ వాతావరణమే ఆందోళనకరంగా వుంది.
లోడింగ్ చేసేప్పుడు ఆకాశం నిర్మలంగానే వుంది. అప్పటికింకా పడమటి సూర్యుడు గొరువెచ్చని కిరణాలను వెదజల్లుతూనే వున్నాడు. తీరా లారీ స్టార్ట్ చేసేక హఠాత్తుగా ఎక్కడినుంచో కారుమబ్బులు కమ్ముకొచ్చాయి.
వరంగల్ నుంచి నాగపూర్‌కి వెళ్లాలి. అందులోనూ టైం బౌండ్ డెలివరీ అది. సమయానికి సరుకును చేరవేయకపోతే బిల్లులో కోత పడుతుంది.
భూమ్మీద దాడి చేసేందుకు సిద్ధమవుతున్న మేఘసమూహాలు వుండి వుండీ కత్తులు ఝళిపిస్తూ యుద్ధభేరీలు మ్రోగిస్తున్నాయి. అంతలో దూరంగా ఎక్కడో ఫెటీల్మని పిడుగుపడ్డ చప్పుడయింది. శ్రీకాంత్ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. సరిగ్గా అప్పుడే చినుకులు కూడా మొదలయ్యాయి. ప్రంట్ గ్లాస్ మీద పడుతున్న చినుకులు ముత్యాల్లా మెరిసిపోతున్నాయి.
వేగం తగ్గించి వైపర్స్ ఆన్ చేశాడు. చూస్తుండగానే వర్షం ఉధృతమైపోయింది. దేవుడి మీద భారం వేయడం తప్ప ఇప్పుడు తను చేయగలిగిందేంలేదు. మనసును కుదుటపరచుకునేందుకు టేప్‌రికార్డర్ బటన్ నొక్కాడు.
''లాహిరి లాహిరి లాహిరిలో ... ఓహో.. జగమే ఊగెనుగా... తూగెనుగా ...'' స్పీకర్ లోంచి పాట మంద్రస్థాయిలో వినిపించసాగింది. కుండపోత వర్షం వల్ల నిజంగానే లారీని కాకుండా పడవను నడుపుతున్నట్టుగా వుంది. వైపర్లు ఎంత వేగంగా కదులుతున్నా అద్దాలను క్లియర్ చేయలేకపోతున్నాయి.
హుజురాబాద్ సమీపిస్తుండగా ఓ యువతి రెండు చేతులూ గాల్లో ఊపుతూ హఠాత్తుగా రోడ్డు మీదకు వచ్చింది.
శ్రీకాంత్ చప్పున యాక్సిలేటర్ మీంచి కాలు తీసి బ్రేక్‌ని గట్టిగా అదిమాడు. సర్రుమంటూ రెండడుగుల దూరం జారుకుంటూ వెళ్లి ఆగిపోయింది లారీ. మరికాస్తయితే ఆమెను ఢీకొట్టి వుండేదే!
అసలే అసహనంతో వున్న శ్రీకాంత్‌కి ఆ సంఘటనతో మరింత చిర్రెత్తింది. కిటికీ అద్దం పక్కకు జరిప,ి తల బైటకు పెట్టి ''ఏం చావాలని వుందా?'' అనరిచాడు.
''కొంచెం డోర్ తెరవరా ప్లీజ్'' అందామె నడిరోడ్డు మీద నుంచి అతని వైపు వస్తూ.
అంతలో మరో లారీ హారన్ కొడుతూ ఆమె పక్కనుంచే దూసుకుపోయింది. ఆ శబ్దానికి భయపడి కెవ్వుమని అరిచింది.
కుండపోతగా కరుస్తున్న వర్షంలో తడిసి ముద్దైపోతున్న ఆమెను చూసి జాలిపడి ''ఎక్కడికి వెళ్లాలి?'' అనడిగాడు.
''కరీంనగర్'' అందామె.
''ఊ అటునుంచి రా...'' అంటూ ఎడమ పక్క డోర్ తెరిచాడు. ఆమె గబగబా లారీ ముందు నుంచి వెళ్లి అటువైపు వచ్చింది.
నీళ్లోడుతున్న చీర శరీరానికి పూర్తిగా అతుక్కుపోయి వుండటం వల్ల లారీ ఎక్కేందుకు ఇబ్బంది పడింది. గత్యంతరం లేక చీరని పైవరకు లాగి దోపుకుని కాలు లోనికి పెట్టింది. శ్రీకాంత్ చప్పున చూపులు పక్కకు తిప్పుకున్నాడు. ఆమె అదేం గమనించకుండా క్యాబిన్‌లో కూచుంటూ డోర్ మూసేసింది.
''డోర్ సరిగా పడలేదు. గట్టిగా వేయి.'' అన్నాడు శ్రీకాంత్ లారీని ముందుకు పోనిస్తూ. ఆమె డోర్‌ని రెండు చేతులతో పట్టుకుని బలంగా తనవైపు లాక్కుంది.
''అ లాక్కాదు'' అంటూ వంగి ఎడమ చేత్తో డోర్‌ని మళ్లీ తెరిచి బలంగా వేశాడు శ్రీకాంత్. యాదృచ్ఛికంగా ఆమె పొట్టకి తన మోచేయి తగలడంతో ఒక్కసారి అతని ఒళ్లు జలదరించినట్టయింది. తమాయించుకుని దృష్టిని రోడ్డు మీదకు మళ్లించి లారీ వేగం పెంచాడు.
ఆమె అదేం పట్టించుకోకుండా ''అబ్బ ఏం వర్షం'' అంటూ చీర కుచ్చిళ్లని పిండుకోసాగింది.
రోడ్డు క్లియర్‌గా వున్నప్పుడల్లా అతని చూపులు ఆమె వైపే మళ్లసాగాయి. లేత పసుపు రంగు చీర, అదే రంగు జాకెట్‌లో అపరంజి బొమ్మలా వుంది. ఆమె ఒంటి ఛాయలో జాకెట్ కలగలిసిపోయింది. సన్నని నడుము పిడికిట్లో ఇమిడేలా వుంది. వయసు రెండు పదులు దాటి వుండదు. పెళ్లయిన దాఖలాలు లేవు. ఇంత వర్షంలో... ఒంటిరిగా, అదీ చీకటి పడుతున్నవేళ ప్రయాణం చేయడం, తన లారీని ఆపి ఎక్కడం అతనికి వింతగా అనిపిస్తోంది. కుచ్చిళ్లు పిండుకోవడం అయిపోయాక పైటని తీసేసి వడిపెట్టసాగిందామె. కళ్లు చెదిరిపోయాయి.
అతని చూపులు తన శరీరాన్ని తడుముతున్న విషయం ఆమెకు తెలుస్తోనే వుంది. ''ఇటు కాదు కాస్త అటు చూస్తూ నడపండి. ఏదన్నా జరిగితే ఆనక నన్నంటారు'' అందామె చిలిపిగా.
శ్రీకాంత్ సర్దుకుని కూచున్నాడు.
''కొంచెం మీ టవల్ ఇస్తారా?''
''ఊ..'' అంటూ ముందుకు వంగాడు శ్రీకాంత్. అతని సీటు వెనకున్న టర్కీ టవల్‌ని తీసుకుని తలని తుడుచుకుంది. ఆ తర్వాత రెండు చేతుల్తో టవల్‌ని తన ఎదమీద కప్పుకుని అదుముకుంది. మెడనీ, భుజాలనీ, చేతులనీ తుడుచుకుంది. ఆమె పైట ఇంకా మోకాళ్ల మీదే వుంది.
చూపులు దారిమళ్లకుండా తనని తాను నిగ్రహించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు శ్రీకాంత్. లారీలో ప్రయాణికుల్ని ఎక్కించుకోవడం మామూలే అయినా అతనికి ఈ అనుభవం కొత్తగా వుంది.
''మీరు లారీ ఆపి ఎక్కించుకోకపోతే ఈపాటికి వర్షంలో చచ్చుండేదాన్ని'' అంది టవల్‌ని తిరిగి అతని సీటు వెనక ఆరేస్తూ.
అతనేం మాట్లాడలేదు.
పైటని ఒంటి చుట్టూ కప్పుకుంటూ తిరిగి అంది ''ఇంత పాత పాట వేశారేంటి? కొత్త పాటలేం లేవా?''
అప్పటికి 'లాహిరి లాహిరి లాహిరిలో... పాట అయిపోయి 'పయనించే మన వలపుల బంగరు నావా...'' పాట మొదలయింది.
''ఏం పాటలు కావాలి?'' రోడ్డు మీదనుంచి దృష్టి మళ్లించకుండానే అడిగాడు శ్రీకాంత్.
''ఏదైనా హృషారైన పాట!''
''అంటే?''
''బావలు సయ్యా?... సై... మరదలు సయ్యా?... సై..''లాంటిది.
ఆమె సమాధానానికి శ్రీకాంత్ ఎంత షాకయ్యాడంటే - యాక్సిలేటర్ మీద కాలు, స్టీరింగ్ మీది చేతులు పట్టుదప్పి లారీ ముందుకీ వెనక్కీ నాలుగైదు జర్క్‌లిచ్చింది.
''అబ్బే... ఊరికే అన్నాను. ఇవన్నీ బాగా విన్న పాటలే కదా అని...'' నవ్వుతూ అంది.
శ్రీకాంతేం మాట్లాడలేదు.
''ఈ లారీ మీ సొంతమేనా?'' అనడిగింది. అతను పెదవి విప్పలేదు.
''చాలా బావుంది.''
తలతిప్పి చివ్వున చూశాడు. ''మిమ్మల్ని కాదు, లారీని'' అంది
వెనకవైపు వున్న బెర్త్‌ని పరిశీలిస్తూ ''అబ్బ ఎంత విశాలంగా వుంది. ఇద్దరు పడుకోవచ్చు దీంట్లో'' అంది మళ్లీ తనే.
నిర్ఘాంతపోయాడు శ్రీకాంత్. చూడబోతే గొప్పింటి పిల్లలా వుంది. చదువుకున్న దాన్లా వుంది. ఇవేం మాటలు, ఇదేం బుద్ధి అనుకున్నాడు.
చలికి వణికిపోతున్నట్టు చేతులు కట్టుకుని ''నా పేరు జయశ్రీ... మీ పేరు?'' అనడిగింది.
''కాసేపు మాట్లాడకుండా కుదురుగా కూచోలేవా?'' కోపంగా అన్నాడు.
''ఉహు... పక్కన మనిషిలేనప్పుడు తప్ప'' అంది. ''మాట్లాడుతూ లారీ నడపడం కష్టమా?
''ఔను. నీలాంటి ఆడపిల్లలతో మరీ కష్టం''
''నాలాంటి ఆడపిల్లలంటే ... మీ ఉద్దేశం?''
''అపరిచితుల్తో కూడా వసపిట్టలా వాగేవాళ్లు అని...''
''పరిచయాలదేముంది... చేసుకుంటే అవుతాయి, మూతి ముడుచుకుని కూచుంటే అవవు. అది సరే నా పేరు చెప్పాను మీ పేరు చెప్పరా?''
''శ్రీకాంత్'' తప్పదన్నట్టు చెప్పాడు.
''అరె... మన ఇద్దరి పేర్లలోనూ శ్రీ లున్నాయి. జయశ్రీ శ్రీకాంత్ అని రాస్తే రెండు శ్రీలూ దగ్గరవుతాయి. శ్రీకాంత్ జయశ్రీ అని రాస్తే దూరమవుతాయి. చిత్రంగా వుంది కదూ?''
''...''
''ఇందాకటి ప్రశ్నకు సమాధానం చెప్పనేలేదు మీరు?''
''ఏంటి?''
''ఈ లారీ మీ సొంతమేనా అనడిగాను!''
''ఔను ... కాదు...!''
''అదేంటి?!''
''నేనే కొన్నాను కాబట్టి అవును ... బ్యాంక్ లోను ఇంకా తీరలేదు కాబట్టి కాదు.''
''అబ్బో ఏమో అనుకున్నాను. మీరు కూడా భలే మాట్లాడగలరే...!'' అంది నవ్వుతూ. ''కాకపోతే కాస్త స్టార్టింగ్ ట్రబుల్ వున్నట్టుంది' అని సణిగింది.
''ఏంటీ?!'' అన్నాడు శ్రీకాంత్ పౌరుషంగా.
''అబ్బే ఏం లేదుగానీ అటు చూడండి..అటు చూడండి'' అంది గాభరాపడిపోతూ.
హెడ్‌లైట్ల వెలుతురులో రోడ్డు మీద అడ్డదిడ్డంగా పరుగెత్తుకొస్తున్న గేదొకటి కనిపించింది. శ్రీకాంత్ లారీని బాగా స్లో చేశాడు. గేదె కొమ్ము లారీని గీచుకుంటూ పోయింది.
''ఇందాక లేదు కానీ, ఇప్పుడు బాగా చలిపెడుతోంది.''
''బెర్త్ మీద శాలువా వుంటుంది. తీసి కప్పుకో'' అన్నాడు శ్రీకాంత్.
జయశ్రీ లేచి శాలువా అందుకోబోతూ తూలి అతని మీద పడిపోయింది. ఒక్కసారిగా షాక్ తగిలినట్టయిందతనికి. ఆమె మరుక్షణమే తేరుకుని సిగ్గుపడిపోతూ ''సారీ'' అంది. ఆ స్పర్శ నుంచి తేరుకోడానికి శ్రీకాంత్‌కి మాత్రం చాలాసేపు పట్టింది.
ఆమె నిండుగా శాలువా కప్పుకుని ఏమీ ఎరగనిదాన్లా కూచుండిపోయింది.
కరీంనగర్ సమీపిస్తుండగా ఒక వ్యక్తి గొడుగు పట్టుకుని టార్చ్‌లైట్ ఊపుతూ ఎదురొచ్చాడు. శ్రీకాంత్ వెంటనే లారీ ఆపాడు. ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. జేబులోంచి యాభై రూపాయలు తీసి అతనికిచ్చి తిరిగి లారీ స్టార్ట్ చేశాడు శ్రీకాంత్.
''ఎవరతను? మీరతనికి డబ్బెందుకిచ్చారు? నన్ను చూస్తూ ఏదో అంటున్నాడేంటి?'' లారీ కదిలాక ప్రశ్నల వర్షం కురిపించింది జయశ్రీ.
''నీ కెందుకవన్నీ'' అన్నాడు శ్రీకాంత్.
''ప్లీజ్ చెప్పండి''
''తన మామూలు వసూలు చేసుకోడానికి వచ్చిన మనిషతను. దారిపోడవునా పోలీసులూ, వెహికిల్ ఇన్‌స్పెక్టర్లూ, ఆర్‌టీఓవాళ్లూ ఇట్లాగే తగులుతుంటారు మాకు''
''డబ్బివ్వకపోతే ఏం చేస్తారు?''
''ఏదో ఒక కేసు రాస్తారు. పగబడ్తారు. వేధిస్తారు.''
''మరి నన్ను చూసి ఏదో అంటున్నాడేమిటి?''
''ఎవరా పిల్ల అని అడిగాడు. లారీలో వున్న సరుకు ఓనరని చెప్పాను'' అన్నాడు.
లారీ మానేరు బ్రిడ్జి దాటి కరీంనగర్‌లో ప్రవేశించింది.
''ఎక్కడ దిగాలి?'' అడిగాడు.
''మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు?'' ఎదురు ప్రశ్నించిందామె.
''నాగ్‌పూర్ వరకు ఏం?''
''మీరు అనుమతిస్తే నేనూ నాగ్‌పూర్ వరకూ వస్తాను... ప్లీజ్...'' జాలిగా అందామె.
నిర్ఘాంతపోతూ పిచ్చిదాన్ని చూసినట్టు చూశాడు శ్రీకాంత్. ''నాగపూర్ అంటే ఏ మంకమ్మ తోటో అనుకుంటున్నావా ఏంటి?''
''నాకు తెల్సులెండి.''
''మరి సరదాగా అన్నావా?''
''కాదు. సీరియస్‌గానే అడుగుతున్నాను. నేను వరంగల్ ఆర్.ఇ.సి.లో చదువుతున్నాను. రోడ్ ట్రాన్‌సపోర్టేషన్ మీద థీసిస్ రాస్తున్నాను. అందుకే ఇట్లా పనిగట్టుకుని మీ లారీ ఎక్కాను. మీరు మంచి వారని మీతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాను'' అందామె.
శ్రీకాంత్ విస్తుపోయాడు.
''అబద్ధం కాదు. నిజం. ఒట్టు. ప్లీజ్...అన్ని దానాల్లోనూ విద్యాదానం గొప్పది'' అంది.
''సరుకు అన్‌లోడింగు... లోడింగు అయి తిరిగి రావడానికి నాకు మూడు నాలుగు రోజులు పడుతుంది.''
''ఫరవాలేదు.''
నమ్మలేనట్టుగా చూస్తూనే ''సరే నీ ఇష్టం'' అన్నాడు శ్రీకాంత్.
''థాంక్యూ ... థాంక్యూ వెరీ మచ్!'' ఎగిరిగంతేసినంత పనిచేసింది.
వర్షం ఇకా పడుతూనే వుంది. రోడ్డు మీద పెద్దగా జనసంచారం లేదు. కరెంట్ పోయిందేమో చీకటిగా వుంది రోడ్డు.
''వేడి వేడి టీ తాగాలని వుంది'' చేతులు రుద్దుకుంటూ అంది జయశ్రీ.
శ్రీకాంత్ లారీని ఓ హోటల్ ముందు ఆపాడు. ముందు తనుదిగి ఆమె డోర్ వైపు వచ్చాడు. ఈలోగా జయశ్రీ శాలువా మడతపెట్టి సీటు మీద వేసింది. పైట సరిచేసుకుని కొంగుని బొడ్లో దోపుకుంది. ఫుట్‌రెస్ట్ మీద కాలుపెట్టి దిగుతుంటే ఆసరాగా చేయి అందించాడు శ్రీకాంత్. ఆమె జారిపడిపోబోతూ అతని మెడను చుట్టేసుకుంది. ఒక్కసారిగా అతని గుండెలో విద్యుత్తు ప్రవహించినట్టయింది. క్షణకాలం అచేతనుడైపోయాడు. జయశ్రీయే ముందుగా తేరుకుని సిగ్గుపడిపోతూ దూరంగా జరిగింది.
ఇద్దరూ హోటల్లో అడుగు పెట్టారు. హోటల్లో కస్టమర్స్ ఒకరిద్దరే వున్నారు. టీకి ఆర్డరిచ్చి శ్రీకాంత్ సిగరెట్ వెలిగించాడు
''అదేంటి మీరు సిగరెట్ కాలుస్తారా?'' ఆశ్చర్యంగా అడిగింది.
''అవును ఏం?!'' అన్నాడు.
''అహ ఏంలేదు. లారీలో ఇప్పటివరకూ కాల్చకపోతేనూ...''
''దేవుడి పటం ముందు నేను సిగరెట్ కాల్చను. క్యాబిన్ నాకు దేవేలయంతో సమానం.'' అన్నాడు.
''ఓహో ఏం చేసినా క్యాబిన్ బయటే నన్నమాట.''తనలో తను అనుకుంటున్నట్టు నెమ్మదిగా అంది. ఆ మాటలోని ద్వంద్వార్థాన్ని గమనించి సూటిగా ఆమె కళ్లలోకి చూశాడు శ్రీకాంత్. ఆమె నవ్వుతూ చప్పున మొహం పక్కకు తిప్పింది. అంతలో సర్వర్ టీలు తీసుకొచ్చాడు. చెరో కప్పు అందుకుని టీ తాగడంలో నిమగ్నమయ్యారు ఇద్దరూ.
కరీంనగర్ నుంచి బయలుదేరాక వాళ్ల సంభాషణ పూర్తిగా లారీ ఫీల్డు గురించి సాగింది. లారీ ఓనర్ల, సాధక బాధకాలు, ప్రభుత్వోద్యోగుల వేధింపులు, అవినీతి, టాక్సులు, యాక్సిడెంట్లు, రోడ్ల పరిస్థితి, డ్రైవర్ల సమస్యలు, వాళ్ల వ్యసనాలు, అజ్ఞానం, పొగరుబోతుతనం మొదలైన వాటి గురించి శ్రీకాంత్ వివరిస్తుంటే జయశ్రీ శ్రద్ధగా వింది.
లక్సెట్టిపేట ఎప్పుడొచ్చిందో తెలియనేలేదు.
భోజనం చేసేందుకు లారీ ఆపాడు శ్రీకాంత్. తనకి ఆకలిగా లేదంది ఆమె. ఇంకా చాలా దూరం వెళ్లాలి. ముందు ముందు తినడానికి ఎక్కడా మంచి భోజనం దొరకదని బలవంతపెట్టాడతను. సరే అంటూ లేచింది. ఈసారి తనకు తానుగా పడిపోకుండా లారీ దిగింది.
ఆ ప్రాంతంలో వర్షం పడ్డ ఛాయలేం లేవు. ఆకాశంలో మబ్బు తునక కూడా లేదు. పైగా పుచ్చ పువ్వులా వెన్నెల కాస్తోంది.
ఇద్దరూ భోంచేస్తుండగా శ్రీకాంత్‌కు తెలిసిన డ్రైవర్లు ఒకరిద్దరు పలకరించారు. జయశ్రీ వంక అనుమానంగా చూశారు. కొందరు వెకిలిగా కామెంట్లు కూడా చేశారు. ఆ వాతావరణం, వాళ్ల మాటలు ఆమెకు మనస్తాపం కలిగించాయి. గబగబా రెండు మెతుకులు తిని వెళ్లి లారీ లో కూచుంది.
శ్రీకాంత్ మాత్రం కడుపు నిండా భోజనం చేసి తాపీగా సిగరెట్ కాల్చుకుని, వక్కపొడి నములుతూ వచ్చి లారీ స్టార్ట్ చేశాడు.
''నా మూడ్ పాడైపోయింది. ఏదైనా మంచి పాట వేయండి'' అందామె.
''నువ్వు మెచ్చే పాటలు నాదగ్గరేం లేవు కదా.'' అన్నాడు.
''పోనీ మీరే పాడండి.''
శ్రీకాంత్ గొంతు సవరించుకుని ''బావలు సయ్యా సై మరదలు సయ్యా సై'' అంటూ వెక్కిరింతగా పాడాడు.
జయశ్రీ పకపకా నవ్వింది. ''నేనేదో ఊరికే అన్నాను బాబూ. నాకు కూడా పాత పాటలంటేనే ఇష్టం'' అంది.
శ్రీకాంత్ క్యాసెట్ మార్చి టేప్ ఆన్ చేశాడు.
''ఆకాశ వీధిలో అందాల జాబిలి.... ఒయ్యారి తారను చేరి ఉయ్యాల లూగెనే... సయ్యాట లాడెనే ...''శ్రావ్యంగా వినిపించసాగింది పాట.
విండో లోంచి చందమామని చూస్తూ ''ఓహ్ మార్వలెస్'' అంది.
''ఏమిటి పాటనా..ప్రకృతా...?'' అడిగాడు.
''రెండూనూ.'' అంది.
ఓ అందమైన ఆడపిల్లని పక్కన కూచోబెట్టుకుని, వెన్నెల రాత్రి పెద్దగా ట్రాఫిక్ రద్దీలేని రోడ్డు మీద లారీ నడపడం థ్రిల్లింగ్ గా వుంది శ్రీకాంత్‌కు. శ్రమ తెలియకపోవడమే కాకుండా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, వింతగా అనిపిస్తోంది. మైలు రాళ్లు చకచకా అదృశ్యమై పోతున్నాయి.
అప్పుడే గుడిహత్నూర్ వచ్చేసింది.
జయశ్రీ బద్ధకంగా ఆవులించింది. ''టీ తాగుదామా'' అనడిగాడు.
''వద్దు మీరు తాగండి. నాకు నిద్రొస్తోంది.'' అంది. ఆ వెంటనే '' నేను నిద్రపోతే మీ డ్రైవింగ్‌మీద ఎఫెక్టేం పడదు కదా?'' అడిగింది.
''ఉహు. ఏం కాదు. బెర్త్ మీద పడుకో.'' అంటూ దాబా ముందు లారీ ఆపాడు.
అతను టీ తాగి వచ్చే సరికి జయశ్రీ బెర్త్ మీద గురకపెట్టి నిద్రపోతోంది. ఆమె కుడి చేయి తన సీటు మీద వేలాడుతోంది. 'ఈ కాలపు ఆడ పిల్లల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ముక్కూ మొహం తెలియని తనతో రాత్రి పూట, ఒంటరిగా నాగ్‌పూర్ వరకు ఏ ధైర్యంతో వస్తోందీ అమ్మాయి' అనుకున్నాడు.
సీటు మీద వేలాడుతున్న ఆమె చేతిని నెమ్మదిగా ఎత్తి ఆమె పొట్టమీద పెట్టాడు. శాలువాని నిండుగా కప్పాడు. రెప్పవాల్చకుండా రెండు క్షణాలు ఆమె మొహాన్ని తేరిపారా చూశాడు. ఎంత అందంగా వుందో' అని మనసులో అనుకోకుండా వుండలేకపోయాడు.
టేప్ రికార్డర్ ఆఫ్ చేయబోతుంటే ''నా హృదయంలో నిదురించే చెలీ.... కలలోనే కవ్వించే సఖీ...'' పాట మొదలయింది. తనకు ఎంతో ఇష్టమైన పాటల్లో అదొకటి.
పాట అయిపోయాక ఆఫ్ చేద్దాంలే అనుకుని, లారీ స్టార్ట్ చేసి, కేబిన్‌లోని లైట్ తీసేశాడు.
అతనికి హఠాత్తుగా కళ్యాణి గుర్తుకొచ్చింది.
కళ్యాణి ... తన ప్రేయసి ... కాబోయే తన శ్రీమతి.
కళ్యాణి ఇంటర్, తను డిగ్రీ సెకెండ్ ఇయర్‌లో వున్నప్పుడే తమ మధ్య ప్రేమ అంకురించింది. ఆర్థికంగా స్థిర పడ్డ తర్వాత పెళ్లి చేసుకోవాలని తాము అప్పుడే స్థిర నిర్ణయం తీసుకున్నారు. డిగ్రీ పూర్తయి రెండేళ్లు గడిచినా తనకి ఏ ఉద్యోగం దొరకలేదు. సమీప భవిష్యత్తులో దొరుకుతుందన్న ఆశ కూడా అడుగంటింది. దాంతో నాలుగు జీతం రాళ్ల కోసం మాటలు పడుతూఎవరి కిందో పనిచేయడం కంటే స్వయం ఉపాథి వెతుక్కోవడం బెటర్‌కదా అనిపించింది. ఆవిధంగా తను బ్యాంకు లోన్‌తో లారీ కొని ఈ ఫీల్డులో ప్రవేశించాడు. తన మిత్రుల్లో కొందరు ఈ ఫీల్డులో వుండటం కూడా అందుకు ఓ కారణం. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా స్థిరపడుతున్నాడు. మరో ఆరు నెలలయితే అప్పులన్నీ తీరి లారీ పూర్తిగా సొంతమవుతుంది. అప్పుడిక తమ పెళ్లికి ఏ ఆటంకమూ వుండదు.
ఈ అమ్మాయి స్థానంలో తన కళ్యాణే వుండి వుంటే ఎంత బావుండేదో. మదిలో ఆ ఊహ మెదలగానే మనసంతా అదోలా అయిపోయింది. అప్పటికే 'నా హృదయంలో నిదురించే చెలి' పాట కూడా అయిపోవడంతో క్యాసెట్‌ని రివైండ్ చేసి మళ్లీ అదే పాటను వేసుకున్నాడు.
సరిగ్గా అదే సమయంలో ''ఈ పాటంటే మీకు అంత ఇష్టమా?'' అన్న ప్రశ్న వెనక నుంచి వినిపించడంతో శ్రీకాంత్ తత్తరపడిపోయాడు.
''ఏంటీ నువ్వింకా నిద్రపోలేదా?'' ఆశ్యర్యంగా అడిగాడు.
''ట్రైన్‌లోనే నాకు నిద్రపట్టి చావదు. ఇంక లారీలో ఏం పడుతుంది?''అంది జయశ్రీ బెర్త్ మీదనుంచి కిందకు దిగుతూ.
''మరి ఇందాక గురకపెట్టినట్టున్నావ్?''
''ఊరికే. మీరేం చేస్తారో చూద్దామని. మీరు లారీ ఎక్కడం, మీ సీటు మీంచి నా చేతిని తీసి నా మీద పెట్టి శాలువా కప్పడం అన్నీ తెలుసు నాకు.'' అంటూ నవ్వింది.
బహుత్ ఖతర్‌నాక్ ఛోక్రీ అనుకున్నాడు శ్రీకాంత్ తన మనసులో.
''చెప్పండి. మీ హృదయంలో నిదురించే చెలి ఎవరు?''
''నోర్మూసుకుని పడుకోఫో'' అన్నాడు శ్రీకాంత్.
''నిద్ర రావట్లేదు అన్నాను కదా?''
''ప్రయత్నిస్తే అదే వస్తుంది.''
''సరే ముందు మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి ఆ తరువాత మళ్లీ ప్రయత్నిస్తాను.'' అంది గారంగా.
కళ్యాణి గురించి చెబితేనన్నా పిచ్చి వేషాలు వేయకుండా వుంటుందనిపించి తమ ప్రేమ వృత్తాంతం అంతా వివరించాడు శ్రీకాంత్. అప్పులతో వైవాహిక జీవితాన్ని ప్రారంభించడం ఇష్టంలేకే ఇన్నాళ్లు ఆగాల్సి వచ్చిందని, మరో ఆరు నెలళ్లో తాము వివాహం చేసుకోబోతున్నామని కూడా చెప్పాడు.
''కళ్యాణి ఎంత అదృష్టవంతురాలో...''అంది జయశ్రీ.
''ఎందుకు?'' అన్నాడు శ్రీకాంత్.
''జీవితం పట్ల స్థిరమైన అభిప్రాయాలు, పర్‌ఫెక్ట్ ప్లానింగ్ వున్న మీలాంటి పురుషోత్తముడు ఎంత పుణ్యం చేసుకుంటే దొరకాలి ఈ రోజుల్లో. నాకు మీ కళ్యాణి మీద జెలసీగా వుంది.''
''చాలు చాల్లే. వెళ్లి పడుకో, ఇక.'' కసురుకున్నాడు శ్రీకాంత్.
''అ లాగే...! ఆ ల్ ది బెస్ట్! ఇక మళ్లీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే ఒట్టు'' అని తిరిగి బిస్తరెక్కింది జయశ్రీ. అన్నట్టుగానే కాసేపట్లోనే నిద్రలోకి జారుకుంది. లారీ నాగపూర్ పొలిమేరల్లో ప్రవేశించేవరకూ ఆమె లేవలేదు.
నాగపూర్ వచ్చేక బెర్త్ మీంచి కిందకు దిగుతూ ''అరె, అప్పుడే తెల్లారిపోయిందా?'' అంది ఆశ్చర్యపడిపోతూ.
''తెల్లారడం కాదు. పదికావస్తోంది.''అన్నాడు శ్రీకాంత్. ''లారీలో నిద్రే పట్టదని ఓ పెద్ద గోల చేశావుగా అప్పుడు?''
జయశ్రీ సిగ్గు పడిపోయింది.
''నన్ను కొంచెం రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయరా? ట్రైన్‌లో కాజీపేటకు వెళ్లి పోతాను.'' అర్థిస్తున్నట్టుగా అడిగింది.
శ్రీకాంత్ ఆశ్చర్యపడుతూ ''అదేమిటి? ఇంత హఠాత్తుగా మనసు మార్చుకున్నావేం?'' అన్నాడు.
''మరేం లేదు. ఇంట్లో చెప్పిరాలేదు. ఆందోళన పడ్తారేమోనని.'' అంటూ నసిగింది.
''సరే గానీ ఇంకోసారెప్పుడూ ఇట్లా పిచ్చి పిచ్చి సాహసాలు చేయకు. నీకే మంచిది కాదు. ఈ లారీని ఇక్కడే కంపెనీ దగ్గర అప్పగించి స్టేషన్‌కు వెళ్దాం'' అన్నాడు శ్రీకాంత్.
''సరే'' అని బుద్ధిగా తలూపింది.
... ఃఃః ... ఃఃః
హుజురాబాద్ తిరిగి చేరుకున్న జయశ్రీ నేరుగా కళ్యాణి ఇంటికి పరుగు పరుగున వెళ్లింది.
హుషారుగా వస్తున్న స్నేహితురాలిని అ ల్లంత దూరం నుంచే చూసిన కళ్యాణి గుండెలు దడదడలాడాయి.
జయశ్రీ వస్తూనే కళ్యాణిని వాటేసుకుని గిరగిరా తిప్పుతూ ''నువ్వే గెలిచావే. నీ ఫియాన్స్ నిజంగా హీరోనే.'' అంది సంతోషంగా.
''నువ్వు... నిజంగా అన్నంత పనీ చేశావా? ఆయనతో లారీలో వెళ్లావా? నిజంగా?'' నమ్మలేకపోతున్నట్టుగా అడిగింది కళ్యాణి.
''ఆ బేషుగ్గా వెళ్లాను. ఇక్కడి నుంచి కరీంనగర్ వరకు కాదు, ఏకంగా నాగ్‌పూర్ వరకు వెళ్లాను'' గర్వంగా అంది జయశ్రీ.
''ఎంత ధైర్యమే నీకు. అసలు ఎట్లా వెళ్లావు. ఏం జరిగింది వివరంగా చెప్పు'' కుతూహలాన్ని ఆపుకోలేకపోయింది కళ్యాణి.
''చెబుతున్నా కదే. నీ నిర్ణయం సరైందే. నీ కాబోయే భర్త నిజంగా చాలా ఉత్తముడు. లారీ ఫీల్డ్ మీదా, డ్రైవర్ల మీదా నాకున్న దురభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. చేసే వృత్తి ఏదైతేనేం మనసు సరిగా వుండాలి. శ్రీకాంత్ రియల్లీ ఎ జెమ్.''
''నిజమా?''
''ఒట్టు. ఎన్ని రకాలుగా కవ్వించినా అస్సలు హద్దు మీరలేదు. చాలా హుందాగా ప్రవర్తించాడు. పైగా మాటల సందర్భంలో తను నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో కూడా చెప్పాడు.''
కళ్యాణి భావగర్భితంగా నవ్వింది.
తన స్నేహితురాలినుంచి తను ఆశించిన రియాక్షన్ రాకపోయేసరికి ''ఏంటే ఒంట్లో బాగో లేదా?'' అని అడిగింది.
''అబ్బే, బాగానే వుంది'' అంది కళ్యాణి.
'' మరి...? నేను ఎంతో ఇన్‌వెస్టిగేట్ చేసి అందించిన వార్తకు ఎగిరి గంతేస్తావనుకుంటే ఇట్లా బెల్లం కొట్టిన రాయిలా అయిపోయావేంటి?'' అనుమానంగా చూస్తూ అడిగింది జయశ్రీ.
''లేదే నాకెంతో ఆనందంగా వుంది.''
''ఉహు... నీ మొహం చూస్తుంటే నాకలా అనిపించడం లేదు. నువ్వేదో దాస్తున్నావు. నిజం చెప్పు, లేకపోతే నా మీద ఒట్టే.'' కళ్యాణి చేతిని బలవంతంగా లాక్కుని తన తల మీద పెట్టుకుంది జయశ్రీ.
దాంతో కళ్యాణి కాసేపు తటపటాయించింది. ఆ తరువాత నిర్వికారంగా చూస్తూ ''నీ దగ్గర దాపరికం ఎందుకు ... నేను...నేను... శ్రీకాంత్‌కి ఈ విషయం ముందే లెటర్ ద్వారా తెలియజేశాను.'' అంది.
''అంటే.....'' కెవ్వుమని అరిచింది జయశ్రీ.
''జయశ్రీ అనే గడుగ్గాయి నిన్ను పరీక్షించడానికి వస్తోంది. జాగ్రత్తగా ప్రవర్తించమని...''
మాట పూర్తికాకముందే ''ఛీ .........'' అంటూ ఆమెను ఒక్క తోపు తోసింది జయశ్రీ. ఆ విసురుకు కిందపడిపోబోయి అతి ప్రయత్నం మీద నిలదొక్కుకుంది కళ్యాణి.
''ఎంత ద్రోహం చేశావే. నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది కదే. ఇందుకా ఆ మానవుడు అపర ప్రవరాఖ్యుడిలా ప్రవర్తించాడు. మీరిద్దరూ కలిసి నన్ను ఫూల్‌ని చేశారన్నమాట. ఛి...ఛి... చ్ఛీ...ఇక జన్మలో నీ మొహం చూడను'' ఆక్రోశంగా అంది జయశ్రీ.
''అది కాదే నామాట విను. ఈ ప్రయోగం వికటించి... సరసం కాస్తా విరసంగా మారి ... నీ కేదైనా జరిగితే నేను తట్టుకోగలనా చెప్పు. ఆ భయంతోనే అట్లా లెటర్ రాశాను తప్ప నిన్ను అవమానించడానికి కాదే... ప్లీజ్ నన్ను అర్థం చేసుకో....'' అర్థిస్తూ అంది కళ్యాణి.
''చాలు చాల్లేవే. నేను నీకు ముందే చెప్పాను కదా. కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్‌ని. నన్ను నేను రక్షించుకోగలను. నాకేం కాదని. అయినా నా మాట నమ్మకుండా, నాకు తెలియకుండా అతనికి ముందే లీక్ చేస్తావా? బుద్ధుందా నీకు. ఇక అఘోరించు. ఈ మాత్రం దానికి ముందే గట్టిగా వద్దనలేకపోయావా?'' కోపంతో ఊగిపోయింది జయశ్రీ.
వాళ్లు అ లా వాదులాడుకుంటుండగానే ''పోస్ట్...'' అంటూ పోస్ట్‌మెన్ వచ్చి కళ్యాణికి రెండు ఉత్తరాలు యిచ్చి వెళ్లాడు.
ఓ ఉత్తరాన్ని చూసి ''అరె...! ఇది నేను రాసిన ఉత్తరమే. శ్రీకాంత్‌కి అందలేదన్నమాట'' అంది నిర్ఘాంతపోతూ.
జయశ్రీ గభాల్న ఆ ఉత్తరాన్ని కళ్యాణి చేతుల్లోంచి లాక్కుంది. శ్రీకాంత్ చిరునామా కొట్టివేయబడి 'అడ్రస్సీ నాట్ ఫౌండ్' అని ఎర్ర పెన్నుతో రాసి వుంది. ఈసారి నిర్ఘాంతపోవడం ఆమె వంతయింది.
ఈలోగా కళ్యాణి రెండో కవర్ తెరిచింది. అది శ్రీకాంత్ తనకు రాసిన ఉత్తరం. అప్రయత్నంగా కళ్యాణితో పాటు జయశ్రీ కూడా దానిని కలిసి చదివింది. అందులో స్వీట్ నథింగ్స్ ఏమీ లేవు. ''తాము అనుకోకుండా వరంగల్ నుంచి హనుమకొండకు మకాం మార్చినట్టు తెలిపాడు. ఇదివరకటిది చిన్న ఇల్లు, ఇప్పుడు తీసుకున్నది చాలా పెద్ద ఇల్లు, పెళ్లయ్యాక తమకు చాలా కన్వీనియంట్‌గా వుంటుందని రాశాడు. ఇక నుంచి ఉత్తరాలు కొత్త అడ్రస్‌కి రాయమని'' సూచించాడు.
వాస్తవం బోధపడిన తరువాత స్నేహితురాళ్లిద్దరూ కాసేపు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ కొయ్యబారిపోయారు.
ఃఃః ఃఃః ఃఃః
(స్వాతి సపరివార పత్రిక 18-3-1994 సంచికలో ప్రచురించబడిన ''సరసమైన కథ'' యిది. ఫోను సౌకర్యం విస్తరించక ముందు, సెల్‌ఫోన్లు ఆవిర్భవించక ముందు, ఉత్తరాల కాలంలో రాసిన కథ. స్వాతి సంపాదకులకు కృతజ్ఞతలతో -ర)
...................