Friday, May 15, 2009

ఉష్ట్ర పక్షులు ...





ఉష్ట్ర పక్షులు


ఉన్న పిడికెడు ఉద్యోగాలను
ఉత్తరాలూ, దక్షిణాలూ రాబందుల్లా
తన్నుకుపోతున్నప్పుడు
నువ్వింకా ఎంతకాలం ప్రతిభా ప్రతిభా
అంటూ పలవరిస్తూ కూచుంటావు?
ఇంకా ఏం తాకట్టుపెట్టి, ఏం అమ్ముకుని
ద్రవ్యోల్బణాన్నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తావు?

ఈ దుష్ట వ్యవస్థ సృష్టించిన రోగక్రిములతో
నువ్వు తినే తిండీ, తాగే నీరూ, పీల్చే గాలీ
కలుషితమైపోతున్నప్పుడు
ఏ యోగాసనాలు, ఏ ప్రాణాయామాలు
క్షీణిస్తున్న నీ ఆరోగ్యాన్ని కాపాడతాయని భ్రమిస్తావు?

నీ చుట్టూ కోట్లాదిమంది
ఆకలిమంటల్లో అ ల్లాడిపోతున్నప్పుడు
నువ్వు కూడబెట్టుకున్న ధాన్యాన్నీ, దనరాసుల్నీ
ఏ సొరంగాల్లో భ్రద్రంగా దాచుకోగలవు?

నేల అట్టడుగు పొరల్లోంచి ఉద్యమ
భూప్రకంపనాలు ప్రజ్వరిల్లుతున్నప్పుడు
నువ్వు నీ హంసతూలికా తల్పం మీద
ఇంకా ఎంత కాలం నిశ్చింతగా నిద్రపోగలవు??


(ఎపిఎస్‌ఆర్‌టిసి ఆర్ట్స్‌కో 1991లో నిర్వహించిన కవితల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత)