Thursday, March 26, 2009

అనగనగా ఒక చందమామ కథ


ఏడుస్తున్న బిడ్డను లాలించేందుకు... కొసరి కొసరి గోరుముద్దలు తినిపించేందుకు... ఆకాశంలో వేలాడే చందమామని ఆశ్రయిస్తుంది అమ్మ.

అందుకే పాలుగారే ప్రాయంలోనే మనకు చందమామతో ఆత్మీయమైన అనుబంధం ఏర్పడుతుంది.
మిగతా బంధాల మాట ఎలా వున్నా చందమామతో ఏర్పడిన బంధం మాత్రం ఎన్నటికీ చెక్కు చెదరదు. ఏ వయసులోనైనా, ఎంత యాంత్రికంగా మనుగడ సాగిస్తున్నప్పుడైనా తలెత్తి తనవంక చూస్తే చాలు చల్లని వెన్నెల స్పర్శతో మనసు పరవశమవుతుంది.

ఆకాశంలోని చందమామతో పాటు భూలోకంలోని మరో చందమామతో ఏర్పడే అనుబంధం కూడా అంత గాఢమైనదే.

చక్రపాణి, నాగిరెడ్డి గార్లు పిల్లలకోసం అ లనాడే ఓ పత్రికకు ప్రారంభించడం, దానికి ''చందమామ'' అని పేరు పెట్టడం ఎంతో అబ్బురమనిపిస్తుంది.

రెండో తరగతిలోనో మూడో తరగతిలోనో వున్నప్పుడే నాకు చందమామతో పరిచయం ఏర్పడింది.
ఎవరో మా ఇంటికి వచ్చిన వాళ్లు ఒక చందమామ ప్రతిని నాకు కావాలనే ఇచ్చారో, లేక మరిచిపోయి వదిలివెళ్లారో గుర్తులేదు కానీ నన్నది తొలిచూపులోనే వశీకరించుకుంది. క్లాసు పుస్తకాలలో లేని ఆకర్షణ ఏదో చందమామలో వుందని అప్పుడే అనిపించింది. కొన్ని నెలలపాటు రోజుకు ఒకసారైనా ఆ చందమామని ముందేసుకుని తరగని ఆసక్తితో అందులోని బొమ్మల్ని తిరగేస్తూ కూర్చునేవాణ్ని. ఒక్కో వాక్యాన్ని కూడబలుక్కుంటూ చదివేవాణ్ని. అది చూసి మా అమ్మ నాకు అప్పుడే బోలెడంత చదువు వచ్చేసినట్టు మురిసిపోతూండేది.

నిజంగా నాకు చదువు మీద జిజ్ఞాసని పెంచిందీ, పుస్తకాలను ప్రేమించడం నేర్పిందీ చందమామే.

ఆ తరువాత కొంతమంది మిత్రులం కలిసి నాలుగో తరగతినుంచే తలా కొంత డబ్బు (!) వేసుకుని చందమామని కొనడం ప్రారంభించాం. రెండు మూడు సీరియళ్లని బైండు కూడా చేయించాం. అది వేరే కథ.
చందమామలో దయ్యాలు, భూతాలు, మంత్రాలు, తంత్రాలు ఎన్నివున్నా బలమైన నీతిసూత్రం వల్ల కాబోలు ఆ కథలు నాలో మూఢనమ్మకాలనుగానీ, అశాస్త్రీయమైన ఆలోచనలను గానీ పెంచలేదు. పైగా మంచితనాన్ని, మానవతని, సృజనాత్మకతని పెంపొందించాయి.

చందమామ పుస్తకాలు.... కాంతారావు (విఠలాచార్య) సినిమాలు.... దారాసింగ్‌ కింగ్‌కాంగ్‌ల కుస్తీలు...... ఓహ్‌ బాల్యం ఎంత మధురమధురంగా వుండేదో.


ఒక చందమామ కొనాలన్నా.... 37 పైసలు పెట్టి ఒక సినిమా చూడాలన్నా ... కనా కష్టంగా వుండేదారోజుల్లో మాకు.
అట్లాంటిది ఇప్పుడు ఒక ఊరి గ్రంథాలయానికి సరిపడేన్ని పుస్తకాలు ఇంట్లో వున్నా నా పిల్లలకు క్లాసు పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాల పట్ల ఆసక్తి కలగలేదు.
నేనే కలిగించలేకపోయానేమో.
అది నా ఒటమేనేమో.
వాళ్లు ఎంత ఉన్నత చదువులు చదివినా నాకిది తీరని వెలితిగా అనిపిస్తుంది. చాలా బాధనిపిస్తుంది.

సెల్లులు, వీడియో గేములు, కంప్యూటర్లు, చాటింగ్‌లు ... వాళ్ల ప్రపంచమేవేరు. వాళ్ల అభిరుచులే వేరు.

ఈమధ్య కూడలిలో చందమామ గురించిన ప్రస్తావనలు చూసిన తరువాత ఇవన్నీ గుర్తొచ్చాయి.
పాత చందమామ సంచికలు ఇంటర్నెట్‌లో లభిస్తాయని తెలిసినప్పుడు ఎంత ఆశ్చర్యమనిపించిందో.

నేను ''గొడ్డలి పదును'' అనే ఒకే ఒక చందమామ కథ రాశాను.
దానిని నెట్‌లో వెతికి వెతికి పట్టుకున్నప్పుడు ఎవరెస్ట్‌ శిఖరమెక్కినంత ఆనందం కలిగింది.
అట్లాగే చందమామ ఫోటో వ్యాఖ్యల పోటీలో నాకు మూడు నాలుగు సార్లు బహుమతులు వచ్చాయి. వాటిని కూడా వెతికి పట్టుకోవాలి.

చందమామ అభిమానులు పాత సంచికలకోసం ఈ కింది వెబ్‌సైట్‌ని చూడవచ్చు.
http://www.ulib.org/
(Advanced Search...Title : Chandamama
Language: Telugu)

ఈ సమాచారం అందించిన సహ బ్లాగర్లు
నాగమురళి,
వేణువు,
బ్లాగాగ్ని
గార్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ
నా ఏకైక చందమామ కథను ఇక్కడ పొందుపరుస్తున్నాను.
..................................................................................






గొడ్డలి పదును


దేవగిరి రాజ్యాన్ని, ఒకప్పుడు విక్రమసింహుడనే రాజు పాలించేవాడు. ఆయన కొలువులో యుగంధరు డనే మంత్రి, శశివర్మ అనే సేనాధిపతి వుండేవాళ్లు. ఒకరు మహా మేధావి అయితే మరొకరు అపర పరాక్రమశాలి. వారి కారణంగా దేవగిరి రాజ్యం శత్రువులకు దుర్భేద్యంగా, సుఖశాంతులతో అలరారుతూండేది.

ఇలా వుండగా, ఒకనాడు సేనాధిపతి శశివర్మ హృద్రోగానికి గురై అకాలమరణం పాలయ్యాడు. శశివర్మ స్థానంలో సేనాధిపతిగా ఎవరిని నియమించాలన్నది పెద్ద సమస్య అయింది.

మంత్రి యుగంధరుడితో సమాలోచించి, సైన్యాధిపతి పదవికి తగిన యోధులకోసం రాజ్యంలో చాటింపు వేయించాడు, రాజు విక్రమసింహుడు. అది విని రాజ్యంలోని అనేకమంది యుద్ధ విద్యలు నేర్చిన యువకులు ముందుకు వచ్చారు.

వాళ్లందరికీ గుర్రపుస్వారీ, కత్తియుద్ధం వంటి ఎన్నో అంశాలలో పోటీలు నిర్వంహించారు. ఓడిపోయిన వారు పోగా, నిశాంతుడు, నిఖిలుడు అనే ఇరువురు మాత్రం అన్ని పోటీలలోనూ సమ ఉజ్జీలుగా నెగ్గారు. వారిరువురి శక్తి సామర్థ్యాలూ ఒకే విధంగా వున్నాయి. ఆ ఇద్దరిలో సైన్యాధిపతి పదవికి ఎవరిని ఎంపిక చేయాలో, విక్రమసింహుడికి అంతుపట్టలేదు.

ఆయన, మంత్రి యుగంధరుడి సలహా మీద ఒక విలువిద్యా ప్రదర్శన ఏర్పాటు చేశాడు. రెండు మద్ది చెట్ల చిటారు కొమ్మల్లో, రెండు లక్ష్యాలను అమర్చాడు. వాటి ప్రతిబింబాలను కిందనున్న అద్దాల్లో చూస్తూ, వాటిని బాణాలతో పడగొట్టాలి.

ఆదేశం అందుకున్న రెండు, మూడు క్షణాల్లోనే నిఖిలుడు అతి సునాయాసంగా లక్ష్యాన్ని నేలకూల్చాడు. నిశాంతుడు మాత్రం అద్దంలో లక్ష్యాన్ని చూస్తూ, సరిఅయిన కోణం కోసం అటూ యిటూ కదిలి కొంత ఆలస్యంగా ఛేదించాడు.

''నిఖిలుడే సేనాధిపతి పదవికి అర్హుడు!'' అన్నాడు విక్రమసింహుడు.

''క్షమించండి, మహారాజా! మీ అభిప్రాయంతో నేను ఏకీభవించలేను.'' అన్నాడు యుగంధరుడు సవినయంగా.

''అదేమిటి మహామంత్రీ! ఆదేశించిన మరుక్షణమే, లక్ష్యాన్ని ఛేదించాడు, నిఖిలుడు. కానీ, నిశాంతుడు అటూయిటూ తచ్చాడి తచ్చాడి, ఆలస్యంగా లక్ష్యాన్ని పడగొట్టాడు. మరి, నిశాంతుడి కంటే నిఖాలుడే సమర్థుడని నిర్ణయించడంలో సందేహపడవలసినదేమున్నది?'' అని ప్రశ్నించాడు విక్రమసింహుడు.

అందుకు మంత్రి, ''మహారాజా, నిశాంతుడు లక్ష్యాన్ని పడగొట్టడంలో కొంత ఆలస్యం చేయడం, అతడి సామర్థ్యలోపంగా భావించకూడదు. లక్ష్యాన్ని తప్ప అనవసరంగా ఒక్క ఆకును కూడా రాల్చకూడదన్న ఉద్దేశంతోనే, అతడు కొంత తాత్సారం చేశాడు. సరిగ్గా అనుకున్న విధంగా లక్ష్యాన్ని పడగొట్టాడు. కానీ, నిఖిలుడి బాణం దెబ్బకు లక్ష్యంతోపాటు, ఆకులూ, రెమ్మలే కాదు - ఒక కొమ్మ కూడా నేలకూలింది. కనుక నిఖిలుడి కంటే నిశాంతుడే యోగ్యుడు, సమర్థుడు!'' అని వివరించాడు యుగంధరుడు.

రాజు విక్రమసింహుడు పునరాలోచన చేశాడు. మంత్రి చెప్పింది ఆయనకు వాస్తవంగా తోచింది.

మంత్రి రాజుతో, ''మహారాజా, మీరు అనుమతిస్తే, మరొక చిన్న పోటీ ఏర్పాటు చేస్తాను. అందులో బుద్ధిబలం, భుజబలం సమపాళ్లలో వున్న నిశాంతుడే సేనాధిపతి పదవికి అర్హుడని మీరే నిర్ణయించగలరు.'' అన్నాడు.

అందుకు విక్రమసింహుడు తన అంగీకారం తెలిపాడు.

యుగంధరుడు వెంటనే రెండు గొడ్డళ్లను తెప్పించాడు. నిశాంతుడికీ, నిఖిలుడికీ చెరొకటి యిస్తూ, ఎదురుగా వున్న రెండు మద్దిచెట్లను నరకమని అదేశించాడు. చెట్టును ఎవరు ముందుగా నరుకుతారో, వారే సేనాధిపతి అని యిద్దరికీ చెప్పాడు.

నిఖిలుడు, గొడ్డలి అందుకున్న మరుక్షణమే ఉత్సాహం ఉరలు వేస్తుండగా వెళ్లి, చెట్టును నరకడం ప్రారంనించాడు. నిశాంతుడు మాత్రం గొడ్డలిని అందుకుని, ఒకసారి దానివంక పరీక్షగా చూశాడు. అది అంత పదునుగా లేకపోవడం గమనించి, దగ్గరలో కనిపించిన ఒక రాతి మీద దానికి పదును పెట్టడంలో లీనమై పోయాడు.

ఆవిధంగా రెండు గంటల కాలం గడిచింది. నిఖిలుడు అప్పటికే తన చెట్టు మొదలును చాలా భాగం నరికేశాడు. నిశాంతుడు మాత్రం యింకా తన గొడ్డలకి పదును పెడుతూనే వున్నాడు.

రాజు విక్రమసింహుడు, వాళ్ల వంక ఆశ్చర్యంగా చూడసాగాడు. యుగంధరుడు నిశాంతుడి వంక మెచ్చుకోలుగా చూడసాగాడు.

నిశాంతుడు మరి కొంతసేపటికి, బాగా పదునెక్కిన తన గొడ్డలికేసి తృప్తిగా చూసుకుని, తన చెట్టును నరకడం మొదలు పెట్టాడు. ఆసరికే నిఖిలుడి భుజాల్లో శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. అతడి మొండి గొడ్డలి దెబ్బలకు చెట్టు తెగడంలేదు.

నిశాంతుడు మాత్రం పెద్దగా అ లసిపోకుండానే, చకచకా తన చెట్టును పూర్తిగా నరికి పడగొట్టాడు. అది చూసి నిఖిలుడు, సగం తెగిన తన చెట్టు మొదలు వద్ద నిస్సత్తువుగా కూలబడిపోయాడు.

రాజు అపరిమితానందంతో మంత్రి యుగంధరుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. అప్పటికప్పుడే నిశాంతుడు దేవగిరి రాజ్య సేనాధిపతిగా నియమించబడ్డాడు.

(చందమామ జూన్‌ 1988 సౌజన్యంతో)